కొంటే ‘సలసల’.. అమ్మితే సమ్మగా!
- NVS PRASAD

- Oct 7, 2024
- 2 min read
పాత స్టాకుకు కొత్తరేటు
విజిలెన్స్ పెడితే బండారం బయటకు
వారంలో కోట్లాది రూపాయలు లాభం
వంటనూనెలతో వ్యాపారుల ఆటలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దేశీయ మార్కెట్‌లో నూనెగింజల ధరలు క్షీణిస్తుండటంతో రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఒక నిర్ణయం జిల్లాలో నూనె వ్యాపారస్తులకు కాసులు కురిపిస్తోంది. ఇటీవల వంటనూనెల ధరలు భారీగా పెరిగాయని మనందరికీ తెలుసు. కానీ ధరలు పెంపుదలకు కారణమైన ప్రభుత్వ నిర్ణయం వెలువడక ముందు జిల్లాలో ఉన్న పాత స్టాక్‌ను కొత్త ధరలకు అమ్ముతూ వంటనూనెల డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేల్ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లో దసరా, దీపావళి ఉండటంతో సాధారణంగా నెలవారీ వాడకం కంటే ఎక్కువ నూనెను పండగ పూట వాడుతారు. దీనికి తోడు పాత స్టాకును కొత్త రేటుకు అమ్మడంతో నూనె వ్యాపారస్తులకు దసరా సంబరం ముందే వచ్చినట్టయింది. వివరాల్లోకి వెళితే.. మన దేశంలో నూనె గింజలు పండిస్తున్న రైతులకు సరైన ధర పలకడంలేదని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి తోడు హర్యానా, మహారాష్ట్ర వంటిచోట్ల ఎన్నికలు ఉండటంతో అక్కడి రైతులను ప్రసన్నం చేసుకోడానికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిళ్ల దిగుమతిపై 20 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ విధించింది. గతంలో దీనిమీద ఎటువంటి దిగుమతి సుంకం ఉండేదికాదు. దీనివల్ల విదేశాల్లో దొరికిన ముడినూనెను తక్కువ ధరకే కంపెనీలు తెచ్చుకుంటున్నాయని, స్థానికంగా రైతులు పండిరచిన నూనె గింజలను కొనడానికి ఇష్టపడటంలేదని భావించిన ప్రభుత్వం పది రోజుల క్రితం కేబినెట్ సమావేశం పెట్టి దిగుమతి చేసుకుంటున్న వంటనూనెలపై సుంకాన్ని విధించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి ఆయిల్‌ను ఇక్కడ కర్మాగారాల్లో శుద్ధి చేసి రిఫైండ్ ఆయిల్‌గా మనకు విక్రయిస్తున్నారు. దీని మీద గతంలో 12.5 శాతం టాక్స్ ఉండేది. దానిని 32.5 శాతానికి పెంచారు. దీని వల్ల దేశీయంగా పండుతున్న నూనెగింజలు కొంటారని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు వంటనూనెల్లో 70 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో పామాయిల్ వాటా 50 శాతం ఉండటం గమనార్హం. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుండగా, అర్జంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు వీటి మీద టాక్స్‌లు విధించడం వల్ల రిటైల్ మార్కెట్‌లో 10 నుంచి 15 శాతం నూనె ధరలు పెరిగాయి. 108 రూపాయలు ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ రూ.124కు పెరిగింది. రూ.95 ఉన్న పామాయిల్ ప్యాకెట్ రూ.105కు మారింది. రూ.155 ఉన్న వేరుశనగ నూనె రూ.165కు ఎగబాకింది. అయితే ఇవన్నీ కొత్తగా టాక్స్‌లు విధించిన తర్వాత పెరిగిన రేట్లు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజుకు, టాక్స్‌లు అమలులోకి వచ్చిననాటికి మధ్య నాలుగు రోజుల వ్యత్యాసం ఉంది. ఈలోగానే జిల్లా వ్యాప్తంగా ఆయిల్ డిస్ట్రిబ్యూటర్లు పాత రేటుతో ఉన్న స్టాక్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. జిల్లాలో ప్రతీ సందులోనూ ఇళ్లను అద్దెకు తీసుకొని వాటిని గొడౌన్లుగా మార్చేసి నూనె ప్యాకెట్లను నిల్వ ఉంచేశారు. ఇప్పుడు నూనె కోసం ఎవరు వెళ్లి అడిగినా, పాత ప్యాకెట్ మీదే కొత్త ధర వేసి అమ్ముతున్నారు. ఇష్టముంటే తీసుకోండి, కష్టమైతే మానేయండి అని పరోక్షంగా చెబుతున్నారు. మూడు ఆయిల్ ప్యాకెట్లు కావాలని అడిగితే ఒకటే ఉందని, తమ వద్ద స్టాకు లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. జిల్లాలో ప్రతీచోట రిఫైండ్ ఆయిల్‌కు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీరంతా పాత స్టాకునే కొత్త రేటుకు అమ్ముతున్నారు. ప్రతీరోజు నాలుగు లారీల స్టాకు క్రమం తప్పకుండా ఒక్కో డిస్ట్రిబ్యూటర్‌కు వస్తుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన తర్వాత ఈ లారీల సంఖ్య మరింత పెరిగింది. జిల్లా విజిలెన్స్ అధికారులు గొడౌన్ల మీద రైడ్‌లు జరిపితే పాత స్టాకు ఎంతుందో బయటపడుతుంది.










Comments