top of page

కొందరి గుత్తాధిపత్యం.. వ్యవస్థలకు గ్రహణం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇండిగో సంక్షోభం

  • టెలికాం, ఫిన్‌టెక్‌, ఈ కామర్స్‌ రంగాల్లోనూ అదే ధోరణి

  • పోటీ, ప్రత్యామ్నాయం లేకపోతే ఇష్టారాజ్యమే

  • దీన్ని అరికట్టాలని ప్రజల డిమాండ్లు

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

భారత విమానయాన రంగంలో అనూహ్య సంక్షోభానికి కారణమైన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మెడలు వంచుతున్నామని, ఆ సంస్థకు అనుమతి ఇచ్చిన సర్వీసుల్లో ఐదు శాతం మేరకు కోత విధిస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. కానీ దేశంలోని ఆయా రంగాల్లో గుత్తాధిపత్యం వహిస్తున్న సంస్థల మెడలు వంచడం అంత ఈజీ కాదని.. పైగా కేంద్రమే వాటి ఒత్తిళ్లకు లొంగిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ ప్రస్తుత సంక్షోభ సృష్టికర్త ఇండిగోకు అనుకూలంగా ఎఫ్‌డీటీఎల్‌ (ఫ్లైట్‌ డ్యూటీ టైమింగ్స్‌ లిమిటేషన్‌) నిబంధనలనే కేంద్రం సడలించడమే. ఇండిగోపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న డీజీసీఏనే నిబంధనలను సడలించడమంటే ఆ సంస్థతో రాజీపడటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌లో కాస్త రిలీఫ్‌ ఇవ్వాలని ఇండిగో కోరడమే ఆలస్యం.. ఎయిర్‌లైన్స్‌ పైలట్ల విధులకు సంబంధించి డీజీసీఏ మార్పులు చేసేసింది. అయితే ఇవి తాత్కాలికమేనని చెబుతుండటం విశేషం. కొత్త నిబంధనల్లో పైలట్లకు వీక్లీ రెస్ట్‌ టైమ్‌ 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. సవరించిన నిబంధనల్లో వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. వాస్తవానికి దీన్ని సెలవుగా పరిగణించే అవకాశం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సిన ఒక ప్రైవేట్‌ సంస్థ వాటిని ఖాతరు చేయకుండా సంక్షోభం సృష్టించడమే కాకుండా.. తనకు అనుకూలంగా తాత్కాలికంగానైనా సరే నిబంధనలనే సడలింపజేసుకోగలగడానికి ముఖ్యకారణం పౌర విమానయాన రంగంలో దాని గుత్తాధిపత్యమే. ఈ రంగంలో ఏకంగా 61 శాతం సర్వీసులు ఇండిగో చేతుల్లోనే ఉండటం వల్ల ఆ సంస్థ తాను చెప్పిందే జరగాలన్నట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి గుత్తాధిపత్య ధోరణి విమానయాన రంగంలోనే కాకుండా ఇంకా అనేక రంగాల్లో పాతుకుపోయింది.

పోటీ లేకపోతే ఇంతే సంగతులు

ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి. అది ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే అత్యున్నత ప్రమాణాలతో కూడాని సేవలు ప్రజలకు అందుతాయి. పోటీ లేకపోతే గుత్తాధిపత్యం పెరుగుతుంది. ఆయా సంస్థల ఇష్టారాజ్యమే సాగుతుంది. ఆదాయం వాళ్లకు.. ఆయాసం ప్రజలకు అన్న తీరులో పరిస్థితి దిగజారిపోతుంది. భారతీయ విమానయాన రంగంలో ఇండిగోది అటువంటి గుత్తాధిపత్యమే. అదే ఏవియేషన్‌ మార్కెట్‌ డైనమిక్స్‌ను మార్చేసింది. గుత్తాధిపత్యం (మోనోపలి) వల్ల తలెత్తే దుష్పరిణామాలను తన నిర్వాకంతో ఇండిగో ప్రపంచమంతటికీ కళ్లకు కట్టినట్లు చూపించింది. ఫలితంగా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సంక్షోభంలో విమానయాన రంగాన్ని నియంత్రించే డీజీసీఏ తీసుకున్న చర్య అత్యంత చర్చనీయాంశమైంది. ఇండిగో తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు వీలుగా తాత్కాలికంగా ఎఫ్‌డీటీఎల్‌ రూల్స్‌ను సడలించింది. అలా చేయకపోతే భారతీయ ఏవియేషన్‌ సిస్టమ్‌ మొత్తం స్తంభించిపోతుంది. ఎందుకంటే మిగతా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు మొత్తం భారతీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ను నడిపే పరిస్థితిలో లేవు. అందువల్ల తప్పనిసరిగా ఇండిగోకు అనుకూలంగా నిబంధనలను సడలించక తప్పలేదు. ప్రజలకు సేవలందించే రంగాల్లో ఆరోగ్యకరమైన పోటీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు నొక్కిచెబుతున్నాయి. కానీ ఇప్పటివరకు మన పాలకులు దీనికి విరుద్ధంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను నీరుగార్చి ఒకటిరెండు ప్రైవేటు సంస్థలనే ప్రోత్సహిస్తూ ఏకఛత్రాధిపత్యానికి బాటలు వేయడమే ఇండిగో తరహా సంక్షోభాలకు కారణమవుతుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఫణంగా పెట్టి..

టెలికాం రంగంలో గతంలోనే ఇలాంటి దుస్థితి తలెత్తింది. ఈ రంగంలో సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ విప్లవం వచ్చిన తొలినాళ్లలో మొబైల్‌, కంప్యూటర్‌ వినియోగదారులకు ఎన్నో నెట్‌వర్క్స్‌ అందుబాటులో ఉండేవి. కానీ వాటన్నింటినీ అణగదొక్కి జియో, ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్స్‌ మాత్రమే ప్రస్తుతం మార్కెట్‌ లీడర్స్‌గా కొనసాగుతున్నాయి. ఈ రెండు సంస్థలకే కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వొడాఫోన్‌, ఐడియా కలిసి ఒకే సంస్థగా మారినా ఫలితం కనిపించ లేదు. ఇప్పుడు ఆ సంస్థ ఉందో లేదో కూడా తెలియదు. ఇక ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సంగతి సరేసరి. ఒకప్పుడు ఈ సంస్థే చౌక ప్లాన్‌లతో ఈ రంగంలో అగ్రగామిగా ఉండేది. కానీ ప్రభుత్వం దీన్ని ఎప్పటికప్పుడు దీని సేవలను అప్‌గ్రేడ్‌ చేయకుండా ఉపేక్షించడం వల్ల దేశంలోని ఇంకా చాలా ప్రాంతాలకు 4జీ సేవలు కూడా అందించలేని దుస్థితిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉంది. కానీ ఇదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు 5జీ సేవలకు విస్తరించడమే కాకుండా త్వరలోనే 6జీ నెట్‌వర్క్‌ అందించే దిశగా సాగుతున్నాయి. తద్వారా కస్టమర్లను పెంచుకుంటూ పోతున్నాయి. అదే సమయంలో ప్లాన్‌ టారిఫ్‌లను కూడా ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నాయి.

ఇతర రంగాల్లోనూ..

ఈ-కామర్స్‌ సంస్థల్లోనూ ఇండియాలో కేవలం రెండు సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. మార్కెట్‌లోకి ఎన్ని ఈ-కామర్స్‌ సైట్లు అందుబాటులోకి వచ్చినా డామినేషన్‌ మాత్రం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలదే. జనం వాటిలో కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే.. మరో ప్రత్యామ్నాయ ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌పై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఏదైనా మొబైల్‌ కొనాలంటే.. ఆ సైట్లలో మాత్రమే తక్కువ ధరకు దొరుకుతోంది. మిగతా సైట్లలో అదే మొబైల్‌ పై ఆఫర్లు కనిపించవు. దానివల్ల.. కస్టమర్లు అంతా.. ఈ రెండు యాప్స్‌ మీదే ఆధారపడాల్సి వస్తోంది.

ఫిన్‌టెక్‌ సంస్థల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించి ఎన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నా మార్కెట్‌లో ఫోన్‌పే, పేటీఎం మాత్రమే ట్రెండిరగ్‌లో ఉంటున్నాయి. ఈ రెండు యాప్స్‌నే ఎక్కుగా వినియోగిస్తుంటారు. సడన్‌గా ఏదో ఒక రోజు వీటిలో సర్వర్‌ డౌన్‌ అయితే.. ఇక అంతే సంగతి. దేశవ్యాప్తంగా వందల కోట్ల లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటికప్పుడు మరో ఫిన్‌టెక్‌ యాప్‌కి మారేంత టైమ్‌ ఉండదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందువల్ల ఏ రంగంలోనైనా సరే పోటీతత్వం కచ్చితంగా ఉండాలి. అన్ని రకాలు సేవలు.. అందరికీ అందుబాటులో ఉండాలి. తగిన ప్రత్యామ్నాయాలు, నచ్చినవాటిని ఎంచుకునే సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పుతిన్‌ను ఫాలో అయితే మేలు

డీజీసీఏ నిబంధనలను పాటించకుండా ప్రభుత్వానికే సవాల్‌ విసిరేలా ప్రవర్తించిన ఇండిగో విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ సంస్థ ఒత్తిళ్లకు లొంగకుండా పవర్‌ చూపించాల్సిన అవసరముందంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే ఇండిగో క్రైసిస్‌ ఏర్పడటాన్ని ప్రస్తావిస్తూ 2009లో అదే పుతిన్‌ తన అధికారాన్ని చూపించినట్లే ఇండిగో విషయంలో భారత్‌ వ్యవహరించాలని కోరుతున్నారు. 2009లో ఏం జరిగిందంటే.. రష్యాలోని పికల్యోవో నగరంలో బిలియనీర్‌ ఒలెన్‌ డెరివాస్కా యాజమాన్యంలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ యాజమాన్యం తన కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారంతా ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి హైవేలను బ్లాక్‌ చేశారు. ఆ సమయంలో రష్యా ప్రధానిగా పుతిన్‌ హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకుని మీడియా కెమెరాల సాక్షిగా ఒలెన్‌ డెరివాస్కాపై మండిపడ్డారు. కార్మికులకు అనుకూలంగా రూపొందించిన ఒక ఒప్పంద పత్రాన్ని అతనిపైకి విసిరికొట్టి దానిపై సంతకం చేయాలని హెచ్చరించారు. దాంతో డెరివాస్కా వణుకుతూ సంతకం చేశారు. ప్రభుత్వం, దాని అధినేతలు తలచుకుంటే ఎంతటి శక్తివంతమైన వారినైనా మెడలు వంచవచ్చని నిరూపించిన ఘటనగా నిలిచింది. ఇప్పుడు అదే రీతిలో భారత ప్రభుత్వం ఇండిగో మెడలు వంచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page