ఏదయా యూరియా.. వైఫల్యమిదయ్యా!
- DV RAMANA

- Sep 17, 2025
- 2 min read

చాలా ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల రైతులు ‘ఎరువో.. దేవరా’.. అంటూ రోడ్లెక్కుతున్నారు. ఖరీఫ్ సాగు పనులతో బిజీగా ఉండాల్సిన అన్నదాతలు.. ఎరువుల షాపుల వద్ద బారులు తీరుతున్నారు. చాలాచోట్ల వారి ప్రతినిధులుగా చెప్పులు క్యూ కడుతున్న దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు దశాబ్దాల క్రితం ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల కోసం రైతులు అష్టకష్టాలు పడేవారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నాటి కష్టాలు పునరావృతమవుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి యూరియా కొరత వెంటాడుతోంది. ఈ సమస్యకు కారణం మీరంటే.. మీరేనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ఏపీ, తెలంగాణల్లో అధికార, ప్రతిపక్షాలు యూరియా సమస్యపై రాజకీయం చేస్తున్నాయే తప్ప రైతుల సమస్య పరిష్కారంపై దృష్టి సారించడంలేదు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని, కావలసినంత నిల్వలు ఉన్నాయని, మరికొంత స్టాకు కాకినాడు, విశాఖ పోర్టులకు నౌకల్లో వస్తున్నదని ఏపీ అధికారవర్గాలు, మంత్రులు సమర్థించుకుంటూ వచ్చారు. కానీ రెండురోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు యూరియా కొరత లేదంటూ ఇన్నాళ్లూ ప్రభుత్వవర్గాలు చేస్తున్న వాదన అవాస్తవమని చెప్పకనే చెబుతున్నాయి. అంతేకాకుండా ఎరువులను రైతులకు సక్రమంగా పంపిణీ చేయడంలో విఫలమయ్యామని అందుకే కొరత కనిపిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సమస్యకు ఒక కోణం మాత్రమేనని చెప్పాలి. ఎవరికి ఎంత అవసరమో గుర్తించకుండా, అవసరంలేనివారికి కూడా ఎక్కువ సరఫరా చేయడం కూడా కొరతకు కారణమని చంద్రబాబు చెప్పడం ముమ్మాటికీ నిజం. వీటితోపాటు ఇంకా చాలా అంశాలు యూరియా కొరతకు దారితీశాయి. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణమవుతున్నాయి. సీఎం చంద్రబాబు చెప్పినట్లు అవసరాన్ని బట్టి రైతులకు సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నది వాస్తవం. పట్టాదారు పాస్‌పుస్తకాల ప్రకారం ఒక రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉంది.. అందులో ఏ పంట వేస్తున్నారు.. దానికి ఎంత యూరియా అవసరం అన్నది గుర్తించి ఆమేరకు సరఫరా చేయాలి. కానీ ఈసారి అలా జరగలేదని వాస్తవ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ ఒత్తిళ్లుసరఫరాను అస్తవ్యస్తం చేశాయి. అధికార కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ సిబ్బందిని రకరకాలుగా మేనేజ్ చేసి తమ అవసరానికి మించి యూరియా తరలించుకుపోయారు. అలాగే తమకు కావలసినవారికి కావలసినంత ఎరువు ఇప్పించుకున్నారు. ఫలితంగా వచ్చిన స్టాకులో చాలావరకు నేతలు, వారి అనుయాయుల ఇళ్లకే వెళ్లిపోయింది. సాధారణ రైతులు రోజుల తరబడి ఎండావానలను లెక్క చేయకుండా బారులు తీరినా గుప్పెడు యూరియా అయినా దక్కించుకోలేకపోతున్నారు. నీటి వసతులు పెరుగుతున్న క్రమంలోనే సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. దానికి అనుగుణంగా ఎరువుల వినియోగం ఏటేటా పెరుగుతున్నా వాటి ఉత్పత్తి, దిగుబడిలో మాత్రం ఆస్థాయి పెరుగుదల ఉండటంలేదు. ఇతర పంటలతో పోలిస్తే వరి, పత్తి పంటలకు ఎక్కువ యూరియా అవసరం. ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన లేదు. ఎక్కువ ఎరువు వాడితే దిగుబడి పెరుగుతుందనే భ్రమల్లో వారుంటున్నారు. దీనివల్ల ఎరువుల వినియోగం పెరుగుతోంది. యూరియా ఉత్పత్తికి ఉపయోగించే సహజ వాయువుల ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సరఫరా తగ్గుదలకు కారణమవుతున్నాయి. మన అవసరాలకు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడుతున్నాం. కానీ ఈ సీజనులో చైనా ఎరువుల సరఫరాను తగ్గించింది. మరోవైపు రామగుండం ఫెర్టిలైజర్స్ ఆండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్), తాల్చేర్ ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో ఉత్పత్తి కూడా తగ్గింది. గతంలో వ్యవసాయానికి మాత్రమే యూరియా వంటి ఎరువులను వాడేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయేతర పనులకు అంటే కల్తీ పాలు, కల్తీ బీర్ల తయారీ వంటి అక్రమాలకు కూడా యూరియా వాడేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే మరో వాదన ఉంది. తర్వాత దొడ్డిదారిలో వాటిని అధిక ధరలకు అమ్ముకుని వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చాలా అంశాలు, అక్రమాలు యూరియా, ఇతర ఎరువుల కొరతకు కారణమవుతున్నాయి. కానీ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించకుండా కొరత లేదని బుకాయించడం బాధ్యతల నుంచి తప్పించుకోవడమే.










Comments