top of page

కాంగ్రెస్‌కు షర్మిలే సమస్య అవుతున్నారా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 26, 2025
  • 2 min read

అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ను ఉద్దీపింపజేస్తారన్న ఆశలు రేపిన వైఎస్‌ షర్మిలే.. ఇప్పుడే ఆ పార్టీని కొత్త కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. పార్టీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. అందరినీ కలుపుకొని పోకుండా షర్మిల సొంత అజెండా అమలు చేస్తుండటంతో పార్టీలో సీనియర్లు ఆమె పట్ల గుర్రుగా ఉన్నారు. కొందరు దాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ఫలితంగా ఆమె ఎక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్దగా స్పందన ఉండటం లేదు. సీనియర్‌ నాయకులూ ఆమె వెంట నడవడంలేదు. ఇదే అంశాన్ని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ రాష్ట్ర నేతలతో నిర్వహించిన ఫోన్‌ కాల్‌ భేటీలో ప్రస్తావిస్తూ అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చెప్పారట! పార్టీ నేతలెవరూ తనకు సహకరించడంలేదని ఈ సందర్భంగా షర్మిల ఫిర్యాదు చేయగా.. కొందరు సీనియర్‌ నేతలు తమె చేసిన ఫిర్యాదులను మాణిక్కం ఠాగూర్‌ ఆమె ముందు పెట్టారు. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవడంలేదని కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నట్లు పలువురు పేర్కొన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. వ్యక్తిగత అజెండాలతో పార్టీ ఎదుగుదల ఉండదని కూడా తేల్చి చెప్పిన ఆయన మార్పు రాకపోతే పార్టీ ఎప్పటికీ ఇలానే ఉంటుందని హెచ్చరించినట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్‌ షర్మిల షుప్తాచేతనావస్థలో ఉన్న పార్టీలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పార్టీకి కాస్తా ఊపు వచ్చిన మాట నిజం. సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీ ఓట్ల శాతం పెరిగి పార్టీ క్యాడర్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఇలాగే కష్టపడితే మరో పదేళ్లకైనా పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు భావించారు. కానీ ఈలోపే సీను మారిపోయి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. షర్మిల తీరును ఎండగడుతూ కొందరు బయటకెళ్లిపోవడం, మరికొందరు నేతలు రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా షర్మిలపై కొందరు కాంగ్రెస్‌ నేతలు తిరుగుబాటు చేశారు. విశాఖలోని ఓ హోటల్‌లో వివిధ జిల్లాల సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సమావేశమయ్యారు. వీరంతా షర్మిలను వ్యతిరేకిస్తున్నవారే కావడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఈ సమావేశానికి చొరవ తీసుకున్నట్లు చెబుతున్నారు. షర్మిల స్వార్ధపూరిత, అహంకార ధోరణి రాజకీయాలతో విసిగిపోయామని వారు ప్రకటించారు. కష్టకాలంలోనూ పార్టీ జెండా వదలని నికార్సయిన కాంగ్రెస్‌ వాదులు షర్మిలను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఆ సమావేశం ద్వారా హైకమాండ్‌ను డిమాండ్‌ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని వైకాపా నుంచి తిరిగి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరిన కృపారాణికి షర్మిల నుంచి తిరస్కారాలు ఎదురవుడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఇక షర్మిలకు సొంత జిల్లా కడపకు చెందిన నేతే షాకిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాను వీడి కడప నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన అప్జల్‌ ఖాన్‌ ప్రస్తుతం కడప నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. షర్మిల తీరుతోనే విసిగిపోయి ఇటీవల పార్టీని వీడారని ప్రచారం ఉంది. అంతకుముందు ఏపీసీసీ మాజీ చీఫ్‌ శైలజనాథ్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆయన కూడా షర్మిల తీరును తట్టుకోలేక పార్టీని వీడారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్‌ 2004లో వైఎస్‌ఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్‌ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తర్వాతే తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిల ఏపీకి తీసుకొచ్చి మరీ రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు కట్టబెట్టారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న శైలజానాథ్‌ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి వైకాపాలో జాయిన్‌ అయ్యారు. రాష్ట్రం కోలుకుంటున్న సమయంలోనే సొంత పార్టీ లీడర్లు వరుసగా గుడ్‌బై చెప్పడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇప్పుడు పలువురు సీనియర్‌ నేతలు సమావేశాలు నిర్వహించి అసంతృప్తి వ్యక్తం చేయడానికి షర్మిల తీరే కారణమని చెప్పాలి. ఆమె ఒంటెద్దు పోకడల కారణంగానే ఉన్న కొద్దిమంది సీనియర్‌ నేతలు కూడా పార్టీకి దూరం అవుతున్నారని కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని అధిష్టానం గుర్తించి తక్షణమే చక్కదిద్దకపోతే కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page