top of page

కొత్త ఏడాది కేంద్ర సర్కారు తొలి కోత

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 3
  • 3 min read

విద్యుత్‌ వాహనరంగానికి కొత్త ఏడాది ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఈ రంగానికి కొంతకాలంగా ఇస్తున్న భారీ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాల్లో కోతలకు శ్రీకారం చుట్టింది. కోతల్లో తొలిదశగా ఎలక్ట్రిక్‌ త్రిచక్ర(ఆటోలు) వాహనాలకు సబ్సిడీలు నిలిపివేస్తూ పాత ఏడాది(2025) చివరిరోజే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి భారంగా పరిణమించనుంది. వీటి ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఈ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న తయారీ కంపెనీలు, పంపిణీ చేసే మార్కెటింగ్‌ సంస్థల లావాదేవీలపైనా పెనుప్రభావం చూపుతుందని. ధరలు పెంచక తప్పని పరిస్థితుల్లో తమ వార్షిక ఉత్పత్తి, అమ్మకాపు లక్ష్యాలు దెబ్బతింటాయని ఈ రంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎం ఈ- డ్రైవ్‌ కింద ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు దేశంలో 2.9 లక్షల త్రిచక్ర వాహనాలను విక్రయించగా వాటన్నింటికీ సబ్సిడీలు అందించారు. లక్ష్యం పూర్తి కావడంతో సబ్సిడీలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి తమ వంతుగా సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో సూచించింది. ఇప్పటివరకు తాము విద్యుత్‌ వాహన రంగం పుంజుకునేందుకు ప్రోత్సహించామని ఇప్పుడు రాష్ట్రాలు ఆ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక మీదట రిజిస్టర్‌ అయ్యే ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీ వర్తించదని వివరించింది. ప్రస్తుతం త్రీ వీలర్‌ వాహన విభాగంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం 32 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ లక్ష్యమైన 20-30 శాతం కంటే కూడా ఇది ఎక్కువ. ఈ నేపథ్యంలో సబ్సిడీలు వంటి ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే ఈ రంగం నిలదొక్కుకోగలదన్న ఆశాభావంతోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సబ్సిడీల నిలిపివేత వల్ల విద్యుత్‌తో నడిచే త్రిచక్ర వాహనాల కొనుగోలుదారులు సబ్సిడీతో నిమిత్తం లేకుండా ఉత్పత్తిదారులు నిర్ణయించిన పూర్తి కొనుగోలు ధరను భరించాల్సి ఉంటుంది. పీఎం ఈ డ్రైవ్‌ పథకం కింద సబ్సిడీలను విక్రయ కంపెనీల ద్వారా అమలు చేసేవారు. అంటే వాహనాల కొనుగోలు చేసిన సమయంలోనే వాటి ధర నుంచి సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగిలిన ధరనే కంపెనీలు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసేవి. సబ్సిడీ నగదును అమ్మకాల జాబితా ప్రకారం ఆయా సంస్థల ఖాతాల్లో జమ చేసేది. అయితే త్రీ వీలర్‌ వాహనాలకు సబ్సిడీ నిలిపివేసినప్పటికీ ద్విచక్ర విద్యుత్‌ వాహనాలకు మాత్రం సబ్సిడీలు కొనసాగుతాయి. మరికొంత కాలంపాటు వీటికి వర్తించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రస్తుతానికి కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనికి కారణం.. పీఎం ఈ డ్రైవ్‌ పథకంలో విద్యుత్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాల విషయంలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఇంకా చేరుకోకపోవడమేనని అంటున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కనీసం మరో ఆర్థిక సంవత్సర కాలం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు భావిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ద్విచక్ర వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదని వాహనరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీఎం ఈ డ్రైవ్‌ పథకం కింద విద్యుత్‌ ద్విచక్ర వాహన విభాగంలో సబ్సిడీలు ఇవ్వడం ద్వారా 25 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగేలా చూడాలని టార్గెట్‌ పెట్టుకోగా ఇప్పటివరకు 18.3 లక్షల వాహనాలే అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 23 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఆ లక్ష్యం పూర్తి కాగానే ద్విచక్ర విద్యుత్‌ వాహనాలకూ సబ్సిడీ నిలిచిపోనుంది. ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లను సబ్సిడీల ద్వారా ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం భారీ వాహన రంగానికి అంటే.. ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల, వ్యానులకు మాత్రం పీఎం ఈ డ్రైవ్‌ పథకాన్ని ఇంతవరకు పూర్తిస్థాయిలో వర్తింపజేయలేదు. ఆ వాహనాలు ఇంకా ప్రయోగాల దశలోనే ఉండటం దీనికి కారణంగా భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే మాత్రం దేశంలో 14 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు, 5,643 ట్రక్కులకు కేంద్రం వివిధ రూపాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పీఎం ఈ డ్రైవ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం వెనుక ఉద్దేశాలు, లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశంలో నానాటికీ పెరుగుతున్న వాహనాలు వెదజల్లుతున్న వాయు, శబ్ద కాలుష్యాలని నియంత్రించి వాతావరణాన్ని పరిరక్షించడం, అలాగే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం పెరగడం తత్ఫలితంగా వాటిని పెద్ద ఎత్తును దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం మన దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలపై పెనుభారం పడుతోంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే ఇంధన ఆధారిత వాహనాలకు ప్రత్యామ్నాయం విద్యుత్‌ వాహనాలేనని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌(పీఎల్‌ఐ), ఫేమ్‌ (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) వంటి పథకాల ద్వారా విద్యుత్‌ వాహన తయారీరంగానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరోవైపు అలాగే సంప్రదాయ ఇంధన వాహనాలు కాకుండా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసేలా వినియోగదారుల ను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఈ డ్రైవ్‌(పీఎం ఈ డ్రైవ్‌) పథకాన్ని 2024 మార్చి ఒకటో తేదీన ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యుత్‌ త్రిచక్ర వాహనాలకు దాని ధరను బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. అలాగే ద్విచక్ర వాహనాలకు సైతం వాహన శ్రేణని బట్టి ధరలో కొంత సబ్సిడీ, రిజిస్ట్రేషన్‌ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు అమలు చేస్తూ వచ్చారు. వీటిలో త్రిచక్ర వాహనాల లక్ష్యం చేరుకున్నందున సబ్సిడీ నిలిపివేయడం వల్ల ప్రధానంగా ఆటో కార్మికులు ప్రభావితులవుతారు. త్రిచక్ర వాహన రంగంలో ప్యాసింజర్‌, గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలే ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. కేంద్రం నిర్ణయం ఈ రంగానికి ఇబ్బందికరమే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page