top of page

ఓడినా.. విధేయతకే అధినేత అభయం!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Sep 19, 2025
  • 3 min read
  • రెడ్డి శాంతి, పిరియా దంపతులపై తరగని జగన్‌ అభిమానం

  • వారిని మార్చాలన్న ధర్మాన సూచనలను పట్టించుకోని వైనం

  • ఆ నియోజకవర్గాల్లో చొరబడితే చర్యలు తప్పవని నేతలకు హెచ్చరిక

  • తన వైఖరితో కాపులను దూరం చేసుకుంటున్న మాజీమంత్రి

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

ఈ మూడు ఫొటోలు మూడు సందర్భాల్లో ‘క్లిక్‌’మనిపించినవి. మూడిరటి వెనుక మూడు కథలున్నాయి. కలిపి చూస్తే మాత్రం.. ప్రతి కథతోనూ లింకుంది. మరింత లోతుగా పరిశీలిస్తే శ్రీకాకుళం వైకాపా భవిష్యత్తు కనిపిస్తుంది. మూడు రోజుల క్రితం ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్త, శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు పిరియా సాయిరాజ్‌, విజయలు పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. మనం చెప్పుకొంటున్న మొదటి ఫొటో అదే. 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత 15 రోజులకోసారి పార్టీ ప్రధాన నాయకులతో సమావేశమవడానికి జగన్‌ ముందుకొచ్చిన వేళ ఇందులో విశేషమేముందని అనిపించవచ్చు. కానీ ఇది కచ్చితంగా చర్చించుకోవాల్సిన సందర్భం. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రెడ్డిక సామాజికవర్గానికి అవకాశమిస్తే గానీ అక్కడ వైకాపా గెలవలేదని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గత ఎన్నికల ముందు నుంచి పార్టీ అగ్రనేతలకు చెబుతున్నారు. అందులో భాగంగానే 2024 టిక్కెట్ల పంపిణీ సమయానికి కొందరి పేర్లను కూడా సూచించారు. కానీ జగన్మోహన్‌రెడ్డి పిరియా సాయిరాజ్‌కు ఏళ్ల క్రితం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన సతీమణి పిరియా విజయ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నా టిక్కెటిచ్చారు. ఆమెను గెలిపించడానికి వీలుగా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి అడిగినవన్నీ ఇచ్చారు. నర్తు రామారావును ఎమ్మెల్సీ చేస్తే మత్స్యకార ఓట్లు పోలరైజ్‌ అవుతాయని చెబితే నమ్మి అదీ చేశారు. సీడాప్‌ చైర్మన్‌గా సాడి శ్యాంప్రసాద్‌రెడ్డికి అవకాశమిచ్చారు. రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా దుక్క లోకేశ్వర్‌రెడ్డికి చోటిచ్చారు. అయినా గత ఎన్నికల్లో టీడీపీ అక్కడ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. అంటే ఇక్కడ వైకాపా శ్రేణులు ఏకతాటిపై పని చేయలేదని వేరేగా చెప్పనక్కర్లేదు. దీనికి సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు మినహాయింపు కావచ్చు. కేవలం భార్యాభర్తలిద్దరూ ఇంటింటికీ తిరిగి కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. దాంతో ఎన్నికల్లో ఎటువంటి వెన్నుపోటు రాజకీయాలు జరిగాయో జగన్మోహన్‌రెడ్డికి అర్థమైంది. ఈ నేపథ్యంలో తాజాగా నియోజకవర్గానికి చెందిన 15 మందిని పట్టుకొని తనను కలిసిన పిరియా దంపతులకు జగన్మోహన్‌రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారట. జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా నిజాయితీగా పని చేయడంతో పాటు, నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతున్నారని, దీన్ని ఇలాగే కొనసాగించాలని, రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ భరోసా ఇచ్చి పంపినట్లు తెలిసింది. ఈ అభయంతో పిరియా దంపతుల్లో కొత్త జోష్‌ మొదలైంది.

పిరియా దంపతులపై అదే అభిమానం

ఇక రెండో ఫొటోలో జగన్మోహన్‌రెడ్డితో పాటు ఉన్నది పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఈమె గురువారం పార్టీ అధినేతను కలిశారు. క్రమశిక్షణ కమిటీ మెంబర్‌గా ఉన్న రెడ్డి శాంతి చురుగ్గా పని చేస్తున్నారంటూ ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి కితాబిచ్చారట. పాతపట్నంలో ఎవరూ వేలుపెట్టొద్దంటూ తాను గతంలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇంకా ఎవరైనా సమాంతర రాజకీయాలు నడుపుతున్నారా అని రెడ్డి శాంతిని ఆరా తీసినట్లు తెలిసింది. పాతపట్నం శాంతిదేనని, ఇందులో మరో ఆలోచన లేదని, దీన్ని కాదని ఎవరైనా ఆ నియోజకవర్గంలో కాలు, వేలు పెడితే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడానికి కూడా వెనుకాడనంటూ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేయడంతో రెడ్డి శాంతి ఎగిరి గంతేస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు ఇటువంటి సందేశమే సాయిరాజ్‌తో వచ్చిన 15 మంది ముందు జగన్‌ వెల్లడిరచారట. ఇన్‌ఛార్జిని కాదని వేరెవరైనా కలుగజేసుకుంటే సస్పెన్షన్‌ తప్పదని స్పష్టం చేశారు. అయితే పాతపట్నం నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్‌ను పార్టీ ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు తెరపైకి తెచ్చారు. గతంలో ధర్మాన వ్యూహాలు, ఎత్తుగడలు మూడో కంటికి తెలియకుండా గుంభనంగా జరిగేవి. కానీ రెడ్డి శాంతి విషయంలో మాత్రం ఆయన తన అభిప్రాయాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోతున్నారు. ఆమెను మారిస్తే గానీ ఆయన పార్టీ వ్యవహారాల్లో పాల్గొనరన్న ప్రచారం కూడా కొన్నాళ్లు జరిగింది. కట్‌చేస్తే.. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన వైకాపా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశానికి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. పార్టీ ఓటమి తర్వాత మొదటిసారి ఆయన పార్టీ కార్యక్రమానికి హాజరు కావడమే మూడో ఫొటో ముచ్చట. అంతకుముందు పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని జగన్మోహన్‌రెడ్డి ఎంతమంది దూతలను పంపినా ధర్మాన ప్రసాదరావు తిరస్కరిస్తూ వచ్చారు. ఇచ్ఛాపురం, పాతపట్నం విషయంలో తన సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా పార్టీకి సంకేతాలు పంపారు. ఒకానొక సందర్భంలో జగన్మోహన్‌రెడ్డి దీనికి తలొగ్గినట్టే కనిపించింది. కానీ తాజాగా తనను కలిసిన రెడ్డి శాంతి, పిరియా దంపతులకు ఇచ్చిన సందేశం చూస్తే రాజశేఖరరెడ్డి మాదిరిగా ఏ జిల్లాను ఏ ఒక్కరి చేతిలోనో పెట్టడానికి జగన్మోహన్‌రెడ్డి సిద్ధంగా లేరని అర్థమవుతుంది.

రెడ్డి శాంతి మైలేజ్‌ పెంచుతున్న ధర్మాన

2014లో రాజకీయాల్లోకి వచ్చిన రెడ్డి శాంతి మొదట్లో కేరాఫ్‌ అడ్రస్‌ ధర్మాన ఆఫీసే. ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన శాంతి.. ధర్మాన వల్లే ఓడిపోయారని ఆమె భర్త రెడ్డి నాగభూషణం కేడర్‌ మధ్యే ప్రకటించి ధర్మానకు దూరమయ్యారు. రెడ్డి శాంతి మాత్రం జిల్లాలో ధర్మాన అండదండలు ఉండాలన్న భావనతో రాజకీయాలు నెరుపుతూ వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకు పాతపట్నం వెళ్లి, అక్కడ పాగా వేసి గెలవగలిగారు. అయితే ధర్మాన పాత గాయాన్ని ఇంకా మర్చిపోలేదు. 2019 ఎన్నికల్లో కూడా రెడ్డి శాంతిని మార్చి మామిడి శ్రీకాంత్‌కు సీటు ఇప్పించాలని ప్రయత్నించారు. కానీ జగన్మోహన్‌రెడ్డి రెడ్డి శాంతినే నిలబెట్టారు. ఎన్నికల అనంతరం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షలో ధర్మాన కృష్ణదాస్‌ సమక్షంలోనే రెడ్డి శాంతి ధర్మాన ప్రసాదరావుపై జగన్మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లాలో కాపులు కూడా ఎక్కువగా ఉన్నారని వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూనే కింజరాపు, ధర్మాన కుటుంబాలు వేరు కావనే అభిప్రాయం జిల్లాలో ఉందని, దీన్ని బద్దలుగొట్టాల్సిన అవసరం ఉందని ఆమె కుండబద్దలుగొట్టారు. అప్పట్నుంచి ధర్మానకు, రెడ్డి శాంతికి మధ్య గ్యాప్‌ మరింత పెరిగిపోయింది. 2029 నాటికి శ్రీకాంత్‌ను అక్కడకు పంపాలనేది ధర్మాన వ్యూహం. అలాగే ఇచ్ఛాపురంలో తాను చెప్పిన వ్యక్తికి టిక్కెటిస్తే జిల్లా మొత్తం గెలుపు బాధ్యతలు తీసుకుంటానని పరోక్ష సంకేతాలు పంపారు. రెడ్డి శాంతి విషయంలో మాత్రం ధర్మాన ఇటీవల ఓపెన్‌ అయిపోతున్నారు. ఆయన వైఖరే కాపుల్లో రెడ్డి శాంతికి మైలేజ్‌ పెంచుతోంది. భర్త చనిపోవడం, గాడ్‌ఫాదర్‌ కమ్‌ తండ్రి పాలవలస రాజశేఖరం లేకపోవడం వంటి సానుభూతి పవనాల మధ్య ఉన్న రెడ్డి శాంతికి ఇప్పుడు ధర్మాన కూడా వ్యతిరేకంగా ఉండటం వంటి అంశాలు కాపుల్లో ఆమెకు మద్దతు పెంచుతున్నాయి. ఇంతవరకు ధర్మానకు, కాళింగులకు మధ్యే వైరుధ్యం ఉండేది. కానీ రెడ్డి శాంతి విషయంలో ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తున్న తీరుతో కాపులు కూడా ఆయనకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు భోగట్టా. పాలవలస రాజశేఖరం, ధర్మాన ప్రసాదరావులు రాజకీయంగా సహకరించుకుంటూ వచ్చారు. కానీ రెడ్డి శాంతి దగ్గరకొచ్చేసరికి విభేదిస్తుండటం వల్ల కాపులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page