top of page

‘కంకర’ రక్కసి!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 23, 2025
  • 2 min read
  • అర్థరాత్రులు జేసీబీలతో తవ్వకాలు

  • ప్రాంతాలవారీగా పంచుకున్న కొండలు

  • జిరాయితీల్లోనూ బరితెగింపు

  • మొన్న, నిన్న పార్టీలు మారినా.. పలాసలో మారని పరిస్థితి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

  • పలాస నియోజకవర్గం పరిధిలో ఉజ్జిడిమెట్ట, రాజగోపాలపురం కొండ, లొద్దిభద్ర, రట్టికొండ, బెండికొండ, తాడివాడ కొండ, కేదారిపురం, పిడి మందస కొండల్లో పుష్కలంగా కంకర లభిస్తుంది. బెండి కొండపైన హుద్‌హుద్‌, జగనన్న కాలనీల సమీపంలో రేయింబవళ్లు తవ్వకాలు జరుపుతున్నారు.

  • పిడి మందసలో కొండను అర్ధరాత్రి జేసీబీలతో తవ్వి పదుల సంఖ్యలో టిప్పర్లలో తరలించుకుపోతున్నారు. దానిపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

  • ఉజ్జిడిమెట్ట మినహా మిగతా అన్ని కొండలు ప్రభుత్వానికి చెందినవే. ఈ కొండల్లో కంకర తవ్వకాలు జరుపుతున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూటమి పార్టీల నాయకులు కనుసన్నల్లోనే కంకర అక్రమంగా తవ్వకాలు చేపట్టి విక్రయిస్తున్నట్టు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోవడానికి సాహసించడంలేదు.

  • సూదికొండ వద్ద కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి సేకరించిన భూమిలో తవ్వకాలు జరిపిన కంకరకు ఇప్పటికీ లెక్క తేలలేదు. కంకర తవ్వకాలు అధికారికంగా జరిపినట్టు ప్రభుత్వ యంత్రాంగం చెప్పినా, ఆ ఆదాయం ఎవరి ఖాతాలో జమైందో అధికారులే చెప్పాలి.


ప్రభుత్వం మారినా అక్కడ సహజ వనరుల దోపిడీ మాత్రం ఆగలేదు. పలాస పరిధిలో వందల ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల్లో కంకర కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిలో పుష్కలంగా కంకర లభిస్తుండడంతో రాత్రివేళల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి డంపర్లు, ట్రాక్టర్లతో తోడేస్తున్నారు. రాత్రి డంపింగ్‌ చేసిన కంకరను పగలు ట్రాక్టర్లలో లోడ్‌చేసి విక్రయిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. పలాస పరిధిలో ప్రభుత్వం అనుమతి పొందిన గ్రావెల్‌ మైనింగ్‌ లేకపోయినా కంకర యధేచ్ఛగా తరలిపోతుంది. కూటమి పార్టీల నాయకుల పేరు చెప్పి రాత్రివేళల్లో కంకర తవ్వేస్తుండడంతో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అడ్డుకోలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రామకృష్ణాపురంలోని ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన భూమిలో (ఉజ్జిడిమెట్ట)లో యజమానుల కళ్లుగప్పి కంకరను తరలించుకుపోతున్నారు. దీనిపై సదరు లేఅవుట్‌ యజమానులు అక్రమంగా కంకర తవ్వకాలు జరుపుతున్నవారిని హెచ్చరించినా ఫలితం లేదని వాపోతున్నారు. అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పరిశీలించి రూ.కోట్ల విలువైన కంకరను తరలించుకుపోయారని లెక్క కట్టినట్టు తెలిసింది. నియోజకవర్గంలో ఎక్కడ లే`అవుట్‌ వేసినా, ఇల్లు కట్టినా కూటమి నాయకులు చెప్పిన పార్టీ శ్రేణుల ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా మాత్రమే కంకర తరలించాలి. అలా తరలించడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఉద్దానం పరిధిలో ఢల్లీి, పలాస పట్టణం పరిధిలో జగదీష్‌, బుజ్జి, సాయి, యుగంధర్‌, పలాస రూరల్‌ పరిధిలో కుమార్‌కు, వజ్రపుకొత్తూరు మండలంలో వసంత, చిట్టి, దుర్యోధనకు కంకర తవ్వకాలు, తరలించడానికి అవకాశం ఇచ్చారని నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది. వీరంతా కూటమి నాయకుల సమక్షంలోనే సిండికేట్‌గా వ్యవహరిస్తూ కంకర తవ్వకాలు జరుపుతున్నారని నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది.

ఇదిలా ఉండగా, తవ్వకాలు జరుపుతున్న చోట కూటమి నాయకుల అనుయాయులు మరికొందరు వాహనానికి రూ.100 వసూలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది.

వైకాపా హయాంలోనూ ఇదే పద్ధతిలో కంకర తవ్వకాలు జరిపినా అప్పటి ప్రతిపక్షం ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ప్రస్తుతం కూటమి నాయకులు చేస్తున్న అక్రమ కంకర దందాను వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న భావన స్థానికంగా వ్యక్తమవుతుంది. వైకాపా హయాంలో అక్రమంగా కంకర తవ్వకాలు జరిపితే ఎటువంటి చర్యలు తీసుకున్నారని కూటమి నాయకులు అధికారులపై ఎదురు తిరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులను కంకర మాఫియా తన గుప్పిట్లో పెట్టుకొని దందా చేస్తున్నట్టు చర్చ సాగుతుంది. అడ్డుకుంటే కూటమి నాయకులు ఫోన్‌ చేసి విడిచిపెట్టేయాలని చెబుతున్నారని భోగట్టా.

జిల్లాలో నదులున్నచోట ఇసుకను తవ్వుకుపోతున్నట్టే నదిలేని పలాసలో కంకరను అదే స్థాయిలో కొల్లగొడుతున్నారు. ఈ కంకర దగ్గర తేడాలొచ్చే వంకరటింకర రాజకీయాలు పలాసలో పెరిగిపోయాయి. ఇక్కడ ప్రభుత్వ, మఠం భూములు ఆక్రమించుకోవడం శాశ్వత ఉపాధి అయితే, కంకర రెగ్యులర్‌ టర్నోవర్‌ వ్యాపారం. అందుకే ఎవరు చెప్పినా ఇక్కడ వినే పరిస్థితి లేదు. ప్రతిపక్షానికి ప్రశ్నించే అర్హతా లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page