కంకర మాఫియా.. అంతా ‘కూటమి’ మాయ!
- BAGADI NARAYANARAO

- Jan 8
- 3 min read
పలాసలో అడ్డూఅదుపూలేని తవ్వకాలు, అమ్మకాలు
ఒక్క క్వారీకి కూడా అనుమతుల్లేవంటున్న అధికారులు
కానీ అక్రమాలను అడ్డుకోవడంలో విఫలం
అక్రమార్కులందరూ టీడీపీ నేతలు కావడమే కారణం
ఈ విషయం తెలిసినా ఎమ్మెల్యే సమీక్ష పేరుతో హడావుడి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అధికారుల లెక్క ప్రకారం పలాస నియోజకవర్గంలో కంకర(గ్రావెల్) తవ్వకాలకు అనుమతుల్లేవు. కొన్ని క్వారీలు ఉన్నా వాటిని కాలదోషం పట్టింది. కానీ ఆ నియోజకవర్గంలో కంకర తవ్వకాలు, అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంటే ఇవన్నీ అక్రమ వ్యవహారాలేనన్నది సుస్పష్టం. కానీ విడ్డూరమేమిటంటే.. ప్రభుత్వ నిర్మాణాలకు కూడా అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీల నుంచే కంకర తెప్పిస్తున్నారు. ఒకవైపు క్వారీలకు అనుమతుల్లేవంటున్న అధికారులు.. మరోవైపు అక్రమ వ్యవహారాలపై చర్యలు మాత్రం తీసుకోకుండా పరోక్ష ప్రోత్సాహం అందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గ పరిధిలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతి పొందిన క్వారీలు లేవని మైనింగ్ ఏడీ విజయలక్ష్మి వెల్లడిరచారు. బుధవారం ఎమ్మెల్యే శిరీష నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమీక్షలో ఆమె మాట్లాడుతూ పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 21 క్వారీ లీజులు ఉన్నప్పటికీి పర్యావరణ అనుమతులు లేకపోవడం, లీజు బకాయిలు చెల్లించనందున వాటికి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. ఈ లెక్కన నియోజకవర్గంలో కంకర లావాదేవీలు జరగకూడదు. కానీ పలాస`కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు నియోజకవర్గంలో వెలసిన అధికార, అనధికార లేఅవుట్లకు, ప్రభుత్వం చేపట్టిన రోడ్ల నిర్మాణాలకు, బొడ్డపాడు వద్ద 150 ఎకరాల్లో వేస్తున్న సుడా లేఅవుట్‌కు గత రెండేళ్లు ఎలా కంకర తీసుకొస్తున్నారో అధికారులే చెప్పాలి. నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలపై ఆలస్యంగానైనా ఎమ్మెల్యే శిరీష స్పందించి రెవెన్యూ, మైన్స్, పోలీసు, మున్సిపాలిటీ, మండల పరిషత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ తవ్వకందారులు ఎంతటివారైనా ఉపేక్షంచబోమని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెందిన సహజవనరులను దోపిడీ చేస్తున్నారంటూ గ్రావెల్ మాఫియాపై విరుచుకుపడటం విశేషం.
పైనుంచి ఒత్తిడే కారణం
ఘాటు హెచ్చరికలు చేసినంత మాత్రాన అక్రమాల గురించి ఆమె ఇప్పుడే తెలుసుకున్నారనుకోవడానికి లేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని అమాయకురాలు కాదు ఎమ్మెల్యే శిరీష. గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న వారంతా టీడీపీకి చెందినవారే కావడం వల్లే ఇన్నాళ్లు స్పందించలేదు. ఇప్పుడు స్పందించడానికి కూడా పార్టీ పెద్దల నుంచి వచ్చిన హెచ్చరికలే కారణమన్న చర్చ జరుగుతోంది. వైకాపా హయాంలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రతిపక్ష నాయకురాలిగా శిరీష విమర్శలు చేయడం, పార్టీ శ్రేణులతో కలిసి అక్రమ తవ్వకాలు, కబ్జాలు జరిగిన ప్రాంతాలకు మీడియాను తీసుకువెళ్లి పరిశీలించడం వంటివి చేసేవారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె దృష్టికోణం మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులకు గ్రావెల్ తవ్వకాలను ఒక ఆదాయ వనరుగా చూస్తూ శీతకన్ను వేశారు. అయితే అక్రమాలు శృతిమించడం, అన్నివైపుల నుంచి విమర్శలు పెరగడంతో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. వైకాపా హయాంలో టీడీపీ కంటే ఎక్కువగా స్పందించి అక్రమాలను వెలుగులో తెచ్చిన జనసేన నాయకులు సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు కావడం, పైనుంచి వచ్చిన ఆదేశాలతో కొంత వెనక్కి తగ్గినా అప్పుడప్పుడూ కొందరు జనసైనికులు మాత్రం కంకర అక్రమాలపై స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, చెరువుల ఆక్రమణలపై జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కొందరు జనసైనికులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంతకు ముందు సీఎంవోకు ఫిర్యాదు చేశారని సమాచారం. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీయడంతో గత్యంతరం లేక స్థానిక ఎమ్మెల్యే శిరీష స్పందించి సమీక్ష నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే అక్రమార్కులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తొక్కిపడేస్తామని బెదిరించారని ఒకరిద్దరు అధికారులు ప్రస్తావించినా, దానికి ఆమె స్పందించలేదని తెలిసింది. మరోవైపు సమావేశం నిర్వహించిన తర్వాత కూడా మందస మండలం మకరజోల పంచాయతీ అల్లిమెరక మెట్టలో టీడీపీ నాయకులు గ్రావెల్ తవ్వకాలు కొనసాగించడం విశేషం.
అందరూ ఒక్కటై దందా
సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గ్రావెల్ తవ్వకాలు జరుపున్నట్టు కథనాలు రాయడం కాదు.. ఎవరు తవ్వుతున్నారో కూడా వాటిలో పేర్కొనాల్సిందన్నారు. వాస్తవానికి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒకరిద్దరు టీడీపీ నాయకులు గ్రావెల్ తవ్వకాల్లో మునిగితేలుతున్నారని ఆరోపణలున్నాయి. అక్రమ తవ్వాకాలు, తరలింపులకు కూటమి పార్టీలకు చెందిన నాయకుల జేసీబీలు, ట్రాక్టర్లనే వినియోగించాలన్న నిబంధన కూడా అమలు చేస్తున్నారు. వీరంతా సిండికేట్ (కూటమి)గా ఏర్పడి 21 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరెక్కడ తవ్వాలి, ఎక్కడికి తలించాలన్నది ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కానీ ఎమ్మెల్యే మాత్రం తవ్వకాలు జరుపుతున్న వారి పేర్లు చెప్పండి అంటూ మీడియాను కోరడం విస్మయం కలిగిస్తోంది. అక్రమ తవ్వకాలపై వైకాపా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ట్రోలింగ్స్ పెరిగాయి. కొందరు స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు స్పందించడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి ఘాటు హెచ్చరికలు చేసినందున.. ఏమేరకు తవ్వకాలను నియంత్రిస్తారో చూడాలి. కాగా జగన్నాధ సాగరంలో 31 సెంట్లు మాత్రమే ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు నిర్థారించినట్టు ఇదే సమావేశంలో ఎమ్మెల్యే ప్రస్తావించారు. చెరువులో 30 శాతం మేర ఆక్రమణలకు గురైతే, 31 సెంట్లు మాత్రమే ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు నివేదిక ఇవ్వడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ పలాస`కాశీబుగ్గ పరిధిలో ఉన్న మిగతా చెరువుల ఆక్రమణలపై చర్చించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల క్రితం పలాసలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసిన టీడీపీ నేతలు వైకాపా హయాంలో జరిగిన ఆక్రమణలపై ఐదు పేజీల ఫిర్యాదు ఇచ్చి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్థానికులు కోరుతున్నారు.










Comments