పాపం.. మన రూపాయి!
- DV RAMANA

- 3h
- 3 min read

అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ భీకరంగా వాయిస్తున్న సుంకాలు అనే ట్రెంపెట్ మోతలు.. దేశాలను స్వాధీనం చేసుకుంటామనే బాజాల వాయింపుల రీసౌండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిధ్వనిస్తోంది. గూబలు గుయ్యిమనేలా చేస్తోంది. అనేక దేశాల స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడుదిడుకులకు గురవుతున్నాయి. మన దేశ స్టాక్ మార్కెట్లు సైతం ట్రంప్ ప్రభావంతో నేలచూపులు చూస్తున్నాయి. గురువారం దేశీయ స్టాక్ సూచీలు కొద్దిగా కోలుకున్నా.. అంతకుముందు నాలుగు రోజుల నుంచీ కిందికి జారిపోతూనే ఉన్నాయి. ఫలితంగా రిటైల్ మదుపరులు(ఇన్వెస్టర్లు) తీవ్రంగా నష్టపోతున్నారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజమైన రిలయన్స్ షేరు సైతం తీవ్రంగా నష్టపోతోంది. గత ఐదేళ్లలో తొలిసారి రిలయన్స్ షేర్ ధర పతనం వల్ల ఇన్వెస్టర్లు రూ. 2.65 లక్షల మేరకు నష్టపోయారు. అదే మొత్తం భారతీయ స్టాక్‌మార్కెట్ పరంగా చూస్తే గత కొద్దిరోజుల్లోనూ రూ.10 లక్షల కోట్లకుపైగా మదుపరులు, పారిశ్రామిక సంస్థల పెట్టుబడులు ఆవిరైపోయాయని ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. టారిఫ్‌ల పెంపు, వాణిజ్య యుద్ధాల హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫెడ్ రేట్లు తగ్గిస్తుందా లేదా అన్న క్లారిటీ లేకపోవడంతో పెట్టుబడులు ఈక్విటీల నుంచి బయటకు వెళ్తున్నాయి. భారతీయ స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్దఎత్తున వెనక్కి తీసుకుంటుండటం మార్కెట్ల పతనానికి మరో కారణం. బంగారం, వెండి ధరలు అదుపు లేకుండా పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో రిస్క్ పెరిగిందని భావిస్తున్న ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు తీసేసి బంగారం, వెండి వంటి భద్రమైన పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. ఇవన్నీ కలిసి మన భారతీయ కరెన్సీ అయిన రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నేýకేసి తొక్కేస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో రూపాయి మారకపు విలువ(ఎక్స్ఛేంజ్ రేట్) ఆల్‌టైవమ్ కనిష్టానికి చేరుకుంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.70 రూపాయలకు పడిపోయింది. గ్లోబల్ అనిశ్చితి వల్ల ఫారెక్స్ (ఫారిన్ ఎక్స్ఛేంజ్) మార్కెట్లలో రూపాయి పతనం ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల బంగారం, వెండ ధరలు మరికొన్నాళ్లు పరుగులు తీస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవాం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91.7450 స్థాయికి పడిపోయింది. దానికి ముందురోజు ట్రేడింగ్ ముగింపు సమయంలో డాలర్ విలువ రూ.90.9775 వద్ద ఉండేది. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా తగ్గిపోయిందన్నమాట. రూపాయి విలువ పతనావస్థపై పలువురు ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ వివాదం, జపాన్ బాండ్ మార్కెట్లో అమ్మకాలు, రిస్క్ అవర్షన్ కారణంగా రూపాయి మరోసారి కొత్త కనిష్ట స్థాయికి పడిపోయిందని విశ్లేషించారు. ఈక్విటీ మార్కెట్లు కూడా పడిపోవడంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లలో నష్టాల్లో నడుస్తున్నాయని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద పతనమన్నారు. ఈ పతనంతో 2026లో ప్రారంభంలోనే ఆసియా కరెన్సీలో రూపాయి రెండో అత్యంత బలహీన కరెన్సీగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి దాదాపు 1.98 శాతం నష్టపోయింది. జనవరి నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు రూ.33 వేల కోట్లు ఉపసంహరించుకున్నారని ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో జాప్యం, భారత ఎగుమతులపై అమెరికా అధిక టారిఫ్లు విధించడం, ముఖ్యంగా విలువైన లోహాల దిగుమతిదారుల నుంచి పెరిగిన డాలర్ డిమాండ్ రూపాయి పతనాన్ని మరింత పెంచిందంటున్నారు. రూపాయి మారకం విలువ పడిపోతున్నకొద్దీ మనదేశ ఆర్థిక బిల్లు అంటే బడ్జెట్‌పై భారం పెరుగుతుంటుంది. మనదేశ ఇంధన అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాం. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలను సైతం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. వీటన్నింటికి అంతర్జాతీయ మార్కెట్ నిబంధనల ప్రకారం డాలర్లలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు రూపాయి విలువ తగ్గిపోతుండటం వల్ల ఎక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ముడిచమురు దిగుమతుల ఖర్చు పెరిగితే దాని ప్రభావంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పెంచక తప్పదు. అది ప్రజలకు భారంగా పరిణమిస్తుంది. విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై అదనపు భారం పడుతుంది. ఉదాహరణకు రూ.50వేల డాలర్ల వార్షిక ఫీజు చెల్లించడానికి రూపాయి మారక విలువ రూ.80 ఉన్నప్పుడు రూ.40 లక్షలు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మారకపు విలువ రూ.90 దాటడంతో దానికి అనుగుణంగా రూ.45 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల అదనపు భారం పడుతున్నదని లెక్క. విదేశాల్లో చదువుకునేందుకు డాలర్లలో రుణాలు తీసుకున్న భారతీయులు వాటిని తిరిగి డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక డాలర్ విలువ రూ.91.74కు పెరడంతో 12 నుంచి 13 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. గతంలోనూ రూపాయి పతనంతో ఏర్పడిన సంక్షోభాల కంటే ఇప్పటిది కాస్త భిన్నం. 2022లో డాలర్ బలపడటంతో ప్రపంచంలో అనేక దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. కానీ ఇప్పుడు డాలర్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పడిపోవడం చేటు చేస్తోంది. అంటే డాలర్ విలువ మారినా, రూపాయి విలువ మారినా.. దాని ప్రభావం మన దేశం మీదే పడుతుందన్నది ఈ అనుభవాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రవాస భారతీయులకు ఇది మేలు చేస్తుందని అంటున్నారు. 2023 లెక్కల ప్రకారం ప్రవాసులు మన దేశంలోకి 500 డాలర్లు పంపితే రూ.40వేలు లభించేది. ఇప్పుడు అదే 500 డాలర్లకు రూ.45వేలు అందుతాయి. అలాగే డాలర్లలో ఆదాయం పొందే సంస్థలకు ఈ పరిణమాలు మేలు చేస్తాయి.










Comments