ఓట్ల లెక్కలన్నీ అంకెల గారడీయేనా?
- DV RAMANA

- Aug 11, 2025
- 2 min read

ఎన్నికల్లో అక్రమాలు మన ఘనతరమైన ప్రజాస్వామ్య సౌధంలో కొత్త కాదు. రిగ్గింగ్, దొంగ ఓట్ల నమోదు, బూత్ క్యాప్చరింగ్ వగైరా చిన్నెలన్నీ పాతబడిపోయాయి. మనం పాత సంప్రదాయాలకు నీళ్లొ దిలేసినట్లే ఎన్నికల అక్రమార్కులు కూడా సంప్రదాయ ఎన్నికల అక్రమాలను వీడి ఈవీఎంల ట్యాంప రింగ్, ఓటర్ల జాబితాల్లో మతలబులు వంటి విధానాలను అనుసరిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు ఇప్పటివి కావు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటినుంచీ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే చిత్రంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలే ఈవీఎం లను తప్పుపడుతున్నాయి. అదే పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. గతంలో అవే ఈవీఎంలలో పోలైన ఓట్లతో గెలిచి నోరుమెదపని పార్టీ.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈవీఎంలను తప్పుపడుతోంది. షరామామూలుగా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల నికార్సయినవని, ఎవరూ ట్యాంపర్ చేయలేరని సర్టిఫికెట్ ఇస్తున్నాయి. ఈ ఖండన మండనలతో తమకేం సంబంధం లేనట్లు ఎన్నికల అక్రమాలు మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అక్రమాలు ఎలా, ఎప్పుడు జరిగినా ఓట్ల లెక్కలు మాత్రం సరిపోయేలా చూసుకునేవారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పరామీటర్‌ను కూడా బేఖాతరు చేసినట్లు పలు స్వచ్చంధ నిఘా సంస్థలు, తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెలికి తీసిన అంకెలు స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే.. గత ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓట్ల సంఖ్యకు.. ఫలితాలు తేల్చేందుకు అధికారులు లెక్కించిన ఓట్ల సంఖ్యకు దేశవ్యాప్తంగా వందకుపైగా పార్లమెంటు నియో జకవర్గాల్లో పొంతనే కుదరలేదట! వాస్తవానికి ఈ ఆరోపణ కొత్తదేం కాదు. గత ఏడాది ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొన్ని నెలల వ్యవధిలేని ఏడీఆర్ వంటి సంస్థలు ఈ విషయాన్ని అంకెలతో సహా బయటపెట్టాయి. కానీ అప్పట్లో ఎన్నికల సంఘంతో సహా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా దేశ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ తేనెతుట్టెను కదిపారు. దాదాపు ఏడాది పాటు అనేక నియోజకవర్గాల్లో ఈ అంకెల గారడీపై పార్టీపరంగా విచారణ జరిపి అక్రమాల నిగ్గు తేల్చా మని రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల సంఘం ప్రకటిం చిన ఓట్ల లెక్కల్లోనే మతలబులను వివరించారు. దాని ప్రకారం చాలా నియోజకవర్గాలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అదనంగా ఉన్న ఓట్లన్నింటినీ ఎన్డీయే పార్టీల ఖాతాలో వేసేసి.. ఆ కూటమే మెజారిటీ సీట్లు సాధించినట్లు ప్రకటించారని.. ఇది కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఆడిన నెంబర్ గేమ్ అని రాహుల్ ఆరోపించారు. విశేషం ఏమిటంటే.. గత ఎన్నికల్లో ఏపీలో ఓటమి పాలైన వైకాపా కూడా చాలా నెలల ముందే ఇవే ఆరోపణలు చేసింది. వీవీప్యాట్ల ఓట్లు లెక్కించి ఫలితాల సందర్భంగా లెక్కించిన ఓట్ల సంఖ్యతో సరిపోల్చాలని కోరుతూ ఒంగోలు వంటి కొన్ని నియో జకవర్గాల్లో ఓడిపోయిన వైకాపా నేతలు కోర్టులను ఆశ్రయించి, మళ్లీ లెక్కింపునకు అవసరమైన రుసు ములు కూడా చెల్లించినా ఎన్నికల అధికారులు ఆ లెక్కల విషయంలోనూ మేనేజ్ చేసేశారన్న ఆరోప ణలు వినిపించాయి. వైకాపా అధినేత జగన్ కూడా ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు వ్యవహారంపై గతంలో ఆరోపణలు చేసినా ఆ తర్వాత.. ఆ పార్టీగానీ, ఓడిపోయినా నేతలు గానీ ఆ వివాదాన్ని వదిలే శారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఈ ఆరోపణల తీగ లాగడం ద్వారా డొంకంత కదిలించే ప్రయత్నం చేస్తు న్నారు. రాహుల్‌గాంధీ ఇంత చేస్తున్నా.. వైకాపా, దాని అధ్యక్షుడు జగన్ ఇప్పటికైనా ఈ ఓట్ల అక్రమా లపై ఆయనతో కలవడానికి ముందుకు రావడంలేదు. కనీసం గతంలో వినిపించిన గొంతునైనా మళ్లీ విప్పడంలేదు. రాహుల్ తన ప్రెస్‌మీట్‌లో నేరుగా జగన్ పార్టీ గురించి ప్రస్తావించి ఓట్ల మాయ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందన్నట్లు మాట్లాడినప్పుడు.. అది కూడా ఒక ప్రజాస్వామిక సమస్యపై గొంతె త్తుతున్నప్పుడు ఇంకా పాత విషయాలను మనసులోపెట్టుకుని కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లు ఉండటం సబబు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలపై ఇంత తీవ్రస్థాయిలో ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయా వ్యవస్థ ్టలదే. అన్‌ఫెయిర్ ఎలక్షన్స్ అంటేనే అన్‌ఫెయిర్ గవర్నమెంట్ అనీ.. అన్‌ఫెయిర్ గవర్నమెంట్ అంటే అన్ డెమొక్రాటిక్ అనీ.. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తే.. ఎన్నికలే పునాదిగా నిర్మించుకున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థ పేకమేడలా మారిపోతుంది.










Comments