top of page

ఓటు హక్కును చంపేస్తున్నారు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 14, 2025
  • 2 min read

‘బతికున్న నన్ను చంపేశారు. నా ప్రమేయం లేకుండానే.. విచారణ జరపకుండానే, ఆధారాలు అడక్కుండానే.. నన్ను చనిపోయినవాడి కింద జమ కట్టేసి నా ఓటుహక్కును హరించేశారు. కానీ నేను బతికున్నాను మొర్రో.. అని మొత్తుకుంటున్నా మళ్లీ ఓటు హక్కు కల్పించడానికి ఆ పత్రాలు, ఈ పత్రాలు కావాలంటున్నారు.. ఇదెక్కడి న్యాయం’.. ఇదీ సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి ఆరోపణ, ఆవేదన. ఓటర్ల జాబితాల సవరణల పేరుతో జరుగుతున్న అవకతవకలకు ఇదో ప్రబల నిదర్శనం. చనిపోయా డని ఏకపక్షంగా తేల్చేసి ఓటర్ల జాబితా నుంచి అధికారులతో తొలగింపునకు గురైన వ్యక్తే నేరుగా కోర్టులో ప్రత్యక్షమవడం మన ఎన్నికల ప్రజాస్వామ్య వికృత నగ్నస్వరూపానికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఓ వ్యక్తి నేరుగా వచ్చి నేను బతికే ఉన్నాను మహాప్రభో.. అని చెప్పినా కూడా ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది దాన్నో డ్రామాగా కొట్టిపారేయడానికి ప్రయత్నించడం.. అడ్డగోలు వాదనకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందన్న ఆరోపణలు మిన్నంటాయి. అధికార ఎన్డీయే కూటమి పార్టీలు ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకుని, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులుగా ఉన్న వారందరి పేర్లను రకరకాల కారణాలతో ఓటర్ల జాబితాల నుంచి పీకించేశారు. ఆ విధంగా సుమారు 65 లక్షల ఓట్లను రాష్ట్ర ఓటర్ల జాబితాల నుంచి తొలగిం చేయడంపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు విచారణ బెంచ్‌ ముందుకు చనిపోయారని తొలగింపునకు గురైన ఇద్దరు వ్యక్తలు స్వయంగా హాజరయ్యారు. భోజ్‌పురి జిల్లా ఆరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 41 ఏళ్ల మింటు పాశ్వాన్‌ వారిలో ఒకరు. పిటిషనర్లలో ఒకరైన యోగేంద్ర యాదవ్‌ వారిని కోర్టుకు తీసుకొచ్చారు. పాశ్వాన్‌ మాట్లాడుతూ ‘నా పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని, నేను చనిపోయినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించినట్లు గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాను. నేను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఓ వీడియో కూడా చేశాను. ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాను. కానీ అధికారులు బ్యాంకు ఖాతా పత్రాలు, స్కూల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు వంటివి అడుగుతున్నారు. నా పేరు తొలగించేటపుడు అసలేమీ అడగలేదు. చేర్చమంటే మాత్రం సవాలక్ష అడుగుతున్నారు’ అని పాశ్వాన్‌ వాపోయారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు కోల్పోయిన 65 లక్షల మందిలో పాశ్వాన్‌ ఒకరు. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. తొలగించిన 65 లక్షల ఓటర్లలో 22 లక్షల మంది చనిపోయారట! మరో 36 లక్షల మంది శాశ్వతంగా వలసపోవడమో లేదా నిర్దేశిత చిరునామాలో లేకపోవడమో జరిగిందట!! మరో ఏడు లక్షల మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఓట్లున్నాయట!!!. కానీ కనీసం తన ఇంటికి రాకుండా విచారించకుండానే తనను, కేరళలో పనిచేస్తున్న తన సోదరుడిని కూడా చనిపోయినవారి జాబితాలో చేర్చేశారని.. దీనిపై ఫిర్యాదు చేసిన తర్వాతే బూత్‌స్థాయి అధికారి ఇంటికి వచ్చి చూసి వెళ్లారని పాశ్వాన్‌ వివరించారు. వాస్తవం కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎన్నికల సంఘం తరఫున వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ రాకేష్‌ ద్వివేది ఇలా వ్యక్తు లను కోర్టులో హాజరుపర్చటం డ్రామా అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా నాటకాలాడే బదులు పొరపాట్లను సరిదిద్దేందుకు సహకరిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీల ధర్మాసనం కూడా ఇది సరిద్దుకోదగిన పొరపాటే అని వ్యాఖ్యా నించింది. కాగా సామూహికంగా ఓటుహక్కు రద్దుచేసే పరిస్థితి ఉన్న సందర్భాల్లో తాము జోక్యం చేసుకుంటామని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన హామీని పిటిషనర్‌ యోగేంద్రయాదవ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్నది సామూహిక ఓట్ల రద్దు ప్రక్రియేనని.. అందు వల్ల సర్వోన్నత న్యాయస్థానం దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల చాలామంది పేదలు తమ ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. గతం నుంచీ ఓట్లు వేస్తూ.. ఇప్పుడు ఓటుహక్కు కోల్పోయిన వారిని మళ్లీ కొత్తగా నమోదు కావాలని అధికారులు చాలా సింపుల్‌గా సూచిస్తున్నారు. స్థానికులేనని నిర్ధారించడానికి చాలా పత్రాలు అడుగుతున్నారు. ఈ కసరత్తు తప్పుడు పద్ధతుల్లో ఎన్నికైనవారిని కాకుండా ఎన్నుకున్నవారిని తప్పుపడుతున్నట్లుగా ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page