ఓట్ల చోరీపై ఎందుకంత గుంభనం!
- DV RAMANA

- Nov 7, 2025
- 2 min read

బీహార్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అగ్రనేత మరోసారి ఓట్ల చౌర్యం వివాదాన్ని తెరపైకి తెచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగుకు ఒక్కరోజు ముందు గత ఏడాది సార్వత్రిక ఎన్నికలనాటి నుంచి నలుగుతున్న ఓట్లచోరీపై రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం హెచ్ ఫైల్స్ పేరుతో హర్యానా రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల ఓటర్లు ఉండగా అందువలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్న బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో 45 లక్షలకుపైగా ఓట్లు తొలగించేశారని ఇంతకుముందు నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఎస్‌ఐఆర్‌నే చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను కేంద్రంతోపాటు ఎన్నికల సంఘం తిరస్కరిస్తున్నాయే తప్ప.. వాస్తవాలు ఏమిటన్నదానిపై సాధికారిక సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నాయి. ఓట్లను అకారణంగా తొలగించడంతోపాటు హర్యానాలో 5.21 లక్షల ఫేక్ ఓటర్లను చేర్చారని రాహల్ పలు ఉదాహరణలతో ఆరోపించడం విశేషం. ఒక పోలింగ్ బూత్ పరిధిలో ఒకే మహిళ పేరు ఏకంగా 223 సార్లు నమోదు కావడాన్ని ఆయన ఎత్తిచూపారు. మరి ఆ మహిళ ఎన్నిసార్లు ఓటు వేశారో అధికారులే చెప్పాలి. ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లతో ఒక యువతి 22 చోట్ల ఓట్లు వేసిందని రాహుల్ ఆరోపించారు. హర్యానా ఎన్నికల చరిత్రలో మొదటిసారి పోస్టల్ బ్యాలెట్ వాస్తవ ఓట్ల ధోరణి భిన్నంగా ఉండటాన్ని రాహుల్ ఎత్తిచూపారు. సరే.. ఇవన్నీ రాజకీయ ఆరోపణలుగానే కొట్టిపారేసినా.. భారత పౌరురాలు కాని బ్రెజీలియన్ యువతి పేరు హర్యానా ఓటర్ల జాబితాలో ఉండటం కచ్చితంగా ఎన్నికల సంఘం సమాధానం చెప్పుకోవాల్సిన లోపమే. కానీ షరామామూలుగానే కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం పట్ల ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఆరోపణలు పక్కన పెడితే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరోపించారు. కానీ చిత్రంగా ఆతర్వాత నుంచి ఆ ప్రస్తావనను వారు ఎక్కడా తేకపోవడం వెనుక ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఒత్తిడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాహుల్ గాంధీ తరచూ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై బీజేపీ నాయకులు, వారి అభిమానులు స్పందించలేకపోవడం వారి సహజశైలికి భిన్నంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హర్యానాలో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఫొటోతో 22 ఓట్లు సృష్టించినా ఈసీలో చలనం లేకుండా పోయిందని ఘాటుగా విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కంటే ముందే బ్రెజిల్ మోడల్ లారిస్సా నెరీ స్పందించారు. భారత రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఒక ప్రత్యేక వీడియో పోస్టు ద్వారా చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను బ్రెజిల్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌నని ఆ వీడియోలో ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో తాను వైరల్ అవుతున్నానని, చాలా ఇంటర్వ్యూల్లో తనకు దీనికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయని బ్రెజీలియన్ యువతి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలు, వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించాయి. గత ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల సంఖ్యలో అసలు ఓటర్ల తొలగించడం.. అదే సంఖ్యలో నకిలీ ఓటర్లను చేర్చడం ద్వారా ఎన్నికల్లో బీజేపీ నకిలీ విజయం సాధించేలా కుట్రలు అమలు చేశారని రాహుల్ ఆరోపించారు. తద్వారా భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త వివాదం, ఆందోళన, ఆవేదన కలిగించే అంశం ఇప్పుడు ఓటర్ల ముందుకు వచ్చింది. ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు ఎక్కుపెట్టేలా చేసింది. స్వతంత్ర భారతదేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 నుంచి 2019 సాధారణ ఎన్నికల వరకు ఏ పార్టీగానీ, ఏ ప్రతిపక్ష నాయకుడు గానీ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయలేదు. ఏ అధికారపక్షమూ ఈ స్థాయి విమర్శలు ఎదుర్కోలేదు. ఓట్ల చోరీ ఆరోపణలు, దానికి చూపిస్తున్న ఆధారాలు భారత ఎన్నికల నిర్వహణ తీరుపై సవాలక్ష సందేహాలకు ఆస్కారమిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన ప్రతి సందర్భంలో రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ లేదా ఇతర పక్షాలపైనే అంతెత్తున విరుచుకుపడే బీజేపీ ముఖ్యనేతలు ఓట్లచోరీ ఆరోపణలపై మాత్రం స్పందిస్తున్నటుగా మీడియాలో వార్తలు లేవు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తే తమకు ఇబ్బందని భావించారో? లేకపోతే కొంత సమయం వేచి చూసి సమాధానం చెప్పాలనుకుంటున్నారో తెలియదు. అయితే బీజేపీ నేతల ధోరణి, ఈసీ వైఖరి చూసి రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణల్లో నిజం ఉండవచ్చన్న భావన ప్రజల్లో కలిగే ఆస్కారం లేకపోలేదు. దీనిపై ఇప్పటికైనా ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరముంది. అదేవిధంగా అధికార పార్టీ అధినాయకత్వం స్పందించాల్సిన అనివార్యత కూడా ఉంది. ఆరోపణలకు ప్రత్యారోపణలే సమాధానం అన్నట్లు కాకుండా నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకత ను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. భావ వ్యక్తీకరణలో, ప్రసంగాల్లో రాహుల్ గాంధీ దిట్టకాకపోవచ్చు. కానీ ఆయన లేవనెత్తిన సందేహాలు, వాటికి చూపిస్తున్న ఆధారాలు సంచలనాత్మకమైనవి. ప్రజాస్వామ్యవ్యవస్థ మరింత బలపడాలంటే వాటికి కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే.










Comments