top of page

కందకం తవ్వుతారా?.. ఖబడ్దార్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 28
  • 2 min read
  • సానివాడ బరాటం చెరువు ఆక్రమణలో ట్విస్ట్‌

  • ఆక్రమణలు తొలగించి కందకం తవ్వకానికి ఆదేశాలు

  • పనులు చేపట్టేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడికి యత్నం

  • కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవోనే నిలదీసిన అక్రమార్కులు

  • పోలీసు రక్షణతో పనులు చేపట్టాలని అధికారుల నిర్ణయం

    ree

కబ్జాదారుల గుప్పిట్లో చిక్కుకున్న సానివాడ చెరువు వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ చెరువును కొందరు అక్రమించి, ఆయకట్టు భూములకు నీరు అందకుండా చేస్తున్నారని గతంలోనే ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లగా.. సదరు చెరువు కబ్జాకు గురైన వైనంపై కొద్దిరోజుల క్రితమే ‘సత్యం’ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఈ ఫిర్యాదులకు స్పందించిన ఆక్రమణలు తొలగించి, చెరువుకు రక్షణగా చుట్టూ కందకం తవ్వించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను కూడా అక్రమార్కులు అడ్డుకుంటున్నారని తెలిసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఏకమై చెరువును చెరబడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గార, శ్రీకాకుళం రెవెన్యూ మండలాల పరిధిలో విస్తరించి అంపోలు రెవెన్యూ సర్వే నెంబర్‌ 199లో ఉన్న బరాటం చెరువు పూర్తి విస్తీర్ణం 19.53 ఎకరాలు కాగా ప్రస్తుతం 9.50 ఎకరాలు మాత్రమే మిగిలాయి. దీనిపై సానివాడ సర్పంచ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు సుమారు 9.76 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించి, చెరువును కాపాడేందుకు వీలుగా దాని చుట్టూ కందకం తవ్వడానికి ప్రతిపాదనలు రూపొందించి పంపగా.. కలెక్టర్‌ ఆమోదించి కందకం తవ్వకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆ మేరకు ఉపాధి హమీ పథకం కింద కందకం పనులు చేపట్టడానికి ఈ నెల 24న ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడితో పాటు వేతనదారులు వెళ్లారు. అయితే అక్కడ ఆక్రమణదారులు అడ్డుకొని దాడికి ప్రయత్నించడంతో వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై శ్రీకాకుళం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పనులు చేపట్టేందుకు వెళ్లే ఉపాధి హామీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరుతూ గార తహసీల్దారుకు, పోలీసులకు లేఖ రాశారు. అయితే ప్రోటోకాల్‌ కారణంగా చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతోందని మండల అధికారులకు పోలీసులు చెబుతున్నారు.

పనులపై అభ్యంతరాలు

బరాటం చెరువుకు వచ్చే నీటిని చుట్టుపక్కల ఆరు చెరువులకు మళ్లించడం ద్వారా 728 ఎకరాలకు సాగునీరు అందించేవారు. అయితే ఆక్రమణల కారణంగా ఆయకట్టు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయింది. ఆక్రమణలను తొలగించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలే అడ్డుకుని.. ఆక్రమణదారులకు తెర వెనుక మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఆక్రమణలు తొలగించడానికి పోలీసుల రక్షణ కల్పించాలని కోరడంపై శ్రీకాకుళం సానివాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు నేరుగా ఎంపీడీవోనే నిలదీసినట్లు తెలిసింది. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి న ఆ ఇద్దరు గార రెవెన్యూలో ఉన్న చెరువులో పనులను శ్రీకాకుళం అధికారులు ఎలా మంజూరు చేస్తారని నిలదీస్తూ తమ స్వాధీనంలో ఉన్న చెరువు భూముల్లో పనులు జరగనిచ్చేదిలేదని అన్నట్లు తెలిసింది. దాంతో ఎంపీడీవో కూడా ఘాటుగా స్పందించి వారిద్దరినీ తీవ్రంగా హెచ్చరించి పంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో కూడా సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు చెరువును సర్వే చేస్తున్న గార తహసీల్దారును శ్రీకాకుళం బౌండరీలో ఉన్న చెరువును మీరెందుకు సర్వే చేస్తున్నారంటూ అక్రమార్కులు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. శ్రీకాకుళం ఎంపీడీవో నుంచి ఉపాధి పనులు చేయడానికి ఈసీ తీసుకువస్తే అభ్యంతరం లేదని, అయితే కలెక్టర్‌ ద్వారా కందకం తవ్వడానికి ఇచ్చిన ఉత్తర్వులను మాత్రం అంగీకరించేది లేదంటున్నారు. గార బౌండరీలో ఉంది కాబట్టి ఎంపీడీవో ఉపాధి పనులు మంజూరు చేయాలని, లేదంటే అడ్డుకుంటామని పేచీ పెడుతున్నారని తెలిసింది.

సర్పంచ్‌పై రాజకీయంగా ఒత్తిడి

ప్రస్తుతం గ్రామంలో ఇదే చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులు చెరువును ఆక్రమించి అందరినీ ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారుల సమీప బంధువులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉండటం వల్లే వారు రెచ్చిపోతున్నారని తెలిసింది. కాగా ఆక్రమణదారుల్లో ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. వీరంతా కలసి రాజకీయ అండతో చెరువులో ఆక్రమణల తొలగింపును అడ్డుకుంటున్నారని ప్రచారంలో ఉంది. ఆక్రమణలను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని గ్రామ సర్పంచ్‌ రుప్ప లక్ష్మిపై వారంతా రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో టీడీపీ నాయకులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. చెరువులో ఆక్రమణలు తొలగించాలని నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగిన సర్పంచ్‌ లక్ష్మి టీడీపీ మద్దుతుదారు అయినా ఆ పార్టీలో ఆమెను సమర్ధించే వారికంటే వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణల వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల్లో చిత్తశుద్ధి, అధికారుల్లో నిబద్ధత ఉంటే ఈ ప్రక్రియ సజావుగానే సాగిపోతుందని స్థానికులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page