ఏది సత్యం.. ఏదసత్యం..?!
- Prasad Satyam
- Nov 6, 2025
- 2 min read
బందపల్లి టీచర్ ఫొటో వెనుక తెరమీదకు అసలు కథ
టైల్స్ మీద టీచర్ జారిపడటంతోనే కాళ్లు పట్టామన్న విద్యార్థినులు
డ్యామేజ్ కంట్రోల్ కోసం ఉపాధ్యాయురాలు సస్పెండ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటుంటారు పెద్దలు. చూసేదంతా నిజం కాదనే వాదన కూడా ఉంది. ఈ రెండిరటి అర్థం ఒకటే. రెండు రోజుల క్రితం మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న వై.సుజాత కుర్చీ మీద రిలాక్స్‌డ్‌గా కూర్చుని కుర్చీలో చేరబడి ఫోన్‌లో సాఫీగా మాట్లాడుతున్న దృశ్యం వైరలైంది. దీనికి తోడు రిలాక్స్‌డ్‌గా రెండు కాళ్లు ముందుకు చాపి కూర్చుంటే, ఇద్దరు విద్యార్థినులు ఆమె కాళ్లు వత్తుతున్నట్టు తీసిన ఫొటో ఒకటి బాగా వైరలైంది. అలాగే బుధవారం నాటి పత్రికల్లో కూడా టీచరమ్మా.. ఇదేం పనమ్మా? అంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్ పిల్లల చేత కాళ్లు పట్టించుకుంటూ తరగతి గదిలోనే ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని యావత్ ప్రపంచం తప్పుపట్టింది. కొందరైతే గురుశుష్రూష తప్పుకాదని, గతంలో ఎంతమంది ఇలా ఉపాధ్యాయులకు సేవలు చేయలేదని సమర్ధించారు. అయితే ఈ రెండు వాదనలూ తప్పే. ఒక్కోసారి మన నీడే మనకు మరోలా కనపడినప్పుడు ఎలా ఉంటుందో ఈ ఫొటో వెనుక కథనం కూడా అలాంటిదే. ఇందుకోసం ‘సత్యం’ ఓ ఫొటోను ఇక్కడ పబ్లిష్ చేస్తుంది. ఓ యువతి తన హ్యాట్‌ను కడుపు మీద పెట్టుకొని ఫొటోకు స్టిల్ ఇస్తే.. ఆమె నీడ మాత్రం ఆమెను గర్భిణీగా చూపిస్తుంది. వాస్తవానికి, నీడకు ఎంత తేడా ఉందో ఈ ఫొటోకు, జరుగుతున్న ప్రచారానికి అంతే తేడా ఉంది. సుజాత ఎటువంటి ఉపాధ్యాయురాలు? పాఠాలు చెబుతారా? చెప్పరా? పాఠశాలకు వస్తారా? రారా? అనే విషయాల జోలికి ఇప్పుడు పోవడంలేదు. ఎందుకంటే.. ఇప్పుడది చర్చ కాదు. విద్యార్థులతో కాళ్లు పట్టించుకోవడం, ఫోన్‌లో మాట్లాడుతూ కనిపిస్తున్న వైరలైన ఫొటో కోసమే ఇప్పుడీ కథనం. వాస్తవానికి ఈ ఫొటో గాని, హల్‌చల్ చేస్తున్న వీడియో గాని నెల రోజుల క్రితంవి. సుజాత తరగతి గదిలోకి వస్తున్నప్పుడు టైల్స్ రూపంలో ఉన్న గచ్చు మీద నీరు ఉండటం చూసుకోలేదు. దీంతో ఆమె తరగతి గదిలోనే కాలుజారి పడిపోయారు. వెంటనే మరో ఉపాధ్యాయురాలు ఆమెను తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. కాలు బెనికిందని, విపరీతంగా నొప్పి పుడుతోందని వైద్యుడిగా పని చేస్తున్న తన కుమారుడికి సుజాత ఫోన్ చేసి, మందుల కోసం ఆరా తీస్తుండగా, తమ టీచర్ పడిపోయి కాలునొప్పి అంటూ గగ్గోలు పెడుతుండటంతో ఇద్దరు విద్యార్థినులు వచ్చి కాలును పడుతుండగా తీసిన వీడియోలో భాగమే పత్రికల్లో వచ్చిన ఫొటో. ఇది నెల రోజుల క్రితమే ఐటీడీఏ పీవోకు చేరింది. దీనిపై వివరణ కూడా కోరారు. ఇదే విషయం లిఖితపూర్వకంగా సుజాత రాసిచ్చారు. కానీ పత్రికల్లో, యూట్యూబ్ ఛానళ్లలో ఇది విపరీతంగా వైరల్ కావడంతో ఆమెను తాజాగా సస్పెండ్ చేశారు. దీంతో ఆదివాసీ వికాస్‌పరిషత్ సంబంధిత పాఠశాలకు వెళ్లి బాధితులు అని చెప్పబడుతున్న విద్యార్థినులతో మాట్లాడి అసలేం జరిగిందో రికార్డు చేసి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.










Comments