top of page

ఏదో తేడాగా ఉందే!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jan 12
  • 3 min read
  • తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ

  • సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు

  • పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు

  • వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన

  • అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్‌గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా? ఆమదాలవలస నియోజకవర్గం నుంచి తప్ప మరోచోట రాజకీయాలు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయడంలేదా? ఇవేవీ కాదనుకుంటే.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ట్రాప్‌లో ఆయన ఉన్నారా? అనే ప్రశ్నలకు బహుశా సీతారాం తప్ప మరొకరు సమాధానం చెప్పలేరు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సగటు వైకాపా కార్యకర్త భావిస్తున్నది, ఓటరు అనుమానిస్తున్నదానిపై ఒక విశ్లేషణ.

క్యాడర్‌లో గందరగోళం

జిల్లా వైకాపాలో ధర్మాన సోదరులు, టీడీపీలో బాబాయ్‌ అబ్బాయ్‌లు కలిసి కాళింగులను తొక్కేస్తున్నారని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో వారిని ఓడిరచడానికి సొంత ప్యానల్‌ను రంగంలోకి దించుతానంటూ వైకాపా నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆయన్ను వైకాపా సస్పెండ్‌ చేసిన తర్వాత ఆ పార్టీ నేతలెవరూ ఆయనతో కలిసి తిరగడంలేదు. కానీ సీతారాం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమధ్య డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌ తల్లి చనిపోతే దువ్వాడ శ్రీను, తమ్మినేని సీతారాం కలిసి పరామర్శకు వెళ్లారు. ఇది యాదృచ్ఛికం కావచ్చని కొంతమంది భావించారు. అక్కడికి కొద్దిరోజుల వ్యవధిలోనే.. అంటే మొన్న శనివారం పెద్దసాన గ్రామంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ కోత చిన్నారావు చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్‌లు కలిసే వెళ్లారు. సీతారాం కోసం మెయిన్‌రోడ్డు మీద వెయిట్‌ చేసి మరీ శ్రీనివాస్‌ ఆయన్ను పెద్దసాన తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. సరిగ్గా అదే రోజు టెక్కలి నియోజకవర్గంలో పలువుర్ని పరామర్శించడానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. ఆ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న వైకాపా క్యాడర్‌ మొత్తం ధర్మాన వెంట నడిచింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేరాడ తిలక్‌ కూడా ఆయనతోనే ఉన్నారు. సీతారాం టెక్కలి నియోజకవర్గంలో పెద్దసాన పరామర్శకు వస్తున్నారని తిలక్‌కు సమాచారమే లేదు. దీంతో ఆయన ధర్మాన వెంట ఫాలో అయ్యారు. ఆ తర్వాత తెలిసిందేంటంటే.. దువ్వాడ శ్రీనుతో కలిసి సీతారాం పరామర్శించారు. పార్టీ సస్పెండ్‌ చేసిన నేతతో స్వయంగా పార్లమెంట్‌ ఇన్‌ఛార్జే చెట్టపట్టాలేసుకొని తిరగడం ద్వారా పార్టీ క్యాడర్‌కు సీతారాం ఎటువంటి సంకేతాలిస్తున్నారో అర్థం కావడంలేదు. టెక్కలిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిలక్‌ను బలపర్చాల్సిన చోట అదే నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్‌తో కలిసి సీతారాం పరామర్శలు, పలకరింపులకు వెళ్లడం కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నది. ఇప్పటికే సీతారాం పరిస్థితి పార్టీలో ఇరుకుగా మారింది. ఇన్నాళ్లూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఆమదాలవలస నియోజకవర్గానికి చింతాడ రవికుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. అదే చోట తన కుమారుడికి టిక్కెటివ్వాలని సీతారాం ఎప్పట్నుంచో కోరుతున్నారు. కానీ అది కుదరలేదు. దీంతో చింతాడకు సీతారాం నుంచి సహాయనిరాకరణ కొనసాగుతోంది.

ధర్మాన పర్యటనలతో ఉలికిపాటు

తమ్మినేనికి జిల్లాలో బాసటగా నిలిచేవారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండటంతో పాటు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ధర్మాన ఇప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆమధ్య న్యూ ఇయర్‌ రోజున ఒడిశా వెళ్తూ మార్గమధ్యంలో ఇచ్ఛాపురంలో ఆగినప్పుడు ఆయనకు నియోజకవర్గంలో బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆయన శిష్యుడు సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సహజంగానే సీతారాంకు ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే.. అక్కడ ఇన్‌ఛార్జిని మార్చి రెడ్డిక సామాజికవర్గానికి ఇవ్వాలని గత ఎన్నికలకు ముందే ధర్మాన ప్రతిపాదించారు. ఇప్పుడు ఆయన మాట నెగ్గడం ఏ సీనియర్‌కైనా కాస్త ఇబ్బందే. ఇక పలాస నియోజకవర్గంలో పరామర్శలకు ఒడిశా నుంచి వస్తూ ఆగితే అక్కడ స్వయంగా మాజీమంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి స్వయంగా ఆయనకు హారతి పట్టి స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడే సీతారాంకు, అప్పలరాజుకు మధ్య పొరపొచ్ఛాలు ఏర్పడ్డాయన్న వాదన ఉంది. దీనికి తోడు అక్కడ కాళింగ నాయకులను అప్పలరాజుకు వ్యతిరేకంగా ఆ వర్గం వైకాపా నేతలే ఎగదోస్తున్నారన్న అభిప్రాయం మాజీమంత్రి వర్గీయుల్లో ఉండటం వల్ల ఈ గ్యాప్‌ పెద్దదైంది. ఇప్పుడు అక్కడ ధర్మాన చేసిన పరామర్శలు అప్పలరాజు బలాన్ని పెంచింది. తామిద్దరం ఒక్క తాటి మీద ఉన్నామన్న సంకేతం పంపింది. తాజాగా టెక్కలిలో కొన్ని పరామర్శలకు వెళ్లాలని షెడ్యూల్‌ చేసుకుంటే స్వయంగా దువ్వాడ వాణీయే ధర్మానకు ఫోన్‌ చేసి తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు చావు పరామర్శలు ఉన్నాయని, మరోసారి వస్తానంటూ ధర్మాన దాటవేసినా తిలక్‌తో చెప్పించి మరీ ఇంటికి రప్పించుకున్నారు. వాణీ తల్లికి ఆరోగ్యం బాగులేకపోవడం, తండ్రికి ఆమధ్య కాలు విరగడం వల్ల పరామర్శించడం మంచిదని తిలక్‌ చెప్పడంతో ధర్మాన దువ్వాడ వాణి ఇంటిలో అడుగుపెట్టారు. ఆమే ఎదురొచ్చి ధర్మాన కాళ్లకు మొక్కారు. స్వయంగా ఆమె భర్త శ్రీనివాసే ధర్మానను రోజూ మీడియా ముఖంగా తిట్టిపోస్తుంటే.. ఆయన భార్య ధర్మానను ఆహ్వానించడం, కాళ్లకు మొక్కడంతో టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ శ్రీను వేరు, మిగిలిన వారంతా వేరు అన్న సంకేతం వెళ్లింది. అటువంటి చోట శ్రీనుతో కలిసి సీతారాం పర్యటనలు చేయడం ఏదో తేడా కొడుతోందన్న సంకేతాన్నిస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఎన్నికలు లేకపోవడం వల్ల, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ సంకేతాలు అర్థం కాకుండా ఉన్నాయి.

ఏకతాటిపైకి కాళింగ వర్గాలు

జిల్లాలో కాళింగ సామాజికవర్గం ఏకతాటి మీదకు వస్తోంది. త్వరలోనే వారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట ఆ అభ్యర్థులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉందన్న వాతావరణం మధ్య ఇప్పుడు ఇటువంటి పర్యటనలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లకుండా ఉండవు. 2024లో వైకాపా ఓటమిపాలైన తర్వాత ఆమదాలవలసలోనే రాష్ట్రంలో మొదట ఇన్‌ఛార్జిని జగన్మోహన్‌రెడ్డి మార్చేశారు. సామాజికవర్గ సమీకరణాల రీత్యా ఆయన్ను పార్లమెంటు ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నట్లు మరోసారి తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ అంతకుముందే జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్‌.. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కొత్తవారు వస్తారని ప్రకటించారు. అంటే ఏదో ఒక రోజు ఈ పదవి కూడా ఉండదని సీతారాంకు అర్థమైందేమో! అందుకే కళింగ కార్డును ముందు పెట్టి తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని చూస్తున్నట్లుంది. ఎందుకంటే.. ఈమధ్య జరిగిన పిక్నిక్‌లో పార్టీలు ఏవైనా కాళింగులంతా ఒక్కటేనన్న సంకేతాలు ఇచ్చారు. తాజాగా వకుళా సిల్క్స్‌ ముగ్గుల పోటీ నిర్వహిస్తే అందులో దివ్వెల మాధురితో కలిసి కళింగ నాయకురాళ్లు ముందస్తు భోగి పండుగ చేసుకున్నారు. ఇందులో పార్టీలకు అతీతంగా కేంద్ర మాజీమంత్రి కృపారాణి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పిరియా విజయ, సీతారాం భార్య తమ్మినేని వాణిశ్రీలు ఉన్నారు. కులం తర్వాతే పార్టీ అన్న సంకేతాలిచ్చారు. వెలమలతోనే తమకు పోటీ తప్ప, తమలో తమకు కాదని సందేశమిచ్చారు. ఇప్పుడిదే విషయం సీతారాంను అడిగితే, ఇదే సమాధానం ఇవ్వొచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page