ఓటమే కొలబద్ద కాదు.. కారాదు!
- DV RAMANA

- May 16, 2025
- 2 min read

సమాజం వైఖరి చాలా చిత్రంగా ఉంటుంది. ఒక వ్యక్తి గానీ.. సంస్థ గానీ విజయాల బాటలో ఉన్నంతకాలం నెత్తిన పెట్టుకుంటుంది. ఆహా.. ఓహో.. ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేస్తుంది. కానీ ఎన్ని విజయాల సాధించినా.. ఒక్కసారి ఓటమి పాలైతే చాలు పొగిడిన నోటితోనే తెగిడేస్తుంది. నెత్తికెత్తుకున్న చేతులతోనే అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఏమాత్రం అవగాహన లేని ఆకతాయిల దగ్గర్నుంచి జీవితాన్ని కాచి వడపోసిన అనుభవజ్ఞుల వరకు అందరిదీ ఇదే వైఖరి. అందుకే అనుకుంటా ప్రముఖ కవి శ్రీశ్రీ ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే’.. అంటూ ముక్తాయించారు. ఇది నిజానికి బానిస విధానం. ఫలితాల ముందు వరకూ ఉన్నది ఆ విజేత, పరాజితలే. గెలుపు ఓటములు శాశ్వతం కాదు. ఒకసారి వారు గెలిస్తే.. ఇంకోసారి వీరు గెలుస్తారు. అందువల్ల ఒక్కసారి ఓడిపోయినంతమాత్రాన.. ఆ వ్యక్తి లేదా పార్టీ పని అయిపోయిందనుకోవడం అవగాహనా రాహిత్యం. కానీ దురదృష్టవశాత్తు ఇటువంటి ధోరణులే పెరిగిపోయాయి. గతంలో కాంగ్రెస్‌పై తెలుగుదేశం, టీడీపీపై కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా ఇలాంటి అర్ధంలేని వ్యాఖ్యలే చేసేవారు. ఉదాహరణకు 1989లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులు, బీజేపీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఆ కూటమిపై గెలిచింది. అది గెలుపు అంతే.. ఎదుటి పార్టీని పాతిపెట్టటమో.. పాతాళానికి తొక్కేయడమో కాదు. ఆ రోజుల్లో తెలుగుదేశం అనుకూల పత్రికలు ఈ తరహా రిపోర్టింగుతో వాతావరణాన్ని పాడుచేశాయి. అదే వైఖరి సీనియర్ ఎన్టీఆర్ సంతానానికి కూడా అలవాటైపోయింది. చవకబారు మాటల రచయితల పుణ్యాన బాలకృష్ణ తన సినిమాల్లో కూడా వాడాడు. ఎవరో ముందుకు తోసేస్తున్నట్టు మాటాడే యాక్సెంటుతో ఆయన చేసే ప్రసంగాలు, వల్లించే డైలాగులు రాజకీయ వాతావరణాన్ని నాశనం చేశాయి. పైన చెప్పిన బానిస వైఖరికి, అవగాహన రాహిత్య రిపోర్టింగుకు అందరికంటే ఎక్కువగా రాహుల్ గాంధీ బలైపోయాడు. తన ముందు తరాల వారసత్వాన్ని ఆస్తిగా కాక అప్పుగా పరిణమించిన దురదృష్ట జాతకుడాయన. జాతీయ నాయకులను, జాతి నిర్మాతలను తిట్టిపోసే కుసంస్కారం కలిగిన సనాతనవాదుల ఇనుప సంకెళ్ల మధ్య చిక్కుకుపోయినవాడు. నాటి సోవియట్ రష్యాలో లెనిన్, స్టాలిన్‌లకూ అలాంటి వ్యతిరేకత తప్పలేదు. కాకుంటే వాళ్ల వారసులెవరూ ప్రస్తుత మూర్ఖ వాదనాపరులకు భౌతికంగా దొరకలేదు. ప్రత్యర్ధులు చేసిన దశాబ్దాల విష ప్రయోగం వల్ల జనం ఆలోచన గతి తప్పి ఉన్మాదంగా మారితే.. ఆ ఉన్మాదానికి బలైపోయిన నష్ట జాతకుడే రాహుల్ గాంధీ. గత ఏడేళ్లుగా మోదీ పాలన బాధితులకు అండగా దేశంలో స్థిరమైన పోరాటమంటూ ఎవరైనా చేస్తున్నారా అంటే అది రాహుల్ ఒక్కడే. మత ఛాందసత్వానికి వ్యతిరేకంగానైనా, మూర్ఖపు నోట్ల రద్దుపైనా, కశ్మీరు సమస్య అయినా, దళితుల ఊచకోత అయినా, సీఏఏ అయినా ఎన్నార్సీ అయినా, అడ్డగోలు రాఫెల్ డీల్ అయినా, అన్యాయపు కూల్చివేతలైనా గళం విప్పింది రాహుల్ ఒక్కడే. జాతీయ కులగుణన జరగాలని దేశాన్ని హోరెత్తించి మరీ సాధించింది అతనే. అలాంటి రాహుల్ ఎలక్షన్ లాభనష్టాల కోణంలో రాజకీయాలు నెరపే గయ్యాళి గంపల దగ్గరా, చింపిరి జుట్టు చిన్నమ్మల దగ్గరా పోరాట పటిమ నేర్చుకోవాలా? సిగ్గులేకుంటే సరి. ఇంకా ఒకటి చెప్పండి, నంగనాచితనం, అవకాశవాదం, దొంగఒడుపూ వాళ్ల దగ్గర రాహుల్ నేర్చుకోవాలంటే సరే ఒప్పుకుంటాను. అంతేగానీ పోరాటం నేర్చుకోవాలా అతను. దేశ స్వాతంత్య్రం కోసం యవ్వనంలో తొమ్మిదేళ్ల జైలు జీవితం గడిపిన వాడి మునిమనవడు, దేశ సమగ్రత కోసం సెక్యూరిటీ గార్డుల చేతిలో బలైపోయినావిడకి మనవడు, భయమంటే ఏమిటో తెలియని నాయకుడి కొడుకు పోరాటపటిమ గురించి నిమిషానికో గ్రూపులో ఉండే సీజనల్ నాయకుల దగ్గర నేర్చుకోవాలా? మార్పు అనేది ఉచ్ఛ స్థితికి ఉపయోగపడాలే తప్ప పెనం మీది నుంచి పొయ్యిలో పడేలా ఉండకూడదు. హుందాతనం, ఔన్నత్యం, నడక, నడత, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతవాసుల మనోభావాల పట్ల మన్నన, స్థిర చిత్తం వంటి లక్షణాలు కలబోసినవాడే నిజమైన జాతీయ నాయకుడు. అటువంటివారినే గుర్తించి గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా గౌరవించాలి.










Comments