ఒంటరి జీవితం ప్రమోదం కాదు!
- DV RAMANA

- 9 hours ago
- 3 min read

బ్రహ్మచారి జీవితం భలే హ్యాపీ అని సాధారణంగా అంటుంటారు. అందుకే హిందీలో ఏక్ నిరంజన్.. అని అంటారు. ఏకాకి జీవితం గడిపేవారు తమకు తమే రాజు అని స్థూలంగా దీనర్ధం. పెళ్లిపెటాకులు లేకుండా సింగిల్‌గా మింగిల్ అయిపోవడం ఒకరకంగా కేర్ ఫ్రీ జీవితమే కావచ్చు. కానీ దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి, కుటుంబం వంటి బాదరబందీల్లేకుండా ఒంటరిగా గడపేవారిని గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతోపాటు మానసిక రుగ్మతలు సోకే ప్రమాదముందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. స్విట్జర్లాండ్‌లోని యÖనివర్సిటీ ఆఫ్ జూరిచ్ తాజా అధ్యయనం కూడా ఇదే విషయం వెల్లడించింది. సుమారు 17వేల మందిపై 16 ఏళ్ల పాటు జరిపిన సుదీర్ఘ పరిశోధనల్లో వయస్సు పెరుగుతున్నా పెళ్లి లేకుండా ఒంటరిగా ఉండేవారిలో జీవితంపై సంతృప్తి వేగంగా తరిగిపోతున్నట్లు తేలింది. ఫలితంగా డిప్రెషన్ వంటి రుగ్మతలకు గురవుతున్నారని వెల్లడైంది. ప్రస్తుత సమాజంలో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లంటేనే భయపడిపోతున్నారు. ఒంటరిగా గడపడాన్నే ఇష్టపడుతూ ప్రేమ, పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. మరికొందరేమో 30 ఏళ్ల వయసు దాటినా కెరియర్, జీవితాన్ని ఆస్వాదించే నెపంతో పెళ్లిని వాయిదా వేస్తున్నారు. అయితే ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని జూరిచ్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జర్మనీ, బ్రిటన్‌లకు చెందిన 16`29 మధ్య వయస్కులైన 17 వేల మందిపై సుదీర్ఘకాలం జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన, కాస్త ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఒంటరిగా ఉన్న వారిలో కాలక్రమేణా జీవితంపై సంతృప్తి తగ్గి, నిర్లిప్తత పెరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 25 ఏళ్లు దాటిన ఒంటరివారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని డాక్టర్ మైకేల్ క్రామర్ వివరించారు. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఈ ప్రభావం సమానంగా కనిపిస్తున్నదట. ఇక 20వ దశకం చివరిలో ఉన్న బ్రహ్మచారుల్లో డిప్రెషన్ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపించాయి. ఇటువంటి వారిలో మానసిక ధైర్యం తగ్గుతున్నట్లు వెల్లడైంది. కాగా ఇదే వయసులో ఉండి రిలేషన్‌షిప్ లేదా వైవాహిక జీవితం గడుపుతున్న వారిలో జీవితంపై సంతృప్తి పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. చదువుపై అతిగా దృష్టి పెట్టే వారు, ఎవరూ లేనివారు, తల్లిదండ్రులతోనే ఉండిపోయే వారు ఎక్కువ కాలం సింగిల్‌గా ఉండిపోతున్నారని, ఇది వారిని మానసిక సమస్యల్లోకి నెట్టేస్తుందని అధ్యయనం పేర్కొంది. ఒంటరితనం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగి భవిష్యత్తులో రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఒంటరితనం అంటేనే ఒత్తిడి అని, మానసిక ఒత్తిడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మనస్తత్వవేత్త డాక్టర్ ఆడమ్ బోర్లాండ్ అన్నారు. మరోవైపు పెళ్లి కాని వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. మియామి వర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం వివాహం కాని వారిలో వివాహ బంధంలో ఉన్నవారితో పోలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. 2015`22 మధ్యకాలంలో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో నమోదైన సుమారు 40 లక్షల క్యాన్సర్ కేసులను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. పెళ్లి చేసుకున్న వారికంటే పెళ్లికాని పురుషుల్లో క్యాన్సర్ సోకే అవకాశాలు 68 శాతం ఎక్కువని తేలింది. పెళ్లి కాని మహిళల్లో ఈ ముప్పు ఏకంగా 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పెళ్లి చేసుకోవడం వల్ల శరీరంలో ఏదో అద్భుతం జరిగి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందని దీని అర్థం కాదని.. పెళ్లి చేసుకోవడం వల్ల సంభవించే పలు సామాజిక, జీవనశైలి మార్పులు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనానికి నాయకత్వం వహించిన క్లినికల్ సైకాలజిస్ట్ ఫ్రాంక్ పెనెడో మాట్లాడుతూ ‘మీరు వివాహం చేసుకోకపోతే మీ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం చాలా ముఖ్యం’ అని ఆయన సూచించారు. ధూమపానం, దీర్ఘకాలిక ఒత్తిడి, సంతానోత్పత్తి చరిత్ర వంటివి సాధారణంగా క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇవన్నీ ఒక వ్యక్తి వివాహ స్థితి ఆధారంగా మారుతుంటాయి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వచ్చే క్యాన్సర్ల విషయంలో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. పెళ్లి కాని పురుషుల్లో ఆనల్ క్యాన్సర్ వచ్చే అవకాశం వివాహితుల కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే పెళ్లి కాని మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. జీవిత భాగస్వామి ఉంటే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. దంపతులిద్దరూ చెకప్‌లకు వెళ్లమని ఒకరికొకరు ప్రోత్సహించడం వల్ల వ్యాధి ప్రారంభ దశలోనే బయటపడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉండటంతో వీటి విషయంలో పెళ్లి అయిన వారికి, కాని వారికి మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉంది. ఎపిడిమాలజిస్ట్ పాలో పినహీరో మాట్లాడుతూ సామాజిక పరిస్థితులు క్యాన్సర్ ముప్పును సూచించే ముఖ్యమైన సంకేతాలని చెప్పారు. ప్రభుత్వం సూచించే నివారణ చర్యల్లో వివాహ స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అయితే పెళ్లి వల్ల కేవలం లాభాలే లేవని.. గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు పెళ్లి వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ప్రమాదాలు కూడా ఉన్నట్లు హెచ్చరించాయి. మరోవైపు ఒంటరిగా ఉండటం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక నెట్‌వర్క్ బలంగా ఉండే అవకాశాలు ఉంటాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తాజా పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.






Comments