top of page

హిమాలయాల కింద టైంబాంబు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • భూకంపాల హైరిస్క్‌ జోన్‌లో ఈ పర్వత ప్రాంతాలు

  • అక్కడ భూమి కంపిస్తే చుట్టుపక్కలంతా ప్రళయమే

  • దేశంలో 61 శాతం ప్రాంతం ప్రమాదకర జోన్‌లోనే

  • తెలంగాణ మొత్తం సేఫ్‌.. ఏపీలో సగం సగం

  • తాజా సిస్మిక్‌ మ్యాప్‌ ప్రకారం పెరిగిన ముప్పు

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మనదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను భారత్‌కు పెట్టని కోటలుగా భావిస్తుంటాం. ప్రకృతిపరంగా, ఇరుగుపొరుగు శత్రు దేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం కాపాడుతున్న ఈ మంచు ఖండం ఇకమీదట ఏమాత్రం రక్షణ కల్పించకపోగా కొత్త ప్రమాదాలు సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వతప్రాంతమంతా భూకంపాల జోన్‌లో ఉన్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ హిమవత్పర్వతాలు, హిమాలయ రాష్ట్రాల టైంబాంబు మీద ఉన్నాయని, అది ఎప్పుడు పేలినా అపార జన, ఆస్తి నష్టం తప్పదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సిస్మిక్‌ జోనేషన్‌ లేదా మ్యాప్‌ స్పష్టం చేస్తోంది. ఈ మ్యాప్‌ ప్రకారం దేశంలో 75 శాతం ప్రాంతాలు, ప్రజలకు భూకంపాల ప్రమాదం ఉన్నట్లు తేలింది. ఇందులోనూ 59 నుంచి 61 శాతం భూభాగం మధ్యస్థం నుంచి అధిక ప్రమాదకర జోన్‌ పరిధిలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు తాజా అధ్యయనాలు, సవరణలతో కూడిన కొత్త సిస్మిక్‌ మ్యాప్‌ను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) రూపొందించింది. ఇప్పటివరకు మనదేశంలో మొత్తం ఐదు భూకంప జోన్లు ఉండగా ఇప్పుడు కొత్తగా ఆరో జోన్‌ ఏర్పాటు చేశారు.

ప్రమాదకరంగా హిమాలయ ప్రాంతం

భూకంపాల తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాలను ఈ కొత్త జోన్‌లో చేర్చారు. మొత్తం హిమాలయ రీజియన్‌ను ఈ డేంజరస్‌ జోన్‌లో చేర్చారు. గతంలో ఇవి జోన్‌ 4, 5గా విడిపోయి ఉండేది. మారిన భౌగోళిక పరిణామాల నేపథ్యంలో మొత్తం హిమాలయ ప్రాంతాన్ని తీసుకెళ్లి అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించే జోన్‌ 6లో చేర్చారు. ఎందుకంటే భూమిపై అత్యంత చురుకైన టెక్టోనిక్‌ ప్లేట్లు హిమాలయ ప్రాంతాల్లోనే కలుసుకుంటున్నాయి. భారతీయ ప్లేట్‌ యురేషియా ప్లేట్‌లోకి ఏడాదికి ఐదు సెంటీమీటర్ల వేగంతో చొచ్చుకుపోతున్నది. ఈ ఘర్షణ భూమి లోపలి పొరల్లో తీవ్ర ఒత్తిడి సృష్టిస్తున్నది. ఆ ఒత్తిడి అకస్మాత్తుగా విడుదల అయినప్పుడు అది శక్తిమంతమైన భూకంపాలకు దారితీస్తుంది. ఇటువంటి బలమైన కదలికల కారణంగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడి ఇప్పటికీ ఇంకా పైకి పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా కూడా చాలా కొత్తది. అంటే అక్కడి శిలలు ఇంకా సర్దుబాటు దశలోనే ఉన్నాయి. దీనివల్ల పర్వతాలు మరింత అస్థిరంగా మారుతుంటాయి. మెయిన్‌ ఫ్రంటల్‌ థ్రస్ట్‌, బౌండరీ థ్రస్ట్‌, సెంట్రల్‌ థ్రస్ట్‌ లాంటి అనేక ప్రధాన ఫాల్ట్‌ వ్యవస్థలు ఈ పర్వతశ్రేణి కింద ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి పెను భూకంపాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని భూభౌతిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పాత మ్యాప్‌లు మధ్య హిమాలయాల్లో పొంచి ఉన్న ప్రమాదాలను తక్కువగా అంచనా వేశాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలోని అనేక ఫాల్ట్‌ లైన్ల వద్ద సుమారు 200 ఏళ్లుగా భారీ భూకంపాలు సంభవించలేదు. దీన్ని ‘సిస్మిక్‌ గ్యాప్‌’ అని వ్యవహరిస్తారు. ఈ దీర్ఘకాలిక గ్యాపే అక్కడ భారీ భూకంపం వచ్చే ప్రమాదాన్ని పెంచిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఏ సమయంలోనైనా 8.5కు పైగా పాయింట్ల తీవ్రతతో భూకంపం రావచ్చని చెబుతున్నారు. హిమాలయాల్లో భారీ భూకంపం సంభవిస్తే.. మంచు కరిగి, అక్కడి నదులు ఉప్పొంగి వాటి పరిసర రాష్ట్రాలు, జనావాసాల్లోనూ సర్వం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.

సేఫ్‌ జోన్‌లో మూడు రాష్ట్రాలే

తాజా మ్యాప్‌లో హిమాలయన్‌ ఫ్రంటల్‌ థ్రస్ట్‌ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల డెహ్రాడూన్‌ లాంటి ప్రాంతాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగినట్లు గుర్తించారు. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి (జమ్మూకాశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు) అత్యధిక ప్రమాద జోన్‌లో చేరింది. డెహ్రాడూన్‌, హరిద్వార్‌, రిషికేష్‌, నైనిటాల్‌, శ్రీనగర్‌, షిల్లాంగ్‌, ఐజ్వాల్‌, కోహిమా తదితర ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాలన్నీ అత్యంత ప్రమాదకర జోన్‌లోనే చేరాయి. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, యూపీ, హిమాలయ పర్వతశ్రేణి కిందున్న అన్ని ప్రాంతాలు హైరిస్క్‌లో ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే తెలంగాణ అతి తక్కువ భూకంప ప్రమాదాన్ని సూచించే జోన్‌ 2లో ఉంది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తెలంగాణ కంటే కొంత ఎక్కువ రిస్క్‌లో ఉంది. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు జోన్‌ 2లో, మరికొన్ని ప్రాంతాలు జోన్‌ 3లో ఉన్నాయి. తెలంగాణతోపాటు చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలు మాత్రమే సేఫ్‌ జోన్‌లో ఉన్నాయి.

కొత్త మ్యాప్‌తో హై అలర్ట్‌?

కొత్త సీస్మిక్‌ మ్యాప్‌ ఆధారంగా దేశంలో భౌగోళిక, శాస్త్రీయ అధ్యయనాల ప్రాథమ్యాలను మార్చుకోవాల్సిన అవసరముంది. అతి ప్రమాదకర ప్రాంతాల్లో బిల్డింగ్‌లు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేటప్పుడు మరింత కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. జోన్‌ 6లోని పాత భవనాలను భూకంప నిరోధకంగా మార్చడం, మృదువైన నేల, క్రియాశీలక ఫాల్టీ భూముల్లో కొత్త నిర్మాణాలను నిలిపివేయడంతోపాటు పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భూకంప నిరోధక శక్తిని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా విపత్తు నివారణ సంసిద్ధతను పునఃసమీక్షించి తాజా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది.

ఏ జోన్‌లో ఏ రాష్ట్రం ఉందంటే..

తాజా అధ్యయనాలు, సవరించిన అంచనాల ప్రకారం మొత్తం దేశాన్ని ఆరు జోన్లుగా వర్గీకరించారు.

  • జోన్‌- 2.. తెలంగాణ, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, గోవా (మొత్తం), ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు.

  • జోన్‌- 3.. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలు), మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తూర్పు భాగం, ఉత్తరప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు), దక్షిణ బీహార్‌, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు.

  • జోన్‌- 4.. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం, యూపీలోని హిమాలయ సమీప ప్రాంతాలు, ఉత్తర బీహార్‌, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సమీప ప్రాంతాలు, అసోంలోని కొన్ని ప్రాంతాలు, ఢల్లీి ఎన్సీఆర్‌

  • జోన్‌- 5.. అసోంలోని ప్రధాన ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, గుజరాత్‌లోని కొన్ని భాగాలు, అండమాన్‌ Ê నికోబార్‌ దీవులు

  • జోన్‌- 6.. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ లోని హిమాలయ పర్వత ప్రాంతాలు, లడఖ్‌ , సిక్కింలోని కొన్ని భాగాలు.

  • ఈ జాబితాలో లేని రాష్ట్రాలను భూకంపాల ముప్పు అసలు లేని జోన్‌-1లో ఉన్నట్లు లెక్క.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page