top of page

కూటమిగా గెలిచారు..పార్టీగా ఓడారు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 4
  • 4 min read
  • ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీలో వింత పరిస్థితి

  • పాలకొండ, ఎచ్చెర్లలో మిత్రపక్షాల ఎమ్మెల్యేతో ఇక్కట్లు

  • శ్రీకాకుళం, పాతపట్నంలలో సొంత పార్టీలోనే సెగలు

  • ఒకరి వద్దకు వెళితే ఇంకొకరికి కోపం

  • ఎవరి వద్దకు వెళ్లినా ఆ గ్రూప్‌ వారని ప్రచారం

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఓ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లు తయారైంది వీరి పరిస్థితి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం ప్రయోగాలు చేయడమే ఈ పరిస్థితికి కారణం. అలాగని దీన్ని విఫల ప్రయోగం కాదు. ఈ నాలుగుచోట్లా టీడీపీ కూటమి నిలబెట్టిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కానీ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం పాత, కొత్త నాయకుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. కొన్నిచోట్ల సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్‌ దక్కకుండా చేసే ప్రయత్నాలు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల ఎమ్మెల్యే మీద పైచేయి సాధించేందుకు జరుగుతున్న కుట్రల్లో కేడర్‌ బలిపశువులైపోతున్నారు.

పాతపట్నంలో మామిడి గోవిందరావుకు టిక్కెటివ్వడంతో ఇన్నాళ్లూ కలమట రమణతో పయనించిన టీడీపీ కేడర్‌ ఇప్పుడు మామిడి గోవిందరావు వెంట నడుస్తోంది. అయితే కలమట ఇప్పటికీ ఎమ్మెల్యే మీద పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా తానే కావడం ఆయనకు కలిసొచ్చింది. తెర వెనుక రహస్య ఒప్పందాలు, వ్యాపారాలు కలిసి జరుపుకొంటున్నా బహిరంగంగా మాత్రం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. దీనివల్ల పార్టీ జిల్లా అధ్యక్షుడి దగ్గరకు వెళ్తే ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే దగ్గరకు వెళితే పార్టీ అధ్యక్షుడికి కోపం వస్తుందని దీన్నే గ్రూపులుగా మలిచేశారన్న భావన, ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యే వద్దకు వెళ్తే ఇన్‌ఛార్జికి కోపం

పాలకొండలో అప్పటి వరకు టీడీపీలో ఉండి జనసేన తరఫున పోటీ చేసిన జయకృష్ణ ఎమ్మెల్యే కాగా, టీడీపీలో ఉన్నప్పుడు ఆయన్ను వ్యతిరేకించిన వర్గమంతా ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన వారిపై కత్తికడుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న పడాల భూదేవి పాలకొండ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉండటం, ఆ జిల్లాకు మంత్రి అచ్చెన్నాయుడే ఇన్‌ఛార్జి మినిస్టర్‌ కావడంతో కార్యకర్తల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కళా వెంకటరావు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నిమ్మక జయకృష్ణకు, జనసేనకు వాస్తవానికి సంబంధం లేదు. పొత్తుల్లో భాగంగా ఆయన జనసేన గుర్తుపై పోటీ చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినందున జనసేనే కాకుండా టీడీపీ కేడర్‌ కూడా ఆయన క్యాంప్‌ కార్యాలయానికే వెళ్లాల్సి వస్తోంది. కానీ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే అసమ్మతి నాయకుల పనులు అక్కడ చకచకా జరిగిపోతున్నాయి. వడ్డించేవాడుండటంతో కడఫంక్తిలో ఉన్నా ఆకులో అన్నీ సమకూరుతున్నాయి. ఎటొచ్చీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన వారిపై గ్రూపు ముద్ర పడుతోంది.

ఆయన వద్దకు వెళ్లారా.. అని ఆరా

ఎచ్చెర్లలో బీజేపీ నుంచి నడికుదుటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) ఎమ్మెల్యే కాగా రణస్థలానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా తెలుగుదేశం తరఫున గెలిచారు. స్థానికంగా పనులు కావాలంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలి. ఎన్నికల ముందు వరకు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ కేడర్‌ అయితే కళా వెంకటరావు లేదా కలిశెట్టి అప్పలనాయుడు వద్దకు వెళ్లేది. అప్పలనాయుడు విజయనగరం ఎంపీ అయినా, ఆయన స్వస్థలం రణస్థలం. ఎన్‌ఈఆర్‌ ఉండేది కూడా రణస్థలం మండలం బంటుపల్లిలోనే. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య తెలుగుదేశం నేతలు నలిగిపోతున్నారు. ఎన్‌ఈఆర్‌ బీజేపీ తరఫున గెలిచినా ఆయన మాతృసంస్థ టీడీపీయే. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఎంపీ వద్దకు ఇంతకు క్రితమే వెళ్లారా? అని ఎమ్మెల్యే వర్గం ఆరా తీసిన తర్వాతే ఇక్కడ అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారని తెలుస్తోంది.

హోంమంత్రి పర్యటనలో గుండ లక్ష్మీదేవి హడావుడి

తాజాగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకోడానికి వచ్చారు. ఈ విషయం ఎలా లీకైందో తెలీదు గానీ అరసవల్లిలోనే ఉంటున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఓ చీర పట్టుకెళ్లి అనితకు దగ్గరుండి దర్శనం చేయించారు. హోంమంత్రి కూడా మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి లక్ష్మమ్మ అంటూ తన భక్తిని చాటుకున్నారు. అంతవరకు హోంమంత్రి వస్తారని పెద్ద ఎత్తున చేరిన నగర టీడీపీ నాయకులు లక్ష్మీదేవి రాకతో చెల్లాచెదురైపోయారు. కాగా ముందుగానే నిర్ణయించుకున్న ప్రొగ్రాం ప్రకారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తన సతీమణి గొండు స్వాతితో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లారు. తాను ఊరిలో లేకపోవడం వల్ల రాలేకపోతున్నానని, నగర పార్టీ నాయకుడు మాదారపు వెంకటేష్‌ నేతృత్వంలో పార్టీ డివిజన్‌ ఇన్‌ఛార్జిలు వస్తారంటూ శంకర్‌ హోంమంత్రికి సమాచారమిచ్చారు. కానీ లక్ష్మీదేవి ఆలయానికి చేరుకోవడంతో నగర కేడర్‌ దూరంగా నిలబడిపోయారు. లక్ష్మీదేవితో పాటు హోంమంత్రి కార్యక్రమంలో పాల్గొంటే ఆమెతో కలిసి రాజకీయాలు చేస్తున్నారనే సంకేతాలు వెళ్తాయన్న కోణంలో వీరంతా వెనుదిరిగారు. దీంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవేమోనన్న సందేహాలు వచ్చాయి. ఎన్నికల సమయంలో శంకర్‌ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించని గుండ దంపతులు ఆ కొద్ది నెలలు విశాఖపట్నానికి మకాం మార్చారు. అప్పలసూర్యనారాయణ అయితే తాను గత ఎన్నికల్లో ఓటే వేయలేదని ప్రకటించారు. లక్ష్మీదేవి పోలింగ్‌ రోజున కొద్దిమంది వైకాపా కోసం పనిచేసే యువకులతో కలిసి తీయించుకున్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో గత ఎన్నికల్లో గుండ దంపతులు శంకర్‌ కోసం పని చేయలేదని పార్టీకి నివేదికలు వెళ్లాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉన్న లక్ష్మీదేవి ఈమధ్య కాలంలో సిటింగ్‌ ఎమ్మెల్యేకు తలనొప్పి కలిగించే విధంగా పర్యటనలు, పరామర్శలు చేస్తున్నారు. ఇది పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. శంకర్‌ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించని లక్ష్మీదేవి కుటుంబం ఇప్పుడు పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్తుండటంతో ఏం చేయాలో కేడర్‌కు పాలుపోవడంలేదు.

మాజీ హోదాతో పోటీ పర్యటనలు

ఒక్క ముక్కలో చెప్పాలంటే తమతో ఉంటూనే గొండు శంకర్‌ పార్టీ టిక్కెట్‌ ఎలా తెచ్చుకున్నారో, ఇప్పుడు కూడా లక్ష్మీదేవి పార్టీలో ఉంటూనే వచ్చే ఎన్నికలకు శంకర్‌ను తప్పించే యోచనలో పని చేస్తున్నారనేది కార్యకర్తల భావన. అందుకే ఆమె వెళ్లే కార్యక్రమాలకు కేడర్‌ దూరం జరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు నగరంలో గొండు శంకర్‌ పర్యటిస్తున్న సందర్భంలో రెల్లివీధి వద్ద నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఏ హోదాలో నగరంలో పర్యటిస్తున్నారంటూ కొంతమంది కేడర్‌తో కలిసి నిలదీశారు. ఆ తర్వాత శంకర్‌కే టిక్కెట్‌ దక్కడంతో పార్టీలో అధిక శాతం మంది ఆయన కోసం పని చేశారు. ఇప్పుడు లక్ష్మీదేవి అటువంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా పార్టీ తరఫున కాకుండా మాజీ ఎమ్మెల్యే హోదాలో పరామర్శలు చేపడుతున్నారు. దీనివల్ల కేడర్‌ అడ్డుకోలేకపోతోంది సరికదా.. ఆమెతో కలిసి ఫొటోలో కనిపిస్తే తమ రాజకీయ జీవితానికి నూకలు చెల్లిపోతాయన్న భావనలో ఉన్నారు. గత ఎన్నికల్లో గుండ దంపతులు చంద్రబాబు నిర్దేశించిన అభ్యర్ధికి మద్దతు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదు. అలా కాకుండా శంకర్‌కు టికెట్‌ ప్రకటించిన 20 రోజుల వరకు ఒక రకమైన సందిగ్ధావస్థను సృష్టించి చంద్రబాబు ఇచ్చిన ఏ ఆఫర్‌నూ అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ఫలితమే ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గుండ కుటుంబం తమ రాజకీయ జీవితాన్ని తామే చెడగొట్టుకున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద గెలవడం గుండ కుటుంబం తప్ప మరొకరికి సాధ్యంకాదన్న రీతిలో ప్రచారం ఉండేది. శంకర్‌ కేవలం సర్పంచ్‌ మాత్రమేనని ఆయనకు ఆ స్థాయి లేదని పోలింగ్‌ రోజు వరకు ఒక ట్రోలింగ్‌ నడిచింది. కానీ భారీ మెజార్టీతో శంకర్‌ గెలిచారు. దీంతో తెలుగుదేశం తరఫున ఎవరు నిల్చున్నా గెలుస్తారని, విజయం గుండ కుటుంబం సొత్తు కాదని తేలిపోయింది. అదే గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణలు గత ఎన్నికల్లో శంకర్‌ వెనుక ఉంటే చంద్రబాబు ఆదేశాలను గౌరవించినట్లు ఉండేది, అదే సమయంలో అఖండ మెజార్టీ వెనుక గుండ దంపతుల కష్టం ఉందన్న సందేశం కూడా వెళ్లుండేది. ఇప్పుడు ఈ రెండిరటికీ వీరు దూరమవడం వల్ల నష్టపోయింది గుండ కుటుంబమే. దీన్ని వదిలేసి కేవలం సిటింగ్‌ ఎమ్మెల్యేను ఇరిటేట్‌ చేసే పనులకు పూనుకోవడం వల్ల రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి ఏం సాధిస్తారో తెలీదు గానీ, కేడర్‌ మాత్రం నలిగిపోతున్నారు. అప్పలసూర్యనారాయణైతే కచ్చితంగా ఇలా వ్యవహరించివుండేవారు కాదు. 2014 ఎన్నికల్లో తనను పక్కన పెట్టినందుకు చంద్రబాబు మీద అలిగిన అప్పలసూర్యనారాయణ జిల్లాకు చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చినా ఆయన్ను కలవడానికి వెళ్లలేదు. చివరకు కళా వెంకట్రావు కల్పించుకొని చంద్రబాబుకు అరసవల్లిలో కార్యక్రమం ఏర్పాటుచేసి, అప్పలసూర్యనారాయణ ఇంటికి తీసుకువెళ్లారు తప్ప, గుండ మాత్రం తన స్థాయి దిగి రాజకీయాలు చేయలేదు. అయితే లక్ష్మీదేవికి మాత్రం ఇది పరిపాటేనని గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుచేస్తున్నాయి. 1995 మున్సిపల్‌ ఎన్నికల్లో గుజరాతిపేట నుంచి వరం బలపరిచిన కౌన్సిలర్‌ అభ్యర్థి పెంటా లక్ష్మణశర్మ చేతిలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థిని వరం 1996లో టీడీపీలో చేరిన తర్వాత కూడా లక్ష్మీదేవి ప్రోత్సహించారు. ఎప్పుడైనా వరం మళ్లీ పార్టీ మారితే.. టీడీపీకి ఒకరుండాలన్న కోణం ఆమెది. ఇప్పుడు కూడా టీడీపీ తరఫున తాను యాక్టివ్‌గానే ఉన్నానన్న సంకేతాలు పంపడం కోసం ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page