కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
- BAGADI NARAYANARAO

- Nov 13
- 1 min read
ఖాకీల అదుపులో ముగ్గురు నిందితులు
అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు

(సత్యంన్యూస్, పలాస)
పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. పలాస పట్టణానికి చెందిన వైశ్యరాజు లక్ష్మీ నారాయణరాజును బలవంతంగా కారులో ఎక్కించుకొని దాడి చేసి, బెదిరించి, అనంతరం వదిలిపెట్టిన ఘటనలో కాశీబుగ్గ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు పూర్వపరాలను అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు గురువారం ఉదయం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. పలాసకు చెందిన లక్ష్మీనారాయణ ఆమదాలవలసలో ఉన్న బిల్డింగ్‌ను నిందితుడు పొట్నూరు వేణుగోపాలరావుకు రూ.65 లక్షలు లీజుకు ఇచ్చారు. లీజు భవనంలో వేణుగోపాలరావు అతని, కుటుంబ సభ్యులు కలిసి కామేశ్వరి సూపర్‌మార్కెట్ నడుపుతున్నారని తెలిపారు. లీజుకు ఇచ్చిన బిల్డింగ్ కోసం లక్ష్మీనారాయణ బ్యాంకులో రుణం తీసుకుని చెల్లింపులు చేయకపోవడంతో బ్యాంకు అధికారులు సీజ్ చేయడానికి వచ్చారన్నారు. లీజుకు తీసుకున్న వేణుగోపాలరావు ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణకు రూ.1.10 కోట్లు చెల్లించారన్నారు. ఇచ్చిన మొత్తానికి 2022లో బిల్డింగ్‌ను వేణుగోపాలరావు కుటుంబ సభ్యుల పేరిట తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో, భవనం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వేణుగోపాలరావు, ఆయన స్నేహితుడు బొడ్డేపల్లి శ్రీనివాసరావు, తాతారావు, జీవన్‌కుమార్, రమేష్, గణేష్ కలిసి ఈ నెల 6న పలాసలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద గల సాయిరాం టీ టైమ్ వద్ద లక్ష్మీనారాయణను బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారన్నారు. అతనిపై దాడి చేసి లక్ష్మీనారాయణను ఆమదాలవలస ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద వదిలి పారిపోయారని తెలిపారు. లక్ష్మీనారాయణ కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో కాశీబుగ్గ ఇన్‌ఛార్జి డీఎస్పీ డి.లక్ష్మణరావు, కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ ఆర్.నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.










Comments