ఏది సభ్యత.. ఏది అసభ్యత!
- DV RAMANA

- Jan 3
- 3 min read
నగ్నత్వం, లైంగికత్వం మధ్య సన్నని తెర
సందర్భం, చూసే దృక్కోణమే కీలకం
కేసును బట్టి తీర్పు ఉంటుందన్న కోర్టులు
నాలుగ్గోడల మధ్య వలువలూడుతున్న విలువలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సమాజంలో అసభ్యత ఎంత పెరుగుతోందో.. అంతకంటే ఎక్కువగా దానిపై చర్చ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా మహిళలే టార్గెట్‌గా మారుతున్నారు. ఇటీవల సినీనటుడు శివాజీ మహిళల వస్త్రధారణను ప్రస్తావిస్తూ అసభ్యత గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సభ్యత, అసభ్యత, నగ్నత్వంపై చర్చోపచర్చలకు దారితీశాయి. శరీరంలోని కొన్ని భాగాలు కనిపించేలా మహిళలు చేస్తున్న వస్త్రధారణను శివాజీ తప్పుపడుతూ కొన్ని శరీర భాగాల నగ్నత్వం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సందర్భంలోనే కాదు.. అసభ్యత అంటే నగ్నత్వం అన్నట్లే చాలామంది భావిస్తుంటారు.. మాట్లాడుతుంటారు. అసభ్యతకు పర్యాయపదం నగ్నత్వం కాదన్నది చాలామందికి అర్థం కాని విషయం. ఈ రెండిరటి మధ్య సన్నని తెర ఉంటుంది. అసభ్యత అనేది ఎదుటివారు చూసే దృక్కోణంలో ఉంటుంది. అలాగే మన చేష్టల్లోనూ అది గోచరమవుతుంది. ఇక నగ్నత్వం అంటే స్వచ్ఛత. ఎటువంటి లొసుగులు, ముసుగులు లేనిదని స్థూలంగా దాని అర్థం. అందుకే కల్మషం లేకుండా నిజం చెబితే ‘నగ్నసత్యం’ బయటపెట్టారని అంటుంటారు. పలు కేసులు, వివాదాల్లో కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నాయి. సమయం, సందర్భం, దృష్టికోణం వంటి వాటి ఆధారంగా అది నగ్నత్వమా, అసభ్యతా అనేది నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. మన సనాతన సంప్రదాయాల్లో నగ్నత్వాన్ని పవిత్రంగానే భావించారు. అందుకే యోగులు, శివతత్వాన్ని పాటించే ఆఘోరాలు దాదాపు నగ్నస్థితిలోనే ఇహపరాలతో సంబంధం లేకుండా తమదైన ఆధ్యాత్మిక, అలౌకిక ప్రపంచంలో గడుపుతుంటారు. ఒకనాడు జైనమతంలోనూ దిగంబరులు ఉండేవారు. కానీ కాలక్రమంలో కట్టుబాట్లు, వలస పాలన సంకెళ్లలో చిక్కుకుని దేవాలయంలాంటి దేహంపై ఆచ్ఛాదన పేరుతో వస్త్రం వంటి ముసుగు కప్పేస్తున్నాం. దేహమే దేవాలయం.. అందులోని ఆత్మే పరమాత్మ లేదా దేవుడు అని యోగులు చెబుతుండటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. కానీ నాగరికత ముసుగులో దేవాలయం వంటి దేహాన్ని అశ్లీలతకు, అణచివేతకు వేదికగా మార్చేశారు. అలాగని.. నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదు అన్నీ విప్పుకొని తిరగమనీ చెప్పడం లేదు. మన దృష్టికోణం మార్చుకుని ఎదుటివారిని చూడాలన్నదే ఈ కథనం ఉద్దేశం.
అది నాగరికత.. ఇది అసభ్యతా?
నగ్నత్వం పట్ల భయం అనే భావం ఇప్పటికిప్పుడు వచ్చినది కాదు. ఇదో చారిత్రక, సాంస్కృతిక పరిణామ క్రమం. ప్రాచీన ఖజురాహో, అజంతా గుహల్లో చెక్కిన శిల్పాల్లో నగ్నత్వం అతి సహజంగా కనిపిస్తుంది. ఈ కాలంలోనూ అనేక దేవాలయాలపై గోపురాలపై రతిక్రీడల శిల్పాలు ఉండటం తెలసిందే. దేశంలో ఒడిశా, తమిళనాడు వంటి కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఎగువ శరీరాన్ని కప్పుకోకపోవడం సాధారణం. ఒడిశా గ్రామాల్లో అయితే ఇప్పటికీ చాలామంది మహిళలు రవిక లేకుండానే వస్త్రధారణ చేస్తుంటారు. ఆయా ప్రాంతాల సంప్రదాయాలు, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీటిపై ఉంటుంది. మతపరంగా చూస్తే జైన దిగంబర సాధువులు, నాగా సాధువులు నగ్నంగానే ఉంటారు.. వీరి ప్రవృత్తి త్యాగం, పవిత్రత చిహ్నం. కుంభమేళాలో ఇప్పటికీ ఇది కనిపిస్తుంది. వీటిని బట్టి ప్రాచీన కాలంలో నగ్నత్వం నిషిద్ధం కాదని చెప్పాలి వస్తుంది. దేశాన్ని కబళించిన ఇస్లామిక్ పాలకులు తొలుత ఈ సంప్రదాయ ముసుగులకు తెరతీశారు. తర్వాత వచ్చిన బ్రిటీష్ వలస పాలనలో నైతిక విలువల పేరుతో మరింత బలపడిరది. క్రమశిక్షణ, సామాజిక గౌరవం, మతపరమైన నిబద్ధత పేరుతో వస్త్రధారణను విలువల వలువలు వేశారు. బ్రిటీష్ విక్టోరియన్లు లైంగికత పట్ల కఠినంగా కనిపిస్తూ శరీరాన్ని పూర్తి ఆచ్ఛాదించే వస్త్రధారణతో ఉండేవారు. అయితే బయట ఇంత నైతికంగా కనిపించే వీరు నాలుగు గోడల మధ్య విచ్చలవిడిగా వ్యవహరించేవారు. వ్యభిచారంతోపాటు సంఘ జీవనం పేరుతో క్లబ్బులు, పబ్బుల్లో ఆడామగా కలిసి మద్యపానం చేయడం, సామూహిక డ్యాన్సులు చేయడం వంటి విశృంఖల, వికృత పార్శ్వం వారి జీవనంలో కనిపిస్తుంది. వలసవాదుల నుంచే ఆ దుస్సంస్కృతి భారతీయ సంప్రదాయంలోకి చొరబడి.. మన సంస్కారాన్నే ప్రశ్నిస్తోంది. విక్టోరియన్ నైతికత పైకి కనిపించే హుందాతనం, లోపల ఉండే కఠినమైన సామాజిక నియమాల మిశ్రమం. అందుకే 1860లో రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ బహిరంగ నగ్నత్వాన్ని నేరంగా పరిగణించింది. ఐపీసీ 294 ‘అసభ్యత’ అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించలేదు. నగ్నత్వాన్ని లైంగికతతో ముడిపెట్టారు.
కోర్టులు ఏం చెబుతున్నాయంటే..
మనదేశంలో నగ్నత్వం, అసభ్యత మధ్య ఉన్న సన్నని గీతను కోర్టుల నిర్వచనను కొన్ని కేసుల తీర్పుల ద్వారా తెలుసుకోవచ్చు.
`ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన హిందూ దేవతల నగ్నచిత్రాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీనిపై 2008లో ఢల్లీి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది. ‘నగ్నత్వం అనేది తప్పనిసరిగా అసభ్యత కాదు’ అని కోర్టు స్పష్టం చేసింది. పాత కాలపు బ్రిటిష్ హిక్లిన్ టెస్ట్ (ఏదైనా ఒక విషయాన్ని చూసి మనసు చెడిపోతే అది అసభ్యత) కాకుండా ఆధునిక సమాజ దృక్కోణంలో చూడాలని కోర్టు చెప్పింది. మన ప్రాచీన ఆలయాల్లో నగ్నత్వాన్ని అంగీకరించినప్పుడు ఆధునిక చిత్రకారులను తప్పుబట్టడం సరికాదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు.
`2014లో అవేక్ సర్కార్ వర్సెస్ పశ్చిమబెంగాల్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. జర్మన్ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ నల్లజాతీయురాలైన తన కాబోయే భార్యతో కలిసి నగ్నంగా దిగిన ఫోటో ఒక మ్యాగజైన్‌లో పబ్లిష్ అయ్యింది. ఆ ఫోటో వర్ణ వివక్షకు వ్యతిరేకమైన సందేశం ఇస్తున్నందున అది అసభ్యకరం కాదని తేల్చింది.
`ఇటీవల కేరళకు చెందిన రెహనా ఫాతిమా తన పిల్లల ఎదుట అర్ధనగ్నంగా ఉండి, తన శరీరంపై వారితోనే పెయింటింగ్ వేయించుకున్నందుకు ఆమెపై కేసులు నమోదయ్యాయి. కేరళ హైకోర్టు ఆమెకు బెయిల్ ఇస్తూ ‘శరీరం పట్ల సహజమైన అవగాహన ఉండటం తప్పు కాదు’ అనే కోణంలో తీర్పు ఇచ్చింది.
` బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ 2022లో ఒక మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోషూట్ చేయడంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. చాలా పెద్ద చర్చ జరిగింది. ఇది భారతీయ సమాజంలో ఉన్న అభిప్రాయ భేదాలను స్పష్టంగా చూపింది.
ఎవరికి వారే నైతిక పోలీసుల ఫోజులు
ఇక తాజా ఉదంతం మహిళల విషయంలో శివాజీ వ్యాఖ్యల వివాదాన్ని గమనిస్తే సమాజం ఇంకా వలసవాద మనస్తత్వం వీడలేదని స్పష్టమవుతుంది. శివాజీ తనకు తానుగా మోరల్(నైతిక) పోలీస్ అవతారమెత్తాడు. మహిళలు బయటకొచ్చినప్పుడు ఎలాంటి వస్త్రధారణ చేయాలో పురుషులు నిర్ణయించే విక్టోరియన్ పితృస్వామ్య ధోరణి ఆయన మాటల్లో కనిపించింది. తన వ్యాఖ్యల్లో వాడిన ‘సామాన్లు’, ‘దరిద్రపు..’ వంటి పదజాలం అసభ్యకరంగా ఉన్నా తాను సభ్యత గురించి, మహిళల రక్షణ గురించే మాట్లాడానని సమర్థించుకోవడం శోచనీయం. ఇక అనసూయ తన స్విమ్‌సూట్ వీడియోను మళ్లీ షేర్ చేయడం ద్వారా తన శరీరంపై తనకు ఉన్న హక్కును చాటుకోవడానికి ప్రయత్నించారనుకోవచ్చు. మన ఆలోచనలు ఇంకా 1860ల నాటి ఐపీసీ సెక్షన్లు, బ్రిటీష్ విలువల చుట్టూనే తిరుగుతున్నాయని ఈ వివాదం ద్వారా తెలుస్తోంది. శివాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నది ‘సంప్రదాయ రక్షణ’ అనే భ్రమలో ఉన్న పాత తరం ఆలోచన అయితే.. అనసూయ ప్రాతినిధ్యం వహిస్తున్నది ‘నా శరీరం - నా ఇష్టం’ అనే ఆధునిక స్వేచ్ఛా భావజాలం. ఇలాంటి ఘర్షణలు మార్పులకు బాటలు వేయాలని ఆశిద్దాం.










Comments