top of page

ఓటు వర్సెస్‌ నోటు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jan 3
  • 3 min read
  • ఇచ్ఛాపురం వైకాపా ఇన్‌ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు

  • అందరి మద్దతున్న శ్యాంప్రసాద్‌ వైపు పార్టీ మొగ్గు

  • ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే

  • ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు

  • తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్‌ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపురం వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న పిరియా విజయ దంపతులు ఇకనుంచి తాము ఇచ్ఛాపురంలో రాజకీయాలు చేయలేమని నేరుగా ఆ పార్టీ చీఫ్‌ జగన్మోహన్‌రెడ్డికే స్పష్టం చేయడంతో ఇక్కడ కొత్త ఇన్‌ఛార్జిని నియమించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. పిరియా సాయిరాజ్‌ దంపతులు తప్పుకోవడంతో రెడ్డిక సామాజికవర్గానికి చెందిన సాడి శ్యాంప్రసాద్‌రెడ్డికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినేత భావించారు. ఈ మేరకు శ్యామ్‌కు సంకేతాలు కూడా అందాయి. అయితే ఇంతవరకు ఆదేశాలు మాత్రం రాలేదు. జగన్మోహన్‌రెడ్డి బెంగళూరులో ఉండటమే జాప్యానికి కారణమని కొందరు చెబుతుంటే.. టిక్కెట్‌ రేసులోకి ఎమ్మెల్సీ నర్తు రామారావు రావడం కూడా కారణమని మరో వాదన వినిపిస్తోంది. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి టిక్కెటిస్తే కీలకమైన మనీ మేనేజ్‌మెంట్‌లో విఫలమవుతారని, అదే తనకిస్తే ఎంతైనా ఖర్చుపెడతానన్న సంకేతాలను రామారావు పార్టీ పెద్దలకు పంపినట్లు కొందరు చెబుతున్నారు.

రెడ్డిక సామాజికవర్గానికి సీటు

వాస్తవానికి జగన్మోహన్‌రెడ్డి ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై పోటీకి అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను గత రెండు ఎన్నికల్లో నిలిపారు. అయినా ఇక్కడ గ్రూపు రాజకీయాల వల్ల విజయం దక్కలేదు. మరోవైపు 2014 ఎన్నికల్లో నర్తు రామారావు వైకాపా టిక్కెటివ్వగా ఆయన కూడా గెలవలేదు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్ఛాపురంలో మెజారిటీ సామాజికవర్గంగా ఉన్న రెడ్డిక నేతకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని భావించారు. ఎందుకంటే.. గతంలో కులసమీకరణాలకు అతీతంగా అనేకమంది గెలిచినా, ఎక్కువమంది రెడ్డిక సామాజికవర్గం నుంచే ఎమ్మెల్యేలయ్యారు. అశోక్‌ రంగప్రవేశం చేసిన తర్వాత ఈ సీటు కాళింగులకు వెళ్లిపోయింది. ఇదే సామాజికవర్గంతో చెక్‌ పెట్టాలని చూసినా కుదరకపోవడంతో ఈసారి మెజారిటీ వర్గాన్ని జగన్మోహన్‌రెడ్డి నమ్ముకుంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం బాధ్యతల నుంచి తప్పుకుంటున్న పిరియా కుటుంబం కూడా శ్యామ్‌ప్రసాద్‌కే తమ ఓటు అన్నట్టు జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు ప్రచారం ఉంది. అలాగే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో చాలామంది వైకాపా నాయకుల అభిప్రాయం కూడా ఇదే. కాకపోతే రాబోయే ఎన్నికలు వైకాపాకు జీవన్మరణ సమస్యలాంటివి. కాబట్టి డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. తన పేరు ప్రకటిస్తే ఎన్నికల్లో ఖర్చు పెట్టలేనంత బలహీనుడిని కాననే సంకేతాన్ని కూడా శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పంపగలిగారు.

విఫల నేతగా మిగిలిన నర్తు

నర్తు రామారావుకు ఒకప్పుడు ఇచ్చాఫురం నియోజకవర్గంలో కొంత పట్టున్న మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగై ధర్మాన ప్రసాదరావు వైకాపాలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్ఛాపురంలో నర్తు రామారావు ప్రభ తగ్గిపోయింది. కారణం జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలే. అయినా 2024లో సాయిరాజ్‌ భార్య విజయను గెలిపించాలన్న లక్ష్యంతో ఇచ్ఛాపురంలో నర్తు రామారావు ద్వారా యాదవుల ఓట్లు రాబట్టడానికి ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు. కానీ తన సొంత మండలం కవిటిలో కూడా ఆయన వైకాపాకు మెజారిటీ తేలేకపోయారు. కారణం.. టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌ది కూడా అదే మండలం. పిరియా విజయకు టిక్కెటిచ్చిన దగ్గర్నుంచి అనేకమార్లు గ్రూపులు కట్టి తనకూ టిక్కెట్‌ కావాలని ప్రయత్నించిన రామారావు గత ఎన్నికల్లో వైకాపా కోసం పని చేశారా? లేదా? అనేది ఫలితమే బయటపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న వైకాపా ఇచ్ఛాపురంలో మాత్రం ఎలా గెలుస్తుందన్న ప్రశ్న తలెత్తొచ్చు. బెందాళం అశోక్‌ అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మూడోసారి సహజంగా ఏర్పడే వ్యతిరేకతలోనూ, అనేక మెజార్టీ కులాలు కలిసినా కూడా వైకాపాను గెలిపించలేకపోవడం ప్రత్యేక సందర్భం. ఎమ్మెల్సీ అయిన తర్వాత రామారావు పట్ల నియోజకవర్గంలో పూర్తి విరక్తి ఏర్పడిరదని చెప్పుకుంటారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్న రామారావు నియోజకవర్గ సమస్యలపై గానీ, కార్యకర్తల శ్రేయస్సు కోసం గానీ ఏరోజూ మాట్లాడిన సందర్భం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తన సొంత గ్రామంలో సర్పంచ్‌గా భార్యను పోటీలో నిలబెట్టినా వైకాపా గాలిలో కూడా ఆమెను గెలిపించలేకపోయారు. కానీ ప్రతి ఎన్నికల ముందు ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం మాత్రం నర్తు ప్రయత్నిస్తుంటారు. ఇన్నాళ్లూ ధర్మాన ప్రసాదరావు అండదండలు రామారావుకు ఉండేవి. ఇచ్ఛాపురంలో లల్లూ తనను వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా రామారావును ధర్మాన తయారుచేశారు. అయితే ఆయన సహజధోరణి మారకపోవడంతో రాజకీయాల్లో రాణించలేకపోయారు. కానీ గత ఎన్నికల ముందు మళ్లీ అదే ధర్మాన సోదరుల దయతో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.

సమస్యలపై సాడి పోరాటాలు

వాస్తవానికి ఆ పదవి శ్రీకాకుళం మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతికి ఇస్తానని జగన్మోహన్‌రెడ్డి మాటిచ్చారు. కానీ ఇచ్ఛాపురంలో విజయ గెలుపు కోసం రామారావు వైపు మళ్లాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం జిల్లా మొత్తం గెలుపు బాధ్యతలు ధర్మాన ప్రసాదరావుకు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు జగన్మోహన్‌రెడ్డి 90 శాతం ఓకే చేశారు. కాబట్టి ఇచ్ఛాపురాన్ని కూడా గెలిపించాల్సిన బాధ్యత ధర్మాన మీద ఉంది. పాత పరిచయాలతోనో, నోట్లున్నాయన్న కారణంతోనే రామారావుకు టిక్కెట్‌ కోసం ధర్మాన సోదరులు ప్రతిపాదించే అవకాశం ఈసారి లేదు. ఎమ్మెల్యే పదవి ఉంటుండగా జగన్మోహన్‌రెడ్డి కోసం దాన్ని వదులుకొని వచ్చిన పిరియా సాయిరాజ్‌ గెలిస్తే మంత్రి అవుతారన్న కారణంతో గత ఎన్నికల్లో చాలామంది వైకాపా నాయకులు తమ అభ్యర్థి ఓటమి కోసం ఎక్కువ పని చేశారు. ఈసారి అలా కుదరదు కాబట్టి సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వైపే ధర్మాన సోదరులు మొగ్గు చూపిస్తున్నారు. శ్యామ్‌ కూడా పార్టీ అధికారంలో ఉందా, లేదా? అన్న దానికి ప్రమేయం లేకుండా నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య పరిష్కారం కోసం పరుగులు తీస్తున్నారు. కవిటిలో డిగ్రీ కాలేజీ కోసం, బారువలో కొత్త ఆస్పత్రి నిర్మాణం పూర్తికి, నగరంలోకి భారీ వాహనాలు రావడానికి వీలుగా బ్రిడ్జి నిర్మాణానికి, అమ్మవారి ఉత్సవాల్లో విద్యుత్‌ షాక్‌తో మరణించిన ముగ్గురికి ఎక్స్‌గ్రేషియా ఇప్పించడం.. ఇలా అనేక సమస్యలపై ఆయన పోరాడుతున్నారు. కొంతవరకు విజయం కూడా సాధిస్తున్నారు. ఇవన్నీ ధర్మాన డైరెక్షన్‌లోనే నడుస్తున్నాయి. అందువల్ల ఈసారి నోటుకంటే ఓటు బలానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దీన్ని ప్రకటించడంలో ఎంత తాత్సారం చేస్తే, పార్టీకి అంత నష్టం జరుగుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page