ఏరిపారేస్తున్నారు..!
- NVS PRASAD

- May 26
- 2 min read
పోలీసుల అదుపులో ఓబీఎస్
కళ్లేపల్లిలో కానిస్టేబుల్‌ను తోసేసిన రౌడీషీటర్
పేకాట, బెట్టింగ్‌లకు యాప్‌ను సృష్టించిన మనోళ్లు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పేకాట, క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న పొన్నాడకు చెందిన పాకల కిశోర్, ఒప్పంగికి చెందిన రవితేజలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొద్ది రోజుల క్రితం పట్టుకోవడం ద్వారా జిల్లాలో బెట్టింగ్, పేకాటతో పాటు గంజాయి రవాణాకు సంబంధించిన ఒక పెద్ద సిండికేట్ గుట్టును రట్టు చేయనున్నారు. ఒప్పంగిలో ఒకర్ని, పొన్నాడలో ఒకర్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వారి ఫోన్ డేటా ఆధారంగా తీగ లాగితే డొంకంతా కదిలింది. అందులో భాగంగానే జిల్లాలో ఎవరెవరు పేకాడిస్తున్నారు? బెట్టింగుకు పాల్పడుతున్నవారెవరు? ఈ సిండికేట్‌లో ఎంతమంది ఉన్నారు? సొమ్ములు ఎక్కడి నుంచి ఎక్కడికి చేతులు మారుతున్నాయి? అన్న కూపీ లాగారు. అందులో భాగంగానే శ్రీకాకుళం నగర పరిసర ప్రాంతాల్లో వరుసగా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌లు, బుకీలను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు రెండు రోజులుగా ఊపందుకున్నాయి. టౌన్‌లో రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో రెండు రోజుల పాటు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు తాజాగా సోమవారం కూడా రౌడీషీటర్లను స్టేషన్‌కు రమ్మన్నారు. పోలీసులంటే లెక్కలేనితనం పెరిగిపోయిందన్న భావన స్వయంగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డే వ్యక్తం చేశారట. ఆదివారం కళ్లేపల్లి తోటల్లో పేకాడుతున్న ఆరుగుర్ని రూరల్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.80వేలు పైచిలుకు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ అదే సమయంలో నగరానికి చెందిన కుమార్ అనే రౌడీషీటర్ పోలీసులను నెట్టేసి పారిపోయాడు. ఆయన్ను పోలీసులు వెంబడిరచినా పట్టుకోలేకపోయారు. ఇదే విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్పీ దృష్టిలో పెట్టడంతో పోలీసులంటే లెక్కలేనితనాన్ని సహించేది లేదని, రౌడీషీటర్లందర్నీ మరోసారి పిలిచి ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే బాగుండదని సోమవారం వార్నింగ్ ఇప్పించారు. పోలీసుల్ని నెట్టేయడాన్ని ఎస్పీ సీరియస్‌గానే తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్దపాడు పద్మావతి కల్యాణ మండపం వెనుక పేకాట డెన్ మీద దాడి చేయడం ద్వారా కొంత సమాచారాన్ని సేకరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాని ఆధారంగా పాకాల కిశోర్, రవితేజలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీరి ఫోన్ ట్రాన్జాక్షన్, బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన తర్వాత మరికొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఒడిశాకు చెందిన బరంపురం శ్రీను ఉన్నట్లు భోగట్టా. రవితేజ దగ్గర దొరికిన వివరాల మేరకు బరంపురం శ్రీను క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నాడని తేలడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తామే బెట్టింగులకు పాల్పడి అప్పులపాలైపోయామని, చాలామందికి సొమ్ములు చెల్లించాల్సి ఉందని శ్రీను పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏడాది కాలంగా ఇక్కడ చాలామంది నుంచి అప్పులు తీసుకొని తప్పించుకు తిరుగుతున్న ఓబీఎస్‌ను శ్రీకాకుళం పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారని తెలియగానే, అప్పులిచ్చినవారు స్టేషన్ ముందు దర్శనమిస్తున్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడిన దాయల శ్రీను అలియాస్ ఓబీఎస్ ఎవరెవరికి బకాయిలున్నాడు? ఎందుకున్నాడు? అన్న కూపీ లాగుతున్నారు. గతంలో పేకాట క్లబ్‌ను శ్రీకాకుళంలో నడిపి కోట్లు గడిరచిన కొందరికి శ్రీను లక్షల్లో బకాయి ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, పోలీసుల అదుపులో ఉన్న బుకీలు సొంతంగా ఒక బెట్టింగ్ యాప్ తయారుచేసి, అందులో అమాయకులను దించి వీరు సొంతానికి ఆడిస్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారని భోగట్టా.











Comments