కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది!
- BAGADI NARAYANARAO

- Sep 24
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మీకో పిప్పిపన్ను ఉంది. దాన్ని డొలవకుండా సిమెంట్ ఫిల్లింగో, రూట్‌కెనాలో చేస్తే ఏమవుతుంది? దీనికి సమాధానం అందరికీ తెలుసు.. మొదటిదానికి మందు వాడకపోతే రెండోది రాలి పడిపోతుంది అని. సరిగ్గా అలాగే జరిగింది ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి. ఇక్కడ 500 కుటుంబాలు ఉన్నాయి. దరిదాపుల్లో ప్రైవేటు పాఠశాల లేకపోవడం వల్ల కావచ్చు, ప్రభుత్వ బడిలో గుణాత్మక విద్యా బోధకులు ఉండటం కావచ్చు గానీ, పిల్లలంతా ఎంచక్కా ఇక్కడే చదువుకునేవారు. కానీ ఇటీవల ఇందులో మూడొంతులు దూరాభారమైనా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోతున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఇక్కడ 60 నుంచి 25కు పడిపోయింది. ఇందుకు కారణమేంటని ఆరా తీస్తే చాలా చిన్న విషయం బయటపడిరది. ఎంతసేపూ బాత్రూమ్‌లు శుభ్రంగా ఉన్నాయా లేదా? పిల్లలకు పుస్తకాలు ఇచ్చారా లేదా? పిల్లలు టైమ్‌కు పాఠశాలకు వస్తున్నారా? లేదా?.. అంటూ అనేక యాప్‌లు పెట్టి పర్యవేక్షించే విద్యాశాఖ అధికారులు నిధులతో సంబంధం లేని చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ డ్రాపౌట్స్ పెరిగారు. నాడు`నేడు పథకంలో భాగంగా కొత్తవలసలో అప్పటికే శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొత్త భవనం అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ పాత భవనాన్ని అలానే ఉంచేయడం వల్ల అది ఇప్పుడు నాగులచవితికి స్థానికులకు అక్కరకు వచ్చేవిధంగా మారింది. తమ పిల్లలు కూర్చునేచోటకు పురుగు పుట్రా వస్తున్నాయని, పాములు సంచరిస్తున్నాయనే భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు వేరే స్కూల్‌కు మార్చేశారు. పాత భవనాన్ని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో స్థానికులు కూడా దీన్ని దేనికి పడితే దానికి వాడేస్తున్నారు. చుట్టూ మొక్కలు, పొదలతో భయానకంగా మారిన ఈ వాతావరణంలోనే కొత్త భవనాలు ఉండటం ప్రమాదకరంగా మారింది. ఎక్కడైనా వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుంది. ఇక్కడ మాత్రం అన్ని హంగులతో భవనం నిర్మించినా రెండు డజన్లకు మించి పిల్లలు లేకపోవడం బాధాకరం. వీరికి ఇద్దరు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు.










Comments