కూటమిలో కమలం చిచ్చు!
- DV RAMANA

- Jul 4, 2025
- 2 min read

‘మా పార్టీ లేకపోతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేదే కాదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే రాష్ట్రంలో కూటమికి ఎన్నికల సమయంలోనూ, ప్రభుత్వం ఏర్పాటు చేశాక అన్ని విధాలా కలిసివస్తోంది. అలాంటి మా పార్టీకి పదవుల పంపిణీలో అన్యాయం చేస్తున్నారు. మంత్రి పదవులతో సహా అన్ని రకాల రాజకీయ నియామకాల్లో తెలుగుదేశమే పెద్దన్న పాత్ర పోషిస్తూ 80 శాతం పదవులను తన్నుకుపోతోంది. 15 శాతం పోస్టులు జనసేన తీసుకుంటుండగా.. మా పార్టీ ముఖాన ఐదు శాతం పదవులు కొడుతున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు విష్ణుకుమార్‌రాజు ఘాటైన వ్యాఖ్యలు చేయడం కూటమి వర్గాల్లో కాక రేపుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. తొలిఏడాది సంబరాలు చేసుకుంటున్న కూటమి సర్కారులో సెగలు రేపుతున్నాయి. కూటమిలోని మూడు పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వడం లేదంటూనే.. కూటమిలో టీడీపీ పెత్తనాన్ని ప్రశ్నించడం, కేవలం ఐదు శాతం పదవుల కోసమే జాతీయ పార్టీ అయిన బీజేపీ కూటమిలో చేరిందా? అని నిలదీయడం కచ్చితంగా కూటమి మనుగడపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీట్ల సర్దుబాటులో సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ కోసం.. కూటమి కోసం త్యాగాలు చేసిన క్యాడర్ ఊరుకోదని కూడా హెచ్చరించారు. విష్ణుకుమార్‌రాజు ఆరోపణలను కమలం కార్యకర్తలు బలపరుస్తుండగా.. ఆయన టార్గెట్ చేసి టీడీపీ వర్గాలు మాత్రం ఈ వ్యాఖ్యలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత జరిగిన పదవులు పంపిణీని పరిశీలిస్తే.. రాష్ట్ర మంత్రివర్గంలో టీడీపీకి 20 మంది మంత్రులు ఉన్నారు. అలాగే 15 శాతం దామాషా ప్రకారం జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి మాత్రం ఒకే ఒక్క మంత్రి బెర్త్ దక్కింది. దీనిపై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. 2014లో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నప్పుడు బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఇద్దరిని మంత్రులుగా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరినే మంత్రిగా తీసుకోవడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీజేపీకి నామమాత్రపు ప్రాధాన్యం దక్కుతోందని ఆ పార్టీ క్యాడర్ వాదిస్తోంది. పైగా పరిపాలన వ్యవహారాల్లో కూడా టీడీపీ, జనసేనలకే ప్రాధాన్యత దక్కుతోందన్న అసంతృప్తి కూడా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఇంతకుముందే చాలామంది నేతలు ఇంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. అయితే అంతా పార్టీ అధినాయకత్వం చేతుల్లోనే ఉందని చెప్పి ఆమె తప్పించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యురాలు కావడం వల్ల గట్టిగా ఒత్తిడి తేలేకపోతున్నారన్న అసంతృప్తి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె స్థానంలో మాధవ్ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో విష్ణుకుమార్ రాజు కూటమిలో కమలానికి జరుగుతున్న అన్యాయాన్ని అందరి సమక్షంలోనే ప్రస్తావించడంపై పార్టీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది. తనకు మంత్రి పదవి దక్కలేదన్న దుగ్దతోనే విష్ణుకుమార్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పలువురు టీడీపీ నేతలు విమర్శిస్తున్నా.. బీజేపీ లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీ క్యాడర్‌కు ములుకుల్లా గుచ్చుకున్నాయి. ఈ పరిణామాలు ముందు ముందు కూటమిపై ఎటువంటి ప్రభావం చూపుతుందన్న చర్చలు కూడా జరుగు తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే కూటమి పార్టీల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు పేరుతో టీడీపీ ప్రభుత్వ పథకాలపై ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కానీ ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఇందులో భాగస్వామ్యం కల్పించలేదు. మరోవైపు బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు రాజ్యసభ సీట్లు, ఒక ఎమ్మెల్సీ సీటు దక్కించు కుంది. ఇక టీడీపీ నాయకత్వానికి సన్నిహితురాలైన పురంధేశ్వరిని తప్పించి మాధవ్‌కు అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. వీటి వెనుక బీజేపీకి పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా టీడీపీపై ఒత్తిడి పెంచడంలో భాగమే.










Comments