top of page

ఏటిగట్టు నివాసం.. హక్కుల్లేక విలాపం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 19, 2025
  • 2 min read
  • నాగావళి గట్టు, చెరువు గర్భంలో ఆవాసాల ఏర్పాటు

  • వాటిలో వెలసిన 11 కాలనీల్లో 673 కుటుంబాలు

  • 50 ఏళ్లుగా పన్నులు కడుతున్నా దఖలు పడని అధికారం

  • ప్రభుత్వ నిబంధనలు సడలిస్తే తప్ప పట్టాలు ఇవ్వలేని దుస్థితి

  • ఎమ్మెల్యే చొరవతో సమస్యపై దృష్టి సారించిన యంత్రాంగం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అర్ధశతాబ్ది నుంచి అక్కడే ఉంటున్నారు. ఇంటిపన్ను, కుళాయిపన్ను, కరెంటు బిల్లు.. అన్నీ కడుతున్నారు. కానీ వారు ఉండే అవాసాలపై మాత్రం వారికి ఎటువంటి హక్కు లేదు. కారణం.. చెరువు గర్భాలు, నాగావళి గట్లపై వారంతా నివాసాలు ఏర్పాటు చేసుకోవడమే. ఇదంతా ఎక్కడో కాదు.. శ్రీకాకుళం నగర పరిధిలోని 11 కాలనీల్లో చెరువు గర్భం, నాగావళి గట్టు ఆక్రమించుకుని సుమారు 673 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ నివాసాలపై వీరికి ఎటువంటి హక్కుపత్రాలు లేవు. అందువల్ల ఉన్నన్నాళ్లు అనుభవించడం తప్ప క్రయవిక్రయాలు చేయడానికి వీల్లేదు. ఇళ్లు నిర్మించుకోవడానికి గానీ, రిపేర్లకు గానీ అనుమతులు లభించవు.. రుణాలూ పుట్టవు. ఒక్కమాటలో చెప్పాలంటే సొంత ఇళ్లని చెప్పుకోవడమే వాటిపై నివాసులకు ఎటువంటి అధికారం లేదు. నానాపాట్లు పడి డబ్బు సమకూర్చుకుని పలువురు పక్కా నిర్మాణాలు చేపట్టినా వాటికి రెవెన్యూ అధికారులు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. దానికి నిబంధనలు అంగీకరించవు. చెరువు గర్భం, గట్ట్టు, రివర్‌ బ్యాంక్‌ ఏరియాలో ఇళ్లు నిర్మించడాన్ని నిబంధనలు అంగీకరించవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే నిబంధనలు సడలిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలి. అంతవరకు పట్టాలు మంజూరు చేయడానికి అవకాశం లేదు.

ఏటిగట్టువాసుల అవస్థలను గుర్తించిన ఎమ్మెల్యే గొండు శంకర్‌ అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి అయిన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు సమస్యను విన్నవించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆ మేరకు ఆ ప్రాంత సచివాలయ రెవెన్యూ కార్యదర్శలు, ఆర్‌ఐ, టౌన్‌ సర్వేయర్‌తో విచారణ జరిపించి సమగ్ర నివేదిక రూపొందించేందుకు తహసీల్దార్‌ చర్యలు ప్రారంభించారు.

నిబంధనలే అడ్డంకి

చెరువు గర్భం, ఏటిగట్టుపై వెలసిన 11 కాలనీల నివాసితులు పొజిషన్‌ సర్టిఫికెట్ల కోసం దశాబ్దాలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే నిబంధనలు అంగీకరించకపోవడంతో రాజకీయ నాయకులు సిఫార్సు చేసినా కూడా అధికారులు ఇన్నాళ్లుగా తిరస్కరిస్తున్నారు. ఈ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తే తప్ప పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌ చొరవతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదులుతోంది.

నగరంలోని నీలమ్మ కాలనీ సర్వే నెంబర్‌ 155లో ఉన్న చెరువు గట్టుపై 68 కుటుంబాలు ఉంటున్నాయి. శ్రీనివాసనగర్‌ కాలనీ సర్వే నెంబర్‌ 139లో ఉన్న చెరువు గర్భంలో 29 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకున్నాయి. చౌదరి సత్యనారాయణ కాలనీ సర్వే నెంబర్‌ 149లో ఉన్న చెరువులో 257 కుటుంబాలు ఉంటున్నాయి. మంగువారితోట పరిధిలో నాగావళి గట్టును ఆక్రమించి 35 కుటుంబాలు, రెల్లివీధిలో 19 కుటుంబాలు ఉంటున్నాయి. సీపన్నాయుడుపేట పరిధిలో 47 కుటుంబాలు చెరువు గర్భంలో ఇళ్లు నిర్మించుకున్నట్ల రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. నాయుడు చెరువు గట్టు సర్వే నెంబర్‌ 132లో 76 కుటుంబాలు, గూనపాలెంలో టౌన్‌ సర్వే నెంబర్‌ 204లో చెరువు గట్టుపై 51 కుటుంబాలు, పెద్ద రెల్లివీధిలో నాగావళి గట్టుపై 31 కుటుంబాలు, అబ్దుల్‌కలాంనగర్‌ టౌన్‌ సర్వే నెంబర్‌ 204లో చెరువు గట్టుపై 48 కుటుంబాలు, దమ్మలవీధిలో నాగావళి గట్టుపై 12 కుటుంబాలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీరికి ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆ స్థలాలను వారి పేరుతోనే క్రమబద్ధీకరిస్తే 673 కుటుంబాలుకు మేలు జరుగుతుంది.

న్యాయ వివాదాలు

అయితే ఇది అంత త్వరగా పూర్తి అయ్యే ప్రక్రియ కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ఆక్రమణల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గూనపాలెంలో బడేమియా ట్యాంకుపై మూడు దశాబ్దాలుగా సుమారు వంద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి వక్ఫ్‌ బోర్డుతో వివాదం చెలరేగింది. అది వక్ఫ్‌ ఆస్తి కాదని, తాము ఖాళీ చేసేది లేదని అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలు ఎదురుతిరిగాయి. దాంతో వక్ఫ్‌ బోర్డు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుదీర్ఘకాలం పాటు విచారించిన కోర్టు వక్ఫ్‌ ఆస్తిగా నిర్ధారించి నివాసాలను ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా నగరంలో 11 చోట్ల చెరువు, నది గట్లపై నివాసం ఉంటున్న వారి విషయంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తేనే 673 కుటుంబాలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. దీనిపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మాత్రం వ్యవహారం అడ్డం తిరిగి ఆ ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వస్తుందని రెవెన్యూ యంత్రాంగం హెచ్చరిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page