కొత్త కార్డుల సంతోషం సగమే!
- BAGADI NARAYANARAO
- Aug 7
- 2 min read
వాటికి జిల్లాలో అందిన దరఖాస్తులు ఏడువేలుపైనే
ఆమోదం పొందినవాటి సంఖ్య 4903 మాత్రమే
కార్డు స్ప్లిట్‌కు అవకాశం లేక చాలామంది నిరాశ
మార్పులు, చేర్పులకు మొత్తం 72,512 దరఖాస్తులు

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేయడంతో జిల్లాలో ఎన్ని కొత్త కార్డులు మంజూరుయ్యాయన్న ఆసక్తి పెరిగింది. దరఖాస్తు చేసుకున్నవారు దాని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లాలో కొత్త కార్డులకు అందిన దరఖాస్తుల్లో సగానికి కాస్త ఎక్కువ మాత్రమే ఓకే అయ్యాయని అధికారవర్గాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. దీనికి ముందు ప్రస్తుత కార్డుల్లో మార్పులు, చేర్పులు, విభజనతోపాటు కొత్త కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా కొత్త తెల్లకార్డుల కోసం 7,192 దరఖాస్తులు అందాయి. కానీ వాటిలో 4,903 దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. మరోవైపు 45 మంది మాత్రమే తెల్లకార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ ఏడాది మే ఏడో తేదీ నుంచి బియ్యం కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ హౌస్ హోల్డ్ స్ప్లిట్‌కు.. అంటే ఒకే కుటుంబంలోని సభ్యులు పెళ్లి చేసుకోవడం, వాటాలు వేసుకుని విడిపోయి వేరు కాపురాలు పెట్టిన వారు ఉమ్మడి కుటుంబం నుంచి తమ పేర్లు తొలగించి.. కొత్త కార్డులు పొందేం ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది కొత్త కార్డులకు నోచుకోలేకపోయారు. వైకాపా హయాంలో 2023లో నిర్వహించిన హౌస్ హోల్డ్ సర్వేను ఆధారంగా చేసుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుండటం కూడా కొత్త కార్డుల మంజూరుకు కొంత ప్రతిబంధకంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పు, రైస్‌కార్డు విభజన, కార్డు సరెండర్, ఆధార్ సరిచేయడం వంటి అంశాలకూ అవకాశం కల్పించడంతో సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అందిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులైన వారి జాబితాలను తహశీల్దార్లు తమ లాగిన్ నుంచి ప్రభుత్వానికి పంపించడంతో ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది.
ఆనందం ఆవిరి
జిల్లాలో మొత్తం 6,57,758 బియ్యం కార్డులు ఉన్నాయి. వీటిలో సుమారు 19.50 లక్షల మంది (యూనిట్లు) సభ్యులు ఉన్నారు. బియ్యం కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసిన తర్వాత అనర్హులను గుర్తించడం తేలికైంది. అలాగే ఈకేవైసీ నిర్వహించని వారికి రేషన్ నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల రేషన్‌కార్డుల సంఖ్యలో మార్పు లేకపోయినా యూనిట్ల విషయంలో వేలల్లో మార్పు ఉండవచ్చని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. కాగా వైకాపా హయాంలో ఒక్కసారి మాత్రమే తెల్లకార్డుల జారీ ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్త కార్డులతోపాటు తెల్లకార్డుల్లో చేర్పులు, మార్పులు, సవరణలకూ అవకాశం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా కార్డులు జారీ చేయాలని నిర్ణయించడంతో వాటి కోసమే ఎదురుచూస్తున్న వారు సంతోషించారు. ఆ మేరకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డుల కోసమే కాకుండా చిరునామా మార్పు, కార్డులో చేర్పులు, ఆధార్‌లో తప్పుల సవరణ, కొత్తగా యూనిట్ల చేర్పులు, యూనిట్ల తొలగింపు, యూనిట్లు స్ల్పిట్, కార్డులు సరెండర్‌కు జిల్లాలో 72,512 దరఖాస్తులు వచ్చాయి.
ఇంకా ప్రకటించని అధికారులు
కేటగిరీవారీగా చూస్తే.. తెల్లకార్డు కోసం 7,192 మంది దరఖాస్తు చేయగా 4,903 దరఖాస్తులను ఆమోదించి 2013 తిరస్కరించారు. మిగతా 276 దరఖాస్తులను పెండిరగ్‌లో పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న 45 మంది తమ తెల్లకార్డులను ప్రభుత్వానికి స్వాధీనపరిచారు. చిరునామా మార్పులకు 1,438 దరఖాస్తులు అందగా 1,433 అర్జీలను ఆమోదించి.. ఐదింటిని తిరస్కరించారు. కుటుంబ వివరాల మార్పునకు 1207 దరఖాస్తులు రాగా 871కి అప్రూవల్ లభించింది. 334 దరఖాస్తులను పెండిరగ్‌లో పెట్టి రెండిరటిని తిరస్కరించారు. కార్డుల్లో ఆధార్ తప్పులను సరిచేయాలని 1171 మంది దరఖాస్తు చేయగా 979 అప్రూవ్ చేసి మిగతావాటిని తిరస్కరించారు. కార్డులో పేర్లు చేర్చాలంటూ 50,671 దరఖాస్తులు రాగా 41,232 మందిని చేర్చి మిగతా వాటిని తిరస్కరించి కొన్నింటిని పెండిరగ్‌లో పెట్టారు. యూనిట్ల తొలగింపునకు 1485 దరఖాస్తులు అందగా 1267 అర్జీలకే ఆమోదం లభించింది. కార్డు విభజనకు 8,209 మంది దరఖాస్తు చేయగా 6,513 ఆమోదించి 1145 తిరస్కరించి, 551 పెండిరడ్‌లో పెట్టారు. వీటి ఆధారంగా రూపొందించిన కొత్త స్మార్ట్ కార్డులను ఈ నెల 25 నుంచి పంపిణీ చేయనున్నారు. అయితే మొత్తంగా జిల్లాలో కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారన్నది అధికారులు ఇంకా వెల్లడిరచకపోయినా కొత్త కార్డులతోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ చేస్తారని పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Comentários