top of page

కోటీశ్వరుల పన్నుతో అసమానతలకు చెక్‌

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 27, 2025
  • 2 min read

మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని గొప్పలు చెప్పుకొంటున్నా.. అదే వేగంతో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీనికి ప్రధాన కారణం.. దేశసంపద కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల వద్ద పోగుపడిపోవడమేనని తాజాగా విడుదలైన వాల్ట్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక పేర్కొంది. ఈ అసమానతలను తొలగించాలంటే సంపన్నవర్గంపై ఇప్పుడున్న పన్నులను అతి స్వల్పంగా పెంచితే చాలని ఆ నివేదిక సూచించింది. ఆదాయ అసమానతలు తగ్గించడానికి, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రొగ్రెసివ్‌ వెల్త్‌ ట్యాక్స్‌, సమగ్ర పన్ను (కంప్రహెన్సివ్‌ ట్యాక్స్‌) విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ఇన్‌కమ్‌ అండ్‌ వెల్త్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా 1922-2023’ పేరుతో ఈ రిపోర్ట్‌ను రూపొం దించారు. దేశ జనాభాలో ఒక్క శాతంగా అత్యంత సంపన్నులపై అదనంగా వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేదల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చని, సామాజిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగించవచ్చని రచయితలు, ఆర్థికవేత్తలు నితిన్‌కుమార్‌ భర్తి, లూకస్‌ చాన్సెల్‌, థామస్‌ పికెట్టి, అన్మోల్‌ సోమంచి సూచించారు. తద్వారా భారత్‌లో పెరుగుతున్న ఆదాయం, సంపద అసమానతలను తగ్గించవచ్చన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం.. భారత జనాభాలో ఒక్క శాతమే ఉన్న అత్యంత సంపన్నవర్గమే దేశ ఆదాయంలో 22.6 శాతం, సంపదలో 40.1 శాతం వాటా కలిగి ఉంది. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో ఈ అసమానతలు మరింత భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వాల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ నివేదికలో నిపుణులు ‘కోటీశ్వరుల పన్ను’ను ప్రతిపాదించారు. 2022-23లో రూ.10 కోట్లకు మించి సంపద ఉన్నవారికే ఈ పన్ను విధించాలన్నారు. ఈ స్థాయి కుటుంబాలు దేశంలో కేవలం 0.04 శాతం మాత్రమే ఉన్నాయని అంచనా వేశారు. కోటీశ్వరుల పన్ను విధానంలో బేస్‌లైన్‌, మోడరేట్‌, యాంబి షస్‌ పేర్లతో మూడు రకాలను ప్రతిపాదించారు. బేస్‌లైన్‌ కేటగిరీలో రూ.10 కోట్ల సంపద కలిగిన వారిపై రెండు శాతం పన్ను విధించాలి. రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లపై 33 శాతం వారసత్వ పన్ను వేయాలి. ఇదొక్కటే జీడీపీలో 2.7 శాతం రాబడిని పెంచుతుంది. మోడరేట్‌ కేటగిరీలో రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య నికర సంపద కలిగిన వారిపై పన్నును నాలుగు శాతానికి పెంచాలి. ఇదే విలువ కలిగిన ఎస్టేట్లపై 33 శాతం వారసత్వ పన్ను వేయాలి. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లకు వారసత్వ పన్ను 45 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ఈ పన్ను విధానం భారత జీడీపీలో 4.6 శాతానికి సమానమైన ఆదాయాన్ని ఆర్జించగలదు. యాంబిషస్‌ పన్ను విధానంలో వ్యక్తులపై పన్ను రేట్లను 3 నుంచి 5 శాతం మధ్య, ఎస్టేట్లపై వారసత్వ పన్నును 45 శాతం నుంచి 55 శాతం మధ్య పన్ను పెంచాలని ప్రతిపాదిం చింది. దీంతో స్థూల జీడీపీలో పన్ను రాబడులు 6.1 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. సంపన్నులపై వేసే పన్నులతో వచ్చే ఆదాయాన్ని పేదలకు నగదు బదిలీలు, విద్యా, వైద్యం, ఇతర సామాజిక రంగాలకు ఖర్చు చేయాలి. ప్రతిపాదిత సంపద పన్ను ప్యాకేజీలు సామాజికరంగ వ్యయాన్ని పెంచడానికి, సంపద సృష్టికి దోహదం చేస్తాయి. ఈ పన్నుల విధానం దేశంలోని కేవలం 0.04 శాతం మందిపైనే ప్రభావం చూపుతుంది కనుక ఇబ్బంది ఉండదు. భారత్‌లో ఆర్థిక అసమానతలు కులాలతోనూ లింకై ఉన్న విధానాన్ని ఈ రిపోర్ట్‌ విశ్లేషించింది. దేశంలోని అగ్ర కులాలే జాతీయ సంపదలో గణనీయమైన వాటా కలిగి ఉన్నాయి. భారతీయ బిలియనీర్లు ఎక్కువగా ఉన్నత కులాల వారే. ఈ పరిస్థితుల్లో సంపద పన్ను విధానం తక్కువ సంఖ్యలో ఉన్న అతి సంపన్న, ఉన్నత కుల కుటుంబాలపై మాత్రమే కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో అట్టడుగు కులాలు, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. దీని ద్వారా సంపద అసమానతలను తొలగించడమే కాకుండా.. భారత్‌లోని సామాజిక, ఆర్థిక అసమానతల మధ్య దృఢమైన సంబంధాన్ని బలహీనపరచడంలో ఇటువంటి ప్రతిపాదిత కొత్త పన్ను వ్యవస్థ కీలక పాత్ర పోషించగలదని అని వాల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. మరి మన పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారా అంటే.. అనుమానమే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page