top of page

కాంగ్రెస్‌: దేశంలో అలా.. రాష్ట్రంలో ఇలా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 5, 2025
  • 2 min read

సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది దాటింది. ఆ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పోయి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఈ రెండో తేదీ నుంచి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తొలి వార్షికోత్సవ సంబరాలు కూడా చేసుకుంటోంది. మరోవైపు ఏడాదిగా తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన ప్రధాన ప్రతిపక్షం వైకాపా ప్రభుత్వం నుంచి తీవ్ర నిర్బంధం ఎదురవు తున్నా మళ్లీ ప్రజల్లోకి వచ్చి పూర్వవైభవం సాధించడానికి మెల్లగా పావులు కదుపుతోంది. ఈ పరిస్థి తుల్లో రాష్ట్రంలో భిన్నమైన రాజకీయలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీపైనే ప్రతి పక్షాలు కలిసికట్టుగానో.. విడివిడిగానో పోరాటం చేయడం సహజం. రాజకీయాల్లో ఇదొక సంప్రదా యంగా కొనసాగుతూ వస్తోంది. కానీ చిత్రంగా మన రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్‌ జగన్‌ పార్టీ అధికార కూటమితో పాటు ప్రధాన పార్టీలకు టార్గెట్‌ అవుతోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రం లోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతోంది. కానీ ఏపీకి వచ్చేసరికి చంద్రబాబు సర్కారును కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపాను ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఏఐసీసీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌లు ఇప్పటికీ జగన్‌ లక్ష్యంగానే విమర్శలు సంధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం మొక్కుబడిగా అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న జగన్‌కు టార్గెట్‌ చేయడం ఓకే గానీ.. ఏడాది తర్వాత కూడా అదే పంథా కొనసాగించడం సరైన వ్యూహం కాదని సీని యర్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న మూడు పార్టీల కూటమి 2029 ఎన్నికల దిశగా ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటు జగన్‌ కూడా కూటమిపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. కానీ ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాపత్యం సాగించి, విభజన తర్వాత చతికిలపడిన కాంగ్రెస్‌ మాత్రం మళ్లీ అధికార వైభవం సాధించేందుకు కాకుండా జగన్‌ను అడ్డుకోవ డమే లక్ష్యంగా పనిచేస్తుండటం ఆ పార్టీ శ్రేణులకే మింగుడుపడటంలేదు. ఇది పరోక్షంగా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కారుకే మేలు చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ వైఖరి చూస్తుంటే గతంలో తనను ధిక్కరించి వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌పై పార్టీ అధినాయక త్వానికి ఇంకా కోపం పోయినట్లు లేదు. దానికితోడు కుటుంబ తగాదాల నేపథ్యంలో షర్మిల తన సొంత అన్న జగన్‌పై రాజకీయంగా కక్ష సాధించేందుకు పూనుకోవడం కూడా కలిసి వచ్చింది. దాంతో 2024 ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఎన్డీయే కూటమి వర్సెస్‌ వైకాపా అన్నట్లు జరిగిన ఆ ఎన్నికల్లో తెలంగాణలో తన పార్టీని చాపచుట్టేసి ఎకాఎకిన కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా రంగప్రవేశం చేసిన షర్మిల సొంత అన్న నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వంపై కత్తి దూశారు. కుటుంబ వైరం నేపథ్యంలో షర్మిల, సునీత కలసి జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ ప్రభుత్వానికి దించేయడానికి ఒక చేయి వేశారు. అయితే ఇప్పుడు కూడా రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని కాకుండా జగన్‌పైనే షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఆమె తీరు మింగుడుపడని పలువురు కాంగ్రెస్‌ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారు. పీసీసీ చీఫ్‌ హోదాలో పార్టీ రాజకీయాలకు ప్రయారిటీ ఇవ్వకుండా వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నారని పార్టీ అధిష్టానా నికి రాసిన లేఖలో ఆరోపించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం కూడా గతాన్ని మర్చిపోలేక జగన్‌పై పోరాటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాతీయ రాజకీయ ప్రాధాన్యతలను కూడా ఏపీ వరకు పక్కన పెట్టేస్తోంది. వైకాపాలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్‌ నేతలను తిరిగి రప్పించి, పార్టీని బలోపేతం చేసే విషయంలో షర్మిల విఫలమైనా జగన్‌తో ఆమెకున్న వ్యక్తిగత వైరం కలిసి వస్తుందని భావిస్తున్నట్లుంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌ సైతం జగన్‌ లక్ష్యం గా తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్‌ స్కామ్‌ విచారణలో భాగంగా వస్తున్న ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తూ తాడేపల్లి, అమరావతిల్లో జగన్‌ భారీగా నిధులు దాచిపెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఏపీలో తమ టార్గెట్‌ జగన్‌ అని కాంగ్రెస్‌ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page