ఏపీ, కర్ణాటక మధ్య మామిడి చిచ్చు!
- DV RAMANA

- Jun 14, 2025
- 2 min read

దేశాల మధ్య సరిహద్దు వివాదాలు చెలరేగడం.. అవి యుద్ధాలకు దారితీయడం సహజం. ఒకే దేశం లోని రాష్ట్రాల మధ్య కూడా సరిహద్దులతో పాటు జలవివాదాలు రేగుతుంటాయి. అయితే ఇవి కాస్త ఉద్రిక్తతలకు కారణమవుతాయే తప్ప పెద్ద ప్రమాదం ఉండదు. కారణం.. జలవివాదాలు, సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కృష్ణానదీ జలాల విషయంలో కర్ణాటకతో, ఇప్పుడు తెలంగాణతో.. అలాగే గోదావరి జలాల విషయంలో మహరాష్ట్రతో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న జలవివాదాలలు, అలాగే ఒడిశాతో సరిహద్దు వివాదాల గురించి తెలిసిందే. కానీ ఇవేవీ కాకుండా అందరూ ఇష్టంగా తినే మామిడి పళ్లు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపడం నిజంగా విడ్డూరమే. అవునండీ.. ఇది నిజమే! ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య మామిడి పళ్ల వివాదం రాజుకుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ జూన్ ఏడో తేదీన జారీ చేసిన ఆదేశాలు ఈ వివాదానికి అంకురార్పణ చేశాయి. ఇది అటు తిరిగి.. ఇటు తిరిగి.. ముఖ్యమంత్రి స్థాయిలో లేఖాస్త్రం సంధించేలా చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లాలోకి తోతాపురి రకం మామిడి పళ్ల ప్రవేశాన్ని నిషేధించామన్నది చిత్తూరు కలెక్టర్ ఆదేశాల సారాంశం. ఇదే రాష్ట్రాల మధ్య మ్యాంగో వార్‌కు దారి తీసింది. ఏపీ విధించిన నిషేధంపై కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగినపల్లి, సువర్ణరేఖ, చెరుకు రసాలు వంటి వాటితోపాటు తోతాపురి అనేది మామిడి పళ్లలో ఒక రకం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తోతాపురి మామిడిని విస్తృతంగా సాగు చేస్తుంటారు. ఈ పళ్లను బెంగుళూరు లేదా శాండర్ష అని కూడా పిలుస్తుం టారు. పొడవుగా ఉండి చివరన కొనదేలి చిలుక ముక్కును పోలి ఉండటం ఈ పళ్ల ప్రత్యేకత. తోతాపురి మామిడిని ఎక్కువగా జ్యూస్ పల్ప్, ఇతర మామిడి పానీయాల తయారీకి ఉపయోగిస్తుంటారు. తోతాపురి విస్తారంగా లభిస్తున్నందునే మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో చాలా మామిడి ప్రాసెసింగ్, పల్ప్ తయారీ కంపెనీలు ఉన్నాయి, మూడు రాష్ట్రాల సరిహద్దు మార్కెట్ల నుంచి తోతాపురి మామిడి పళ్లు సేకరిస్తుం టాయి. ఈ ఏడాది 5.5 లక్షల టన్నుల మామిడి పళ్ల సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, అంతా బాగానే ఉంది.. మరి కర్ణాటక నుంచి వచ్చే ఆ పళ్లపై నిషేధం ఎందుకు విధించారన్న ప్రశ్న తలెత్తవచ్చు. దానికి కారణం.. ధరల్లో వ్యత్యాసం. కర్ణాటకలో పండే తోతాపురి పళ్ల ధర మన రాష్ట్రంలో కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి ఏటా మామిడి సీజనులో తోతాపురం మామిడి పళ్ల కొనుగోలు ధరను ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. అదే రీతిలో ప్రస్తుత సీజనులో కిలో మామిడికి రూ.8 ధర ప్రకటించింది. అలాగే తోతాపురి పళ్ల లభ్యత అధికంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని కిలోకు అదనంగా మరో రూ.4 ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కానీ కర్ణాటకలో కిలో ధర కేవలం రూ.5 నుంచి రూ.6 మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటక మామిడి పళ్లను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి అనుమతిస్తే ప్రాసెసింగ్, పల్ప్ తయారీ పరిశ్రమలవారు మన రాష్ట్ర మామిడి పళ్లను కాకుండా తక్కువ ధర ఉన్న కర్ణాటక మామిడి కొనుగోలుకే మొగ్గు చూపుతారు. ఇది ఆంధ్ర రైతులను కష్టాల్లోకి నెడుతుందన్నది ఏపీ ప్రభుత్వ వర్గాల ఆందోళన. అందుకే కర్ణాటక నుంచి దిగుమతులను నిషేధించింది. ఈ నిషేధం వల్ల సుస్థిర సరఫరా గొలుసుకట్టు వ్యవస్థను దెబ్బతీసిందని, అలాగే వేలాది రైతుల జీవనో పాధిని నేరుగా ప్రభావితం చేస్తూ పంట నష్టాలను తీవ్రతరం చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ కూడా ఏపీ సీఎం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శులకు ఈ అంశంపై లేఖ రాశారు. ఈ నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. ఈ నిర్ణయం కర్ణాటకలోని మామిడి రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ రైతులంతా తమ పంట ఉత్పత్తులను విక్రయించడానికి చిత్తూరులోని ప్రాసెసింగ్ యూనిట్లపైనే ఆధారపడుతున్న విష యాన్ని గుర్తుచేశారు. ఈ నిషేధాన్ని ఎత్తివేయకపోతే కర్ణాటక రైతులు కూడా ప్రతీకార చర్యలకు దిగ వచ్చని, ఏపీ నుంచి కర్ణాటకకు వచ్చే కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అడ్డుకోవచ్చని హెచ్చ రించారు. జాతీయస్థాయిలో ప్రత్యర్థులుగా ఉన్న ఎన్డీయే కూటమి ఆంధ్రలో, కాంగ్రెస్ కర్ణాటకలో అధి కారంలో ఉన్నందున ఈ వివాదం రాజకీయంగానూ రచ్చగా మారే అవకాశం ఉంది.










Comments