కాటేస్తున్నది కరోనా టీకా కాదు!
- DV RAMANA

- Dec 17, 2025
- 2 min read

ఈమధ్య కాలంలో యువత అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిరంతర జిమ్ చేస్తూ కండలు తిరిగిన శరీరాలను మెంటెయిన్ చేస్తున్న వారికి సైతం అకాల మరణాలు కబళిస్తున్నాయి. కరోనా తర్వాత ఇలాంటి హఠాన్మరణాలు బాగా పెరిగాయి. దాంతో ఈ మరణాలకు అప్పట్లో వేయించుకున్న కరోనా టీకాలే కారణమన్న ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ టీకా కూడా వేశారు. అదే ప్రాణాంతకంగా మారిందని, దీనివల్ల ఫిట్‌గా ఉండే యువతలో కూడా పలు సైడ్ ఎఫెక్ట్స్ మొదలై చివరికి ప్రాణాలు బలిగొంటున్నాయని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రచారం జరిగింది. అస్వస్థులై ఆస్పత్రుల పాలైనవారికి వైద్యులు కూడా వారి అస్వస్థతకు కరోనా టీకా కారణమని చెబుతున్నారు. కానీ అది కేవలం అపోహేనని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తేల్చేసింది. ఈ అంశంపై జరిపి విస్తృత పరిశోధనల్లో యువత హఠాన్మరణాలకు సంబంధించి భయంకరమైన నిజాలను బయటపెట్టింది. మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం కారణం కావొచ్చనే అనుమానాలు అప్పటినుంచీ ఉన్నాయి. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేసినా ఆ ప్రచారానికి బ్రేక్ పడలేదు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిమ్స్ తాజా అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. హఠాన్మరణాలకు కరోనా టీకాలు కారణం కాదనడంతోపాటు వాటికి దారితీస్తున్న ఇతర కారణాలను సైతం ఈ అధ్యయనం వెల్లడిరచింది. ‘బర్డెన్ ఆఫ్ సడెన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్: ఎ వన్ ఇయర్ అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఎ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా’ అనే శీర్షికతో జరిపిన ఈ అధ్యయన నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో వెర్బల్ ఆటాప్సీ, పోస్టుమార్టం ఇమేజింగ్, సంప్రదాయ ఆటాప్సీ, వివరణాత్మక హిస్టోపాథలాజికల్ పరీక్షల ద్వారా 18`45 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తుల్లో ఆకస్మిక మరణాలకు కారణాలను నిశితంగా పరిశీలించారు. కోవిడ్-19 టీకాకు, యువకుల్లో ఆకస్మిక మరణాలకు మధ్య సంబంధాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లభించలేదని తేలింది. అంతర్లీనంగా ఉన్న హృదయ సంబంధిత సమస్యలు, ఇతర వైద్య కారణాలే కారణమని ఈ అధ్యయనం స్పష్టంగా పేర్కొంది. జీవన ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణాలు ఏమిటన్నది ఎయిమ్స్ అధ్యయన నివేదిక వెల్లడిరచింది. 2018`22 మధ్య జరిగిన 3,800కు పైగా అకాల మరణాలపై అధ్యయనం చేయగా 45 ఏళ్ల లోపు మరణించిన వారిలో దాదాపు సగం మంది చావుకు గుండె సంబంధిత వ్యాధులే కారణమని కుండా బద్దలుకొట్టింది. గుండె సంబంధిత వ్యాధులతో 42.6 శాతం మంది ఆకస్మిక మరణానికి గురవుతుంటే.. ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్స్‌తో 21.5 శాతం, ఇతర కారణాలతో 35.9 శాతం మంది చనిపోతున్నారని అధ్యయనం తేల్చింది. ఈ మరణాలకు కోవిడ్ అసలు కారణమే కాదని స్పష్టం చేసింది. గుండె ధమనుల వ్యాధి (కరోనరీ ఆర్టరీ డిసీజ్`సీఏడీ) యువకుల్లో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణంగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. 2,214 అటాప్సీల్లో 180 కేసులు (8.1 శాతం) మాత్రమే ఆకస్మిక మరణాల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఆకస్మిక మరణాలకు గురైన వారిలో 57.2 శాతం మంది యువకులే(45 ఏళ్లలోపు వారు) ఉన్నారు. 46-65 ఏళ్ల వయస్సు వారిలో సంభవించిన మరణాల( 42.8 శాతం) కంటే ఇది ఎక్కువ కావడం గమనర్హం. యువకుల్లో ఆకస్మిక మరణాల సగటు వయసు 33.6 సంవత్సరాలుగా ఉంది. ఆకస్మిక మరణాలకు గురవుతున్న యంగ్ జనరేషన్‌లో పురుషులు అధికంగా ఉండటం మరో ఆసక్తికర పరిణామం. ఈ మరణాల్లో పురుషులు, మహిళల నిష్పత్తి 4.5:1గా నమోదైంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి అత్యంత సాధారణ అంతర్లీన వ్యాధిగా యువతరంలో ఉంటున్నట్లు అధ్యయనం పేర్కొంది. వృద్ధులతో పోలిస్తే యువకుల్లో ఆకస్మిక మరణాల సరళి చాలి భిన్నంగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో అరిథ్మోజెనిక్ రుగ్మతలు, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే లోపాలు కీలకంగా పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా పరిగణించిన గుండె జబ్బు ఇప్పుడు యంగ్ ఇండియాను కబళిస్తోంది. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానాలేనని(లైఫ్ స్టైల్) వైద్యులు చెబుతున్నారు. సిగరెట్, మద్యం, స్ట్రెస్(ఒత్తిడి), నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్.. ఇవన్నీ యూత్‌ను ఆరోగ్యపరంగా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2018`22 మధ్య మరణించిన యువతలో 57 శాతం స్మోకింగ్, 52 శాతం ఆల్కహల్ సేవించేవారు ఉన్నట్లు ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు అదుపు తప్పాయని, వ్యాయామం వదిలేశారని.. ఈ నిర్లక్ష్యమే గుండెపోటు రుగ్మతను ఆహ్వానిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులను చిన్న చూపు చూడొద్దని, లక్షణాలు లేవని లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు 18-44 ఏళ్ల మధ్య వయసు వారిని కబళిస్తున్న ఆకస్మిక మరణాలు.. జీవనశైలిలో మార్పులు రాకపోతే చిన్నారుల్లోనూ సంభవిస్తాయని అంటున్నారు. అందువల్ల పిల్లలకు ఇప్పటి నుంచే వ్యాయామంతో మైండ్, బాడీని మేల్కొల్పేలా చేయమని సూచిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. గుండె బలమైన గోడలా నిలబడాలంటే జీవనశైలిని మార్చుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. లేనిపక్షంలో చిన్నవయసు వారిలోనూ మృత్యు ఘంటికలు వినిపించడం ఖాయమని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి.










Comments