ఏది నిజం?
- NVS PRASAD
- 11 hours ago
- 2 min read
యూరియా కొరతే లేకపోతే బారులు తీరుతున్నదెవరు?
ఖరీఫ్‌కు సరిపడా ఎరువులుంటే మళ్లీ దిగుమతులెందుకు?
ఎకరాకు 25 కిలోలు మాత్రమే వాడకం కుదిరే పనికాదు
ప్రతిపక్షాల ఆరోపణగా వదిలేయకుండా దృష్టి సారిస్తే అందరికీ మేలు

(సత్యంన్యూస్, కొత్తూరు)
జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అధికారులు, కలెక్టర్ చెబుతున్నట్టు యూరియా కొరత నిజంగా లేదా? అలా అయితే ప్రతీ రైతుసేవా కేంద్రం వద్ద రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? పోనీ ఇది ప్రతిపక్షం చెబుతున్నంత పెద్దది కాదా? అలా అయితే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళిలోనే రైతులెందుకు యూరియా అందడంలేదని చెబుతున్నారు. పెద్దలంతా చెబుతున్నట్లు జిల్లా అవసరానికి సరిపడే యూరియా ఉందనేదే నిజమైతే ఎక్కడికక్కడ టోకెన్ల కోసం రైతులు ఎందుకు తిప్పలు పడుతున్నారు? ఇవేవీ కావు.. రైతులు వ్యవసాయశాఖ అధికారులు, సైంటిస్టులు చెప్పినదానికంటే ఎక్కువ మొత్తంలో యూరియా వాడేస్తున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిందే నిజమైతే ఈ వాడకం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలైందా? లేదూ వైకాపా ప్రభుత్వంలో కూడా ఇలానే వాడేవారా? జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని అచ్చెన్నాయుడు చెబుతుంటే, కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి జిల్లాకు 3వేల మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లోగా దిగుమతి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు చెబుతున్నారు? బాబాయ్, అబ్బాయ్‌ల స్టేట్‌మెంట్లలో ఏది వాస్తవం?

రైతులు యూరియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, జిల్లాలో ప్రస్తుతం 23వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రబీ సీజన్‌కు కూడా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించిందని చెబుతూనే ఎకరాకు 25 కిలోలకు మించి యూరియా వేయకూడదని అచ్చెన్న హెచ్చరించారు. కానీ సగటు రైతు అధిక దిగుబడి కోసం యూరియాను నమ్ముకున్నంతగా భగవంతుడ్ని కూడా నమ్మడంలేదు. ఇప్పటికిప్పుడు దిగుబడిలో మార్పును తెచ్చే యూరియాను తక్కువ వాడమంటే కుదిరే పనికాదు. జిల్లాలో ఎక్కడ యూరియా నిల్వలు ఉన్నాయని తెలిసినా రైతులు ఎగబడుతున్నారు. నిజంగా ఎప్పుడు కావాలిస్తే అప్పుడు, ఎంత కావాల్సివస్తే అంత తెచ్చుకునే వెసులుబాటే ఉంటే అచ్చెన్నే అన్నట్టు పంక్తి భోజనాల వద్ద ప్లేటు పట్టుకొని నిల్చున్నట్టు రైతు ఎందుకు బస్తా కనపడిన ప్రతిచోటా నిల్చుంటున్నాడు? అది రైతుసేవా కేంద్రం కావచ్చు, ప్రైవేటు డీలర్ కావచ్చు, మన గ్రోమోర్ పేరుతో ఉన్న బిల్డింగ్ కావచ్చు.. అక్కడ ఎరువుందని తెలిస్తే చాలు తిండీ తిప్పలు మానుకొని మరీ టోకెన్ కోసం నిలబడుతున్నాడు. 265 రూపాయలు ఉండాల్సిన యూరియా బస్తా కొత్తూరు మండలంలో రూ.600 వరకు పలుకుతుందంటే.. ఇది కొరత కాక మరేమిటి? వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెబుతూనే ఎకరాకు 25 కిలోలకు మించి ఇవ్వడంలేదు. ఒక్క సోమవారమే కొత్తూరు మండలంలో మన గ్రోమోర్ సెంటర్‌కు వెయ్యి బస్తాలు వచ్చాయని తెలియడంతో రైతులంతా అక్కడ క్యూ కట్టారు. ఇదే అదునుగా యూరియా కావాలంటే మిగిలిన పనికిమాలిన సరుకులు కొనాలని లింకుపెట్టి వాటిని కూడా ఎంచక్కా సొమ్ము చేసుకున్నారు. అక్కడే ఉన్న వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి స్వయంగా రైతులే ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోతున్నాయని ఫిర్యాదు చేస్తే వినపడనట్టే వెళ్లిపోయారు. కోటబొమ్మాళిలో మనగ్రోమోర్ సెంటర్ వద్ద సోమవారం యూరియా కోసం బారులుతీరిన రైతులు కనిపించారు. ఇది జిల్లాలో ఏ ఒక్క మండలానికో, గ్రామానికో పరిమితం కాదు.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంది.