top of page

కొట్లో వ్యాపారాల్లేవ్‌.. చేతిలో సొమ్ముల్లేవ్‌!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Dec 25, 2025
  • 3 min read
  • జిల్లాలో పడకేసిన రిటైల్‌ వ్యాపారాలు

  • బంగారం, వస్త్రాలు, సరుకులు.. అన్నింటికీ అదే గతి

  • కార్పొరేట్‌ ముట్టడిలో చిక్కుకున్న స్థానిక రిటైలర్లు

  • మిగిలిన రంగాలనూ దెబ్బ తీస్తున్న ఆ ప్రభావం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో స్థిరాస్తులు ఉన్నా సమయానికి చేతిలో నగదు (లిక్విడ్‌ క్యాష్‌) లేక తెలిసినవారిని ఓ లక్ష రూపాయల అప్పు అడిగితే రూ.10వేలకే కటకటలాడిపోతున్నామన్న సమాధానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని ప్రధాన సెంటర్లలోనూ భారీ ఎత్తున వ్యాపారాలు జరుగుతున్నా ఎవరి దగ్గరా డబ్బులు లేవనే టాకే వినిపిస్తుంది. ఇన్నాళ్లూ దీనికి సమాధానం సంక్రాంతి సీజన్‌లో దొరుకుతుందని వ్యాపారస్తులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భావించారు. అయితే డిసెంబరు 11 నుంచి 25 వరకు జరగాల్సిన సంప్రదాయ వ్యాపారం పాత గణాంకాలతో పోల్చి చూస్తే ఈ క్రిస్మస్‌ సీజనులో అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఇక మిగిలిందంతా జనవరి 1 నుంచి 13వ తేదీ లోపే. ఈసారి మొంథా తుపాను వచ్చినా జిల్లాలో పంట దిగుబడులు తగ్గలేదు. రైతులకు ధాన్యం డబ్బులు కూడా వారం అటూఇటుగా ఖాతాల్లో పడుతుండటం వల్ల జనవరిలో వ్యాపారాలు అందుకుంటాయన్న ఆశాభావంతో ఉన్నారు. కానీ ఇదంతా కార్పొరేట్లకే వెళ్లిపోతుందని వేరేగా చెప్పనక్కర్లేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగినా.. బంగారం షాపు యజమానులు కూడా సొమ్ము లేదనడం గమనించాల్సిన విషయం. ఒక షాపులో 100 కిలోల బంగారం ఉంటే వారి వద్ద రూ.140 కోట్లు ఉన్నట్టు. కానీ వీరు కొన్నప్పుడు దాని ధర రూ.100 కోట్లే. గత పది పదిహేను రోజుల్లో దానిపై రూ.40 కోట్ల లాభం ఒక పెద్ద బంగారం షోరూమ్‌కు వచ్చినట్టే. కానీ ఇది కేవలం రెండు కళ్లతో చూసుకోడానికి తప్ప దేనికీ పనికిరాకుండాపోయింది. ఈ ధరతో వినియోగదారుడు బంగారం కొన్నప్పుడు మాత్రమే అదనంగా వచ్చిన రూ.40 కోట్ల లాభం వ్యాపారస్తుడి చేతికి అందుతుంది. కానీ ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్‌ చూస్తే శ్రీకాకుళం లోకల్‌ బంగారు వర్తకులు రోజుకు 250 గ్రాముల బంగారం కూడా అమ్మలేకపోతున్నారు.

స్కీములతోనే కాలక్షేపం

షాపుల్లో కనిపిస్తున్న జనం ఎవరన్న ప్రశ్న తలెత్తొచ్చు. ప్రతీ బంగారం షాపు కేవలం మంత్లీ స్కీములతోనే రన్‌ అవుతున్నాయి. రూ.5వేల నుంచి స్థాయిని బట్టి ప్రతి నెల జమ చేసే అధికారిక, అనధికారిక స్కీమ్‌లే ప్రస్తుతం బంగారం షాపులను బతికిస్తున్నాయి. ఇక పెళ్లి, పేరంటాలకు జరిగే వ్యాపారమంతా కార్పొరేట్‌ సంస్థలు పట్టుకుపోతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న జోయ్‌ అలూకాస్‌ తప్ప దాదాపు అన్ని పెద్ద బ్రాండ్‌ షోరూమ్‌లు నగరంలో ఉన్నాయి. వీటిలో సింహభాగం అమ్మకాలు జరుపుతున్నది ఖజానా మాత్రమే. ఆ తర్వాత మోడల్స్‌ కోసమో, యాంటిక్‌ జ్యూయలరీ పేరుతోనో, డైమండ్‌ ఆభరణాల కోసమో మిగిలిన కార్పొరేట్‌ సంస్థలను జనం ఆశ్రయిస్తున్నారు. ఈ సొమ్మంతా రాష్ట్రం దాటి దేశంలోని వేరే ప్రాంతాలకు చేరిపోతుంటే మనకు మిగిలింది లేబర్‌ ఉద్యోగాలు మాత్రమే. దాంతో సరిపెట్టుకొని సంతోషించాల్సిందే. ఎప్పుడైతే కార్పొరేట్ల సొమ్ము మన జిల్లా దాటి వెళ్లిపోతుందో.. జిల్లాలో వస్తు, సేవల రంగం పూర్తిగా కునారిల్లిపోయింది. శ్రీకాకుళంలో రిలయన్స్‌ మార్ట్‌ పెట్టిన తర్వాత 1 నుంచి 15వ తేదీ లోపు రోజుకు రూ.25 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సొమ్ము ఎక్కడికెళ్తుంది? రిలయన్స్‌ ఎవరిదో అందరికీ తెలిసిందే. సొంతూరిలో షావుకారు దగ్గర నాలుగు వస్తువులు కొంటే, దాని మీద నాలుగు రూపాయలు లాభం వస్తే ఈ జిల్లాలో ఏదో ఒక మూల ఒక స్థలం కొనడమో, ఉన్న స్థలంలో ఇల్లు కట్టడమో చేయడం వల్ల మరో నాలుగు రంగాలు బతుకుతాయి, నలుగురికీ ఉపాధి దొరుకుతుంది. కానీ రోజూ తినే పప్పు, ఉప్పులపై లాభాలను కూడా కార్పొరేట్లు పట్టుకుపోవడం వల్ల ఇక్కడవారి వద్ద ఆస్తులున్నా చేతిలో సొమ్ము ఆడటంలేదు.

స్థానిక వ్యాపారాలు మటాష్‌

తానెక్కడుంటే అదే సెంటర్‌ అని, అక్కడే వ్యాపారమని భావించిన సీఎంఆర్‌కు శ్రీకాకుళం ప్రజలు మెట్టు దిగేలా చేశారు. విశాఖ జగదాంబ సెంటర్‌లో బట్టల షాపులు ఉన్న రోజుల్లో కొద్దిగా ముందుకు వచ్చి జడ్జి కోర్టు ఎదురుగా సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ పెట్టారు. ఆ తర్వాత సంపత్‌వినాయక కోవెల దాటాక ఎంవీఆర్‌ మాల్‌ పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఈ రెండూ వస్త్ర దుకాణాలకు సెంటర్లయిపోయాయి. కానీ శ్రీకాకుళం పాలకొండ రోడ్డులో పెడితే మనోళ్లు దాన్ని యాక్సెప్ట్‌ చేయలేదు. దీంతో అందరిలాగే వారు తన మకాంను జీటీ రోడ్డుకు మార్చుకున్నారు. గత ఏడాది కొత్త అడ్రస్‌ కావడం వల్ల అంతంత మాత్రంగా వ్యాపారం జరిగినా, ఈసారి వస్త్రమార్కెట్‌లో ఎక్కువ వ్యాపారం జరిగే అవకాశాలున్నట్లు ప్రస్తుత ట్రెండ్‌ కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క షోరూమ్‌ తప్ప, మిగతా అన్ని చోట్లా ఫెయిలైపోయిన ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ శ్రీకాకుళంలో ప్రారంభించిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ లాభాలతో అనేక బ్రాంచిలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అంటే వ్యాపారం ఎంత జరుగుతుందో అర్థమవుతుంది. సౌతిండియా షాపింగ్‌మాల్‌ దగ్గర్నుంచి పూర్తిస్థాయి కార్పొరేట్‌ సంస్థలైన స్టైల్‌ యూనియన్‌, జుడియో (టాటా), ట్రెండ్స్‌ (రిలయన్స్‌), మాక్స్‌ వంటి సంస్థలకు మూడొంతుల సొమ్ము వెళ్లిపోతుంది. అటువంటప్పుడు జిల్లాలో క్యాష్‌ఫ్లో ఎలా ఉంటుంది? ఇంతవరకు జరిగిన క్రిస్మస్‌ మార్కెట్‌లో రెడీమేడ్‌దే అగ్రభాగం కావడం వల్ల కార్పొరేట్లు గట్టిగా సొమ్ము చేసుకున్నారు. జనవరి 1 నుంచి జరిగే సంక్రాంతి షాపింగ్‌ అయినా స్థానిక వర్తకులకు వస్తుందా? అంటే ఆ నమ్మకం కూడా లేదు. ఎందుకంటే.. ఇప్పటికే కార్పొరేట్లు, సెమీ కార్పొరేట్లు మార్కెట్‌ను ఆక్రమించేశారు. ఎంతలా అంటే.. స్వయంగా ఆ స్థాయి సంస్థలు కూడా పోటీ తట్టుకోలేనంత. శ్రీకాకుళంలో ఆర్‌కే ట్రెండ్స్‌ బట్టల షాపు ప్రారంభించిన తర్వాత చాలా సంవత్సరాలు మార్కెట్‌ను ఏలింది. ఎప్పుడైతే ఎస్‌ఆర్‌, సౌతిండియావంటి సంస్థలు వచ్చాయో ఆర్‌కే ట్రెండ్స్‌కు గత రెండు సీజన్ల నుంచి చెప్పుకోదగ్గ వ్యాపారం లేదు. అటువంటిది అంతకు మూడిరతల తక్కువ స్థాయిలో స్టాకును తీసుకువచ్చే స్థానిక వ్యాపారస్తులు వీరి ముందు నిలబడటం కష్టం. ఎప్పుడైతే స్థానికుల సొమ్ము స్థానికుల వద్ద ఉండదో, దాని ప్రభావం అన్ని రంగాల మీదా పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఏ ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంతంలో వ్యాపారం చేసి నిలదొక్కుకుంటున్నది ఒక్క హోటల్‌ రంగమే. అయితే ఇందులో కూడా స్ట్రీట్‌ ఫుడ్‌ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపిస్తుండటంతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడపాల్సిరావడంతో షాపులు, ఏసీలు మెయింటినెన్స్‌ అంటూ వ్యాపారాలు చేస్తున్నవారు లాభాలు చవిచూడటం తగ్గిపోయింది. వీటన్నింటి ప్రభావం వల్లే నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు మూలుగుతున్నాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగానికి సంబంధించి అనేక వెసులుబాట్లు కల్పిస్తూ జీవో తీసుకువచ్చింది. అయినా ఊపందుకోలేదంటే కారణం సొమ్ములు లేకపోవడమే. కిలో వెండి రూ.2.45 లక్షలు రేటు పలుకుతుంటే, ఇంకా క్యాజూ బర్ఫీ మీద సిల్వర్‌ ర్యాపర్‌ లేదని అడగడం ఎంత మూర్ఖత్వమో, మన సొమ్ములన్నీ కార్పొరేట్లు పట్టుకెళ్లిపోయిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ పడుకుందని బాధపడటం కూడా అంతే తప్పు. అలాగని శ్రీకాకుళంలో సొమ్ములు లేనివారు మాత్రమే ఉన్నారనుకోవద్దు. కాకపోతే క్యాష్‌ ఫ్లో ఆగిపోయింది. జీటీ రోడ్డులో ఉన్న షాపుల అద్దెలు లక్షల్లో వస్తున్నాయంటే.. అందుకు కారణం కార్పొరేట్లు వాటిని అద్దెకు తీసుకోవడమే. అలాగని స్థానికులెవరైనా మంచి టేస్ట్‌తో వ్యాపారం పెడితే కార్పొరేట్‌ స్థాయిలో అద్దెలు చెల్లించలేక సీజన్‌ మారేలోపు చేతులెత్తేస్తున్నారు. శ్రీకాకుళంలో హ్యాపీ షాపింగ్‌మాల్‌ కథా అలాంటిదే. గత పండక్కు క్లియరెన్స్‌ సేల్‌ చేసేసి, ఈ పండగకు అద్దెకు ఇవ్వబడుననే బోర్డును తగిలించేశారు. దీనిలో స్థానికులు బంగారం వ్యాపారం పెట్టాలని భావించినా దాన్ని విరమించుకున్నారు. ఎందుకంటే.. నాన్‌ కార్పొరేట్లలో శ్రీకాకుళంలో బంగారం వ్యాపారం చేస్తున్నది జీఎన్‌, జీఎన్‌వీ వాళ్లు మాత్రమే. బంగారానికి అంత ధర ఇచ్చి కొనలేనివారు వెండి మీద బంగారం పూత పూసే ఆర్నమెంట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు అందులో కూడా కార్పొరేట్లు వచ్చేశారు. జీటీ రోడ్డులో ఏఆర్‌ షాపింగ్‌మాల్‌ పేరిట ఈ పండగకు బట్టల దుకాణం పెట్టాలని ముస్తాబు చేశారు. కానీ వెనకున్న కార్పొరేట్లను చూసి భయపడ్డారో, ఏమో తెలియదు గానీ ఈ పనులూ నిలిచిపోయాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page