top of page

కూటమి ఏడాది పాలన... కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 14, 2025
  • 4 min read
  • పూర్తిగా ఆచరణలోకి రాని సూపర్‌ సిక్స్‌

  • పాత విధానాల మార్పుతోనే పుణ్యకాలం సరి

  • ఏడాది ఆలస్యంగా టీచర్ల నియామక ప్రక్రియ

  • కొత్తగా తెరపైకి పూర్‌ టు రిచ్‌ పథకం

  • అందుబాటులోకి వచ్చిన ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు వాటిలో కీలకం. అందులోనూ ఇటీవలి కాలంలో పార్టీలు పోటాపోటీగా ప్రజాకర్షక హామీలు గుప్పించి ఓట్లు దండుకోవడం.. తీరా అధికారంలోకి వచ్చాక ఏవో కారణాలతో హామీల్లో చాలావాటిని గాలికొదిలేయడం సాధారణంగా మారింది. మారిన ఈ పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి ఇతర పాలనాపరమైన అంశాల కంటే హామీలు, ప్రజాకర్షక పథకాల అమలు తీరే గీటురాయిగా మారిందన్నది వాస్తవం. అదే సమయంలో ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం కచ్చితంగా సరిపోతుంది. ప్రభుత్వ మనుగడలో ‘తొలి అడుగు’గా భావించే ఈ కాలంలో రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు ఎంత ఫలవంతం అయ్యిందన్నది విశ్లేషించే ప్రయత్నమే ఈ కథనం.

రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విప్లవాత్మక తీర్పునిచ్చారు. అప్పటివరకు అధికారంలో ఉన్న వైకాపా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ.. దాన్ని తిరస్కరించి తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి తిరుగులేని విధంగా ఏకపక్ష మెజారిటీతో పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ. బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే కూటమి ఏకంగా 164 సీట్ల మెజారిటీతో గత ఏడాది జూన్‌ 12న రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించగా, పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించిన జనసేన తొలిసారి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తద్వారా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు కొలువుదీరాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు కారణంగా అభివృద్ధి పరుగులు తీస్తుందని ఎన్డీయే కూటమి నేతలు ప్రకటించారు. ప్రజలు కూడా అదే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తామని అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిగ్గా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న చంద్రబాబు సర్కారు సూపర్‌ సిక్స్‌ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. దీనికి నిధుల సమస్య ప్రధాన అడ్డంకిగా ఉందని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే సూపర్‌ సిక్స్‌లో పేర్కొన్న పథకాలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా తొలి ఏడాది పాలనలో ఎన్నికల సమయంలో ఇవ్వని కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం చేపట్టడం విశేషం.

  • సూపర్‌ సిక్స్‌లో ఇప్పటికి రెండే

ఎన్నికల ప్రచారంలో ప్రజలను బాగా అకట్టుకున్న, కూటమి ఫోకస్‌ చేసిన హామీ సూపర్‌ సిక్స్‌. ఆరు గ్యారెంటీల పేరుతో కూటమి వ్యూహకర్తలు దీన్ని తీసుకొచ్చారు. కానీ ఈ ఏడాది కాలంలో వీటిలో రెండే పథకాలు అమల్లోకి వచ్చాయి. ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్న హామీని ప్రభుత్వం దీపం 2.0 కార్యక్రమం ద్వారా ఆచరణలోకి తెచ్చింది. అయితే గత ఏడాది ఒక సిలిండర్‌, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక సిలిండర్‌ మాత్రమే ఉచితంగా అందజేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ(కుటుంబంలో ఒకరికి అన్న పరిమితి లేకుండా) ఏడాదికి రూ.15వేలు చొప్పున అందజేస్తామన్న హామీ ఏడాది ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. గత విద్యా సంవత్సరంలో అందని ఈ పథకాన్ని ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 12న ఆచరణలో పెట్టారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.2 వేలు మినహాయించి రూ.13 వేలు చొప్పునే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో దీనికి రూ.6,300 కోట్లు కేటాయించినా ఇప్పటివరకూ పథకం అమలు కాలేదు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే పథకానికి సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. 18 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సులైన మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని సూపర్‌ సిక్స్‌లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాలు దీని ఊసెత్తడంలేదు.

  • వైకాపా తప్పులను సరిదిద్దే చర్యలు

వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఆ మేరకు వరుసగా చర్యలు తీసుకుంటూ పోతోంది. వైకాపా హయాంలో ఒక్కసారి కూడా టీచర్ల నియామకాలు చేపట్టలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు మెగా డీఎస్సీ నియామకాల ఫైలుపైనే తొలి సంతకం చేశారు. కానీ ఎస్సీ వర్గీకరణ వంటి వివాదాల కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా 16347 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల ఆరో తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వివాదాస్పదమై ఎన్నికల్లో ఎన్డీయే ప్రచారాస్త్రంగా మారింది. ఆ మేరకు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఆ చట్టాన్ని రద్దు చేశారు. గత ప్రభుత్వ ప్రయోగాలతో అభాసుపాలైన ఇసుక పాలసీని చంద్రబాబు సర్కారు సంస్కరించింది. మళ్లీ ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వినియోగదారుల నుంచి స్థానిక సంస్థలు సీనరేజీ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. గత టీడీపీ ప్రభుత్వ చివరి రోజుల్లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసేసింది. ఐదు రూపాయలకే టిఫిన్‌, భోజనం అందించే ఈ క్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచారు.

  • సామాజిక పింఛన్ల పెంపు

అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, కళాకారుల సామాజిక పింఛన్లను 3 వేల నుంచి నుంచి 4 వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలో వచ్చిన వెంటనే దాన్ని నిలబెట్టుకున్నారు. వలంటీర్‌ వ్యవస్థను తప్పించేసి సచివాలయ ఉద్యోగులతోనే ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే పెన్షన్లను లబ్ధిదారులకు ఇళ్ల వద్ద అందజేస్తున్నారు. మృతి చెందిన పురుష లబ్ధిదారుల స్థానంలో వితంతువులుగా మారిన వారి భార్యలకు పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల నుంచే ప్రారంభించారు. వైకాపా హయాంలో రహదారుల దుస్థితిని అసలు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కూటమి అధికారంలోకి రాగానే రూ.3,800 కోట్లు విడుదల చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రహదారులకు రూ.6వేల కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

  • కొత్తగా పీ-4 కార్యక్రమం

ఎన్నికల హామీల్లో లేని, ప్రచారంలో ప్రస్తావించని కొత్త కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కారు ప్రారంభించింది. అదే పూర్‌ టు రిచ్‌ కార్యక్రమం. పీ`14 అని వ్యవహరించే ఈ కార్యక్రమం ద్వారా పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో జనాభాలో సంపన్నులైన 10 శాతం మంది.. అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేయడమే దీని లక్ష్యం. విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే సంపన్న వ్యక్తులను దీనికి మార్గదర్శకులుగా నియమిస్తారు. నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. వచ్చే ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

  • రాజధాని శంకుస్థాపనల జోరు

అత్యంత కీలకంగా భావించే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణాల కూడా ఈ ఏడాది కాలంలో అడుగులు పడలేదు. కేవలం శంకుస్థాపనలు, ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అమరావతినే రాజధానిగా ఖరారు చేసిన కూటమి సర్కారు ఆ ప్రాంతంలో ఐదేళ్లుగా పెరిగిపోయిన తుప్పలు, డొంకలను తొలగించేందుకు ప్రాధాన్యమిచ్చింది. గత నెలలో ప్రధాని మోదీతో మళ్లీ రాజధాని పనులకు శంకుస్థాపం చేయించారు. సుమారు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు పునాది రాళ్లు వేశారు. వీటిలో మూడో వంతు పనులకే టెండర్లు ఖరారయ్యాయి. అయితే అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా రాజధాని సమగ్ర నిర్మాణానికి మరో 40వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదిస్తుండటం చర్చనీయాంశమైంది. కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2027 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page