top of page

కింగ్డమ్‌.. ఓ మోస్తరు కిక్కు

  • Guest Writer
  • Aug 1
  • 4 min read
ree

కెరీర్‌ ఆరంభంలో తక్కువ టైంలో పెద్ద పెద్ద హిట్లు కొట్టి.. ఆ తర్వాత గాడి తప్పిన హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడతను ‘జెర్సీ’ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరితో చేసిన కింగ్డమ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అంచనాలను అందకుండా? విజయ్‌ సక్సెస్‌ అందుకున్నాడా? తెలుసుకుందాం పదండి.

కథ:

1991 ప్రాంతంలో సూరి (విజయ్‌ దేవరకొండ) హైదరాబాద్‌ లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. చిన్నతనంలోనే తండ్రిని చంపి పారిపోయిన తన అన్న శివ (సత్యదేవ్‌) కోసం అతను ఎదురు చూస్తుంటాడు. అలాంటి సమయంలో శివ శ్రీలంకలోని జాఫ్నాలో ఒక స్మగ్లింగ్‌ గ్యాంగ్‌కి లీడర్‌గా ఉన్నట్లు సూరికి తెలుస్తుంది. ఒక పోలీస్‌ అధికారి శివ గురించి ఈ విషయం చెప్పి అతడిని తిరిగి తీసుకురావడం కోసం జాఫ్నాకు సూరిని గూఢచారిగా పంపిస్తాడు. మరి జాఫ్నాకు వెళ్లిన సూరి..శివను కనుక్కున్నాడా? తన అన్నను తిరిగి తెచ్చుకున్నాడా? అక్కడ అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అతనెలా ఛేదించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం- విశ్లేషణ:

విజయ్‌ దేవరకొండ చివరగా ఎప్పుడు నిఖార్సయిన హిట్టు కొట్టాడో తన అభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. అయినా తన కొత్త చిత్రం ‘కింగ్డమ్‌’పై ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపించిందంటే అందుకు ప్రధాన కారణం.. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. మళ్ళీ రావా.. జెర్సీ చిత్రాలతో తన స్థాయి వేరని చాటుకున్న ఈ యువ దర్శకుడు ‘కింగ్డమ్‌’ప్రోమోలతో ప్రేక్షకులను ఆశల పల్లకిలో ఊరేగించాడు. గౌతమ్‌ అంటే భిన్నంగా ఏదో చేస్తాడని.. కొత్త అనుభూతి పంచుతాడనే భరోసాతో ‘కింగ్డమ్‌’థియేటర్లలో అడుగు పెట్టారు. కానీ వారిని ఊరించి ఊరించి ఒకింత నిరాశకే గురి చేస్తాడు గౌతమ్‌. ఓవైపు తన మార్కు చూపిస్తూనే.. ఇంకోవైపు పాపులర్‌ ‘ట్రెండు’ప్రభావంలో పడిపోయాడా అనిపిస్తుంది ‘కింగ్డమ్‌’చూస్తున్నంతసేపు. ఈ ఊగిసలాటలో ఈ చిత్రం ప్రేక్షకులకు మిశ్రమానుభూతినే మిగులుస్తుంది. ఏదో గొప్పగా చూడబోతున్నామనే ఆశలు రేకెత్తించి.. చివరికి ఇంతేనా అనుకునేలా ఒకింత నిరాశకు గురి చేస్తోంది. ‘కింగ్డమ్‌’బాలేదని అనలేం.. అదే సమయంలో బాగుందని ధీమాగానూ చెప్పలేని పరిస్థితి.

నాగరిక సమాజానికి దూరంగా ఓ ప్రపంచం.. అందులో బానిస బతుకులు బతికే జనం.. దినదిన గండంగా గడుపుతున్న తమను కాపాడ్డానికి ఒకడొస్తాడని ఆ జనం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటే.. అక్కడికి అనామకుడిలా వచ్చి వారి రక్షకుడిగా మారే కథానాయకుడు.. ఇది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న మాస్‌ హీరో కథల ఫార్ములా. నేపథ్యం విషయంలో బాగానే కసరత్తు చేసినప్పటికీ.. టేకింగ్‌ పరంగా తన ముద్రను చూపించినప్పటికీ.. కథను నడిపించడంలో గౌతమ్‌ తిన్ననూరి సైతం చివరికి ఈ సగటు ఫార్ములాలోనే పడిపోయాడు. ‘యుగానికి ఒక్కడు’.. ‘ఛత్రపతి’.. ‘కేజీఎఫ్‌’లాంటి సినిమాలను మిక్సీలో కలిపి కొట్టినట్లుగా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ఐతే ఈ కథలను ఎన్నిసార్లు తీసినా జనం చూస్తారు.. ఈలలు వేస్తారు.. ఉద్వేగంతో ఊగిపోతారు.. అది ఎప్పుడంటే బలమైన ఎమోషన్‌ కుదిరినపుడు. గౌతమ్‌ ఇలా ప్రేక్షకులను ఊపేయడానికి అన్నదమ్ముల ఎమోషన్‌ ను మార్గంగా ఎంచుకున్నాడు. ప్రాణంగా ప్రేమించే అన్న అనుకోకుండా తనను వదిలి వెళ్లిపోతే.. తన కోసం ఎన్నో ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వెళ్లే తమ్ముడి ఎమోషన్‌ మీద ఒక దశ వరకు దర్శకుడు ఆసక్తికరంగానే కథను నడిపించాడు.

ఐతే ఈ అన్నదమ్ములిద్దరూ తిరిగి కలిసే వరకు బలంగా అనిపించే ఎమోషన్‌.. ఆ తర్వాత మాత్రం పలుచబడిపోయింది. అక్కడ్నుంచి సినిమాను ముందుకు నడిపించడానికి ఈ ఎమోషన్‌ పెద్దగా ఉపయోగపడలేదు. హీరోను యోధుడిని చేయడానికి బలవంతంగా చేసిన ప్రయత్నం కృత్రిమంగా అనిపించడం వల్ల.. పతాక ఘట్టాలను ఎంత భారీగా.. అదిరిపోయే ఎలివేషన్‌ తో తీసినప్పటికీ రావాల్సిన హై రాలేదు. ఐతే ఓవరాల్‌ గా అసంతృప్తిని మిగిల్చినా.. ‘కింగ్డమ్‌’ఎక్కడా బోరింగ్‌ గా మాత్రం అనిపించదు. సినిమాలో హైలైట్‌ అని చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రథమార్ధం సినిమాకు పెద్ద ప్లస్‌. ఈ కథను.. హీరో పాత్రను మొదలుపెట్టిన తీరు ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది. కనిపించకుండా పోయిన తన అన్న కోసం హీరో స్పైగా మారే వైనం.. శ్రీలంకకు వెళ్లి తన అన్నను కలవడానికి చేసే ప్రయత్నం.. ఈ ఎపిసోడ్లన్నీ పకడ్బందీగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్‌. జాఫ్నాలో స్మగ్లింగ్‌ గ్యాంగ్స్‌.. అక్కడుండే తెలుగు తెగ.. ఆర్మీకి వీరికి మధ్య ఘర్షణ.. ఈ సెటప్‌ అంతా భారీగా.. క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది. హీరో అక్కడికి వెళ్లి తన అన్నతో కలిసి తన గ్యాంగులో ఒకడిగా మారడం.. తర్వాత నాయకుడిగా ఎదగడం.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్లు ఇవన్నీ మంచి టెంపోతో సాగుతాయి. విరామ సమయానికి ‘కింగ్డమ్‌’మంచి హై ఇస్తుంది.

కానీ ద్వితీయార్ధం గురించి ఎంతో ఊహించుకుంటే.. అది మాత్రం నిరాశకు గురి చేస్తుంది. హీరో ఒక లక్ష్యంతో ఒక చోటికి వెళ్లినపుడు ఆ లక్ష్యమైనా నెరవేరాలి. లేదా అంతకుమించిన ఒక పెద్ద ప్రయోజనమైనా చేకూరాలి. ఐతే ‘కింగ్డమ్‌’లో ఈ రెండూ జరక్కపోవడమే విడ్డూరంగా అనిపిస్తుంది. హీరో శ్రీలంకకు వెళ్లిన పని పూర్తి కాదు. పోనీ అంతకుమించిన పెద్ద కార్యం ఏదైనా పూర్తి చేస్తాడా అంటే అదీ లేదు. అక్కడి పరిస్థితులను ఇంకా కాంప్లికేట్‌ చేస్తాడు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక తమ కోసం ఒక రక్షకుడు వచ్చాడంటూ అతణ్ని అక్కడి జనం అతణ్ని కీర్తిస్తారు. దీంతో హీరో ఏ పర్పస్‌ తో అక్కడికి వెళ్లాడు.. ఏం సాధించాడు అని చూస్తే చివరికి పెద్దగా ఏమీ కనిపించదు. ప్రిక్లైమాక్సులో ఊచకోత ఎపిసోడ్లో మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. తమ వ్యాపారానికి మూలమైన వాళ్లనే విలన్‌ నామరూపాల్లేకుండా చేయాలనుకోవడంలో లాజిక్‌ ఏంటో అర్థం కాదు. క్లైమాక్సులో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ బాగున్నా.. అది అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం సెకండ్‌ పార్టులో చూసుకోమన్నట్లుగా లీడ్‌ ఇచ్చి సినిమాను ఒక అసంతృప్తితోనే ముగించారు. ఓవరాల్‌ గా చెప్పాలంటే ‘కింగ్డమ్‌’లో గొప్పగా ఏదో చేయడానికి ఒక ప్రయత్నం జరిగినా.. అది సంతృప్తికరంగా మాత్రం ముగియలేదు. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని ఈ సినిమాపై ఎక్కువ అంచనాలను పెట్టుకోకపోవడం మంచిది.

నటీనటులు - పెర్ఫార్మెన్స్‌:

పెర్ఫామెన్స్‌ పరంగా విజయ్‌ దేవరకొండకు ‘కింగ్డమ్‌’కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటవుతుంది. సూరి పాత్ర కోసం అతను ప్రాణం పెట్టేశాడు. ఆరంభం నుంచి చివరి వరకు ఒక ఇంటెన్సిటీతో సాగే పాత్రలో విజయ్‌ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. లుక్‌ పరంగానే కాక బాడీ లాంగ్వేజ్‌ లోనూ విజయ్‌ వైవిధ్యం చూపించాడు. అన్న కోసం తపించే తమ్ముడి పాత్రలో అతను భావోద్వేగాలను చక్కగా పలికించాడు. విజయ్‌ అన్నగా సత్యదేవ్‌ కూడా చాలా బాగా నటించాడు. అతనెంత మంచి పెర్ఫామర్‌ అన్నది మరోసారి ఈ సినిమాలో రుజువైంది. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే పాత్ర పరిధి మరీ తగ్గించేశారు. తన మీద సన్నివేశాలను, పాటను ఎడిటింగ్‌ లో తీసేసినట్లున్నారు. అందుకే ఆ క్యారెక్టర్‌ ఇంపాక్ట్‌ పెద్దగా కనిపించదు. కనిపించిన తక్కువ సన్నివేశాల్లో భాగ్యశ్రీ బాగానే అనిపించినా.. తనకి ఈ కథలో పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. విలన్‌ పాత్రలో వెంకిటేష్‌ ఆకట్టుకున్నాడు. కేవలం కళ్లతో విలనీని పండిరచాడు. కానీ తన పాత్ర నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. మరో మలయాళ నటుడు బాబు రాజ్‌.. అయ్యప్ప పి.శర్మ.. రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి.. వీళ్లంతా సహాయ పాత్రల్లో ఆకట్టుకున్నారు. హీరోని స్పైగా మార్చే పాత్రలో చేసిన బాలీవుడ్‌ నటుడు కూడా ఓకే.

సాంకేతిక వర్గం - పనితీరు :

‘కింగ్డమ్‌’కు సాంకేతికంగా అతి పెద్ద ఆకర్షణ అనిరుధే. తన నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్‌ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి సన్నివేశాన్నీ దాని స్థాయికి మించి పైకి లేపడానికి అనిరుధ్‌ ప్రయత్నించాడు. తన పాటలు కూడా సినిమాలో బాగానే కుదిరాయి. కానీ ‘కింగ్డమ్‌’లో చార్ట్‌ బస్టర్‌ అనిపించే సాంగ్‌ అయితే ఏదీ లేకపోవడం మైనస్సే. జోమోన్‌ జాన్‌-గిరీష్‌ గంగాధరన్‌ కలిసి అందించిన ఛాయాగ్రహణం సినిమాలో మరో ఆకర్షణ. విజువల్స్‌ టాప్‌ నాచ్‌ అనిపిస్తాయి. ప్రతి సన్నివేశాన్నీ అందంగా తీర్చిదిద్దారు. సినిమాను చాలా రిచ్‌ గా తీశారు. పెద్ద హీరోల సినిమాల స్థాయిలో సితార సంస్థ ఖర్చు పెట్టింది. ఇక రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి ప్రయత్నాన్ని తక్కువ చేయలేం కానీ.. తన మీద పెట్టుకున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. కథ విషయంలో అతను చేసిన కసరత్తు తెరపై కనిపిస్తుంది. టేకింగ్‌ పరంగా అతను తన ముద్రను చూపించాడు. ఒక దశ వరకు కథాకథనాలను బాగానే నడిపించాడు. కానీ తర్వాత మాత్రం ‘కేజీఎఫ్‌’తరహా సినిమాల ప్రభావానికి లోనై గాడి తప్పాడనిపిస్తుంది. డ్రామాను అనుకున్నంతగా రక్తికట్టించలేకపోయాడు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page