ఒడిశాలో దాష్టీకం.. పేకాట బాబులకు శృంగభంగం
- Prasad Satyam
- Nov 5, 2025
- 2 min read
ఎస్పీ దెబ్బతో శిబిరాలతో సహా పర్లాకిమిడికి పరార్
అక్కడేమో దౌర్జన్యకారుల వీరంగం
పేకాట నిర్వాహకులపై దాడిచేసి సొమ్ము దోపిడీ
మహేశ్వర్‌రెడ్డి బదిలీపై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతు
ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పోలీసు బాస్ దెబ్బతో జిల్లాలో ఏ మూలా పేకాడలేని పరిస్థితి నెలకొంది. పేకాడితే గానీ చేతి దురద తీరనివారు, దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లు గడిస్తున్న నిర్వాహకులకు పక్క రాష్ట్రంలో కూడా నిలువనీడ లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఊహించని దెబ్బ తగిలింది. జిల్లాలో పాతపట్నం టౌన్‌కు ఆనుకొని ఉన్న పర్లాకిమిడిలో గత కొద్ది కాలంగా పేకాట శిబిరాలు బహిరంగంగానే నిర్వహించేవారు. అక్కడి వ్యవస్థలను ఎవరు ఎలా మేనేజ్ చేశారో గానీ.. బహిరంగంగానే పేకాట శిబిరాలు నడిచేవి. శ్రీకాకుళంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కార్లు పెట్టి పేకాటరాయుళ్లను ఆ జూదగృహాలకు తరలించే యంత్రాంగంపైనా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఉక్కుపాదం మోపడంతో ‘ఒడిశా శరణం గచ్ఛామి’ అంటూ వాహనాలు, బౌన్సర్లు, వేగులు వంటి అన్ని వ్యవస్థలను ఆ రాష్ట్రంవారి చేతికే మన జిల్లా నిర్వాహకులు అప్పగించారు. దీంతో అక్కడ మూడు పువ్వులు, ఆరు కాయలుగా పేకాట శిబిరాలు కళకళలాడేవి.
రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని శిబిరానికి వాటాదారులుగా ఉన్న నలుగురిని కొందరు ఒడిశావాసులు అడ్డగించి రూ.22 లక్షల నగదు ఎత్తుకుపోయినట్లు తెలిసింది. పేకాట శిబిరం ముగిసిన తర్వాత నిర్వాహకులు వాటాలు పంచుకుంటున్న సమయంలో పర్లాకిమిడికే చెందిన కొందరు యువకులు దాడి చేసి చితక్కొట్టి పేకాటలో వచ్చిన సొమ్మంతా దోచుకుపోయారని ఇక్కడ చెప్పుకొంటున్నారు. పేకాట శిబిరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దుండగులు దోచుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేయలేక బాధితులంతా తేలు కుట్టిన దొంగల్లా గమ్మున ఉన్నట్టు తెలిసింది. దీనికి కొద్ది నెలల ముందు ఒక శిబిరంలో పేకాడి లక్షల్లో ఓడిపోయిన ఒక ఒడిశావాసి సొమ్ము చెల్లించడానికి నిరాకరించడంతో పెద్ద గొడవే జరిగిందని వినికిడి. ఆ సందర్భంలో ఒడిశా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సొమ్ము ఎగ్గొట్టినవారి తరఫునే మాట్లాడారని, అందుకే ఇప్పుడు దుండగులు రూ.22 లక్షలు దోచుకుపోయినా ఎవరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదని తెలిసింది. ఆమధ్య రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ జరిగినప్పుడు జిల్లా నుంచి మహేశ్వర్‌రెడ్డిని బదిలీ చేస్తారని, ఆ తర్వాత ఎంచక్కా జిల్లాలోనే విచ్చలవిడిగా పేకాడుకోవచ్చని స్వయంగా కొందరు పోలీసు అధికారులే పేకాట నిర్వాహకులకు భరోసా ఇచ్చారు. అయితే ఎస్పీ బదిలీ జరగకపోవడంతో పర్లాకిమిడికి అడపాదడపా వెళ్లి వస్తున్న నిర్వాహకులు తర్వాత దీన్ని నిరంతర ప్రక్రియ చేసేశారు. జిల్లాలో అనేక పోలీస్‌స్టేషన్లకు మొన్నటి వరకు పేకాట శిబిరాలు కూడా ఒక ఆదాయ వనరుగా ఉండేవన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మహేశ్వర్‌రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కో లింకు తెగుతూవచ్చింది. అప్పటికీ కొన్ని స్టేషన్ల పరిధిలో పోలీసులకు ముందుగానే సమాచారమిచ్చి రహస్యంగా ఆడుకొనే విధానం నడిచేది. అయితే దీన్ని గమనించిన ఎస్పీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి, నగరం నడిబొడ్డులోనే పేకాట శిబిరాలను పట్టుకొని జిల్లా మొత్తానికి ఒక సందేశాన్ని పంపారు. దీంతో మొత్తం నరసన్నపేట, శ్రీకాకుళం వంటి ప్రాంతాల నుంచి నిర్వాహకులు పేకాటను పర్లాకిమిడికి తరలించారు. ఇప్పుడు అక్కడ కూడా సొమ్ముకు గ్యారెంటీ లేకపోవడంతో అనేకమంది పోలీసు అధికారుల మాదిరిగానే ఎస్పీ బదిలీ కోసం వీరూ ఎదురుచూస్తున్నారు.










Comments