ఒంటరితనం చంపేస్తోంది!
- DV RAMANA

- Aug 12
- 2 min read

‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’.. అని అన్నాడో సినీ కవి. ఇప్పుడు మనుషుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. చుట్టూ ఎంతమంది ఉన్నా.. కుటుంబం, బంధువులు ఉన్నా.. కష్టం వచ్చి నప్పుడు ఆదుకోవడం సంగతెలా ఉన్నా.. కనీసం మనసు విప్పి చెప్పుకొనేందుకు, గుండెల్లోని భారం తీర్చుకునేందుకు.. కాసింత ఓదార్పు పొందేందుకుగానీ ‘మన’ అనుకునేవారు ఒక్కరూ కనిపించని పరిస్థితి సమాజంలో నెలకొంది. మరోవైపు అక్కున చేర్చుకునేవారు ఎందరున్నా.. ఎవరితోనూ కలవలేక ఒంటరిగా మిగిలిపోయేవారు మరికొందరు. తమను తాము ఒంటరిగా ఫీలయ్యేవారిని ఇంట్రావర్ట్‌లు (అంతర్ముఖులు) అంటారు. ఇదే శృతిమించితే ఒక మానసిక రుగ్మతగా మారిపోయి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ ఒంటరితనమే కుంగుబాటు(డిప్రెషన్)కు.. అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకోవాలను కోవడం వంటి విపరీత ఆలోచనలకు పురిగొల్పుతుంది. ప్రపంచంలో ఇలా ఒంటరితనంతో బాధపడు తున్నవారు.. ఈ రుగ్మతల కారణంగానే ఆత్మహత్యలు వంటి బలవన్మరణాలకు పాల్పడుతున్నవారు లక్ష ల్లోనే ఉన్నారనడం ఆశ్చర్యం కలిగించేదే అయినా కఠోర వాస్తవం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ‘కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్’ విభాగం తన తాజా నివేదికలో పేర్కొన్న గణాంకాలే దీనికి నిదర్శనం. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇదే కారణంతో ప్రతి గంట వ్యవధిలో దాదాపు 100 మరణాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఏడాదికి సుమారు 8.71 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ఒంటరితనానికి వయసుతో సంబంధం లేదు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో అన్ని వయసులవారూ ఉన్నారు. కాకపోతే పిల్లలు, వృద్ధులతో పోలిస్తే యువతలోనే దీని బాధితుల సంఖ్య ఎక్కువ. వృద్ధుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు, యువ ప్రాయం లో ఉన్నవారిలో ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరులే. ఏకాకి జీవితంతో విసిగిపోతున్నవారి సంఖ్య.. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉంది. అధికాదాయ దేశాల్లో ఒంటరితనం బాధితుల సంఖ్య 11 శాతంగా ఉంటే.. అల్పాదాయ దేశాల్లో ఆ సంఖ్య 24 శాతంగా ఉంది. 13 నుంచి 29 ఏళ్లవారిలో ఒంటరితనంతో బాధపడుతున్నవారి సంఖ్య 17 నుంచి 21 శాతంగా ఉంది. టీనేజర్లు అంటే యువతలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇదొక్కటే కాకుండా అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్య ధికంగా 13 నుంచి 17 ఏళ్ల యవతలో 20.9 శాతం మందిని ఒంటరితనం వెంటాడుతోంది. ఇది కూడా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోని యువతనే అధికంగా చిదిమేస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇలా ఒంటరితనం ఫీల్ అవుతున్న యువత చదువులో తక్కువ గ్రేడ్లు సాధించే ప్రమాదం 22 శాతం అధికంగా ఉందట. ప్రస్తుత డిజిటల్ యుగం ప్రపంచం నలుమూలల ఉన్నవారిని అత్యంత సులభంగా పరస్పరం కనెక్ట్ చేసుకోగలిగే సౌకర్యం కల్పిస్తోంది. కానీ సెల్‌ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ వంటి సాంకేతిక సౌలభ్యాల ఉచ్చులో చిక్కుకుని మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని నిపుణులు అంటున్నారు. నిరంతరం ఫోన్లు, కంప్యూటర్లలో లీనమైపోతున్న టీనేజర్లు, యువత తమకు తెలియకుం డానే మానవ సంబంధాలను మర్చిపోతున్నారు.. కోల్పోతున్నారు. దానివల్ల సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. దీనికితోడు దీర్ఘకాలిక వ్యాధులు, వైకల్యాలు, ఇతర శారీరక, మానసిక సమస్యలు, ఆత్మన్యూనత భావం వంటివి ఒంటరితనానికి దారితీస్తున్నాయి. సంపాదన, ఇతర వ్యాపకాల్లో బిజీ అయిపోయి తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన సమయం కేటాయించకపోవడం, పిల్లలు ఏం చేస్తున్నారన్నది కూడా గమనించక పోవడం వల్ల టీనేజర్లు ఒంటరితనానికి గురవుతూ మానసికంగా దెబ్బతింటున్నారు. దీనికి విరుగుడు సామాజిక సంబంధాలను పెంచుకోవడమేనని డబ్ల్యూహెచ్‌వో నివేదిక సూచించింది. ఇతరులతో కలవ డానికి అసంఖ్యామైన అవకాశాలున్న ఈ రోజుల్లో చాలామంది తమను తాము ఒంటరివ్యక్తులుగా భావిం చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్‌వో కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ సహాధ్యక్షుడు డాక్టర్ వివేక్ మూర్తి మాట్లాడుతూ ఈతరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఒంటరితనమేనని అభివర్ణించారు. పెరుగుతున్న టెక్నాలజీ మనకు అదనపు బలంగా ఉండాలే తప్ప బలహీనతగా మారకూడదని ఆయన అన్నారు. ఇది జరగాలంటే ప్రభుత్వ విధానాలన్నింటిలోనూ సామాజిక అనుసంధానాన్ని తప్పనిసరి చేయాల్సి ఉంటుంది.










Comments