top of page

డీఎం చేతివాటం.. రైతుకు చేటుకాలం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read
  • లంచాలు మరిగి అన్నదాతకు అన్యాయం

  • డబ్బులు ఇవ్వని మిల్లర్లకు తక్కువ కోటా

  • గోనెసంచుల డబ్బులు నేరుగా మిల్లర్ల ఖాతాల్లోకి

  • కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ విఫలం

  • గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదులు

    ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రైతు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వారికి అండగా నిలవాల్సిన పౌరసరఫరాల సంస్థ మిల్లర్లతో కుమ్మక్కై తిరిగి రైతునే దోపిడీ చేస్తోంది. ఈ వ్యవహారంపై ‘చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా’ శీర్షికతో ఈ నెల ఆరో తేదీన ‘సత్యం’ ఒక కథనం కూడా ప్రచురించింది. కాగా సోమవారం గ్రీవెన్స్‌ సెల్స్‌కు అందిన రెండు ఫిర్యాదులు ‘సత్యం’ కథనాన్ని, అధికారులపై ఆరోపణలను బలపరుస్తున్నాయి.

లంచం ఇచ్చినవారికే ప్రాధాన్యం

జిల్లా పౌరసరఫరా సంస్థ డీఎం డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని సోమవారం గ్రీవెన్స్‌లో పోలాకి మండలం సుసరాం గ్రామానికి చెందిన శ్రీదుర్గా మోడ్రన్‌ రైస్‌మిల్లు యజమాని తమ్మినేని భూషణరావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బు ముట్టజెప్పినవారికి 80 శాతం టార్గెట్‌ ఇచ్చి సేకరణ కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వని వారికి 40 శాతానికి మించి ధాన్యం సరఫరా చేయడం లేదని ఆరోపించారు. గత ఏడాది ఒక్కో మిల్లు నుంచి రూ.వేలల్లో వసూలుచేసి మొదటి విడతలో టార్గెట్‌ ప్రకారం 80 శాతం ధాన్యాన్ని సరఫరా చేశారన్నారు. కానీ ఈ ఏడాది డబ్బులు ఇవ్వనందున ధాన్యం టార్గెట్‌ను 40 శాతానికి కుదించి 15,155 క్వింటాళ్లకు తగ్గించారని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చినవారికి మాత్రం 26,326 క్వింటాళ్ల టార్గెట్‌ వేస్తామని లేదంటే 40 శాతంతో సరిపెట్టుకోవాలని పౌరసరఫరాల సంస్థ అధికారులు స్పష్టం చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

అదనపు దోపిడీ

ఎనభై కేజీల ధాన్యం బస్తాకు అదనంగా నాలుగు కేజీలు ఇస్తే తప్ప మిల్లుర్లు ధాన్యం తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఏపీ రైతుసంఘం నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మిల్లు వద్దకు ధాన్యాన్ని తరలించే రైతుల నుంచి బస్తాకు రూ.20 అన్‌లోడ్‌ ఛార్జీల పేరుతో మిల్లర్లు తీసుకుంటున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు అందాల్సిన రవాణా చార్జీలను మిల్లర్ల ఖాతాలో జమ చేయడం భావ్యం కాదన్నారు. రైతులకు చెల్లిస్తున్నట్టు మిల్లర్లు చెప్పి వాటిని పౌరసరఫరాల సంస్థ నుంచి నేరుగా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులు బహిరంగ మార్కెట్‌లో గోనె సంచిని రూ.13కు కొనుగోలు చేస్తుంటే, పౌరసరఫరాల సంస్థ అధికారులు కేవలం రూ.5 మాత్రమే చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం

ధాన్యం కొనుగోళ్లలో రైతులు దగా పడటానికి పౌరసరఫరాల సంస్థ అధికారులు తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలు, అక్రమాలే కారణం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి డబ్బులు దండుకుంటూ పౌర సరఫరాల సంస్థ డీఎం రైతులకు అన్యాయం చేస్తున్నారని చాలాకాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. నవంబర్‌ 16 నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మూడు నెలల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధాన్యం సేకరణపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా 15 రోజులు ఆలస్యంగా.. అదీ నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయినా కొందరు మిల్లర్లు ఇప్పటికీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించలేదు.

సీసీఎల్‌ఏ నుంచి వచ్చి..

జలుమూరు, సారవకోట మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకముందే సుమారు 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే మిల్లర్లు తరలించుకుపోయారు. పౌరసరఫరాల సంస్థ అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం ఏడాదిపాటు సహాయ అధికారిగా పని చేయడానికి అమరావతి సీసీఎల్‌ఏ నుంచి వచ్చినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి అధికారిని బదిలీ చేయించి ఆయన స్థానంలో రెండేళ్లగా ధాన్యం కొనుగోలు వ్యవహారాలు చూస్తున్నారు. గత ఏడాది పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండానే టార్గెట్‌ పూర్తి చేసినట్టు చూపించి సంక్రాంతి తర్వాత నూర్పులు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర అధికారులతో మాట్లాడి రైతుల వద్ద మిగిలివున్న ధాన్యాన్ని కొనుగోలు చేయించారు. పౌరసరఫరాల సంస్థ డీఎం నిర్లక్ష్య ధోరణి, చేతివాటం కారణంగా ధాన్యం కొనుగోళ్లు గాడి తప్పాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ 360 మాత్రమే ప్రారంభించారు. 220 మంది మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. బ్యాంకు గ్యారెంటీలు సమర్పించని కొందరికి డబ్బులు తీసుకొని ధాన్యం సరఫరా చేశారని ఆరోపిస్తున్నారు. గత ఏడాది సీఎంఆర్‌కు ధాన్యం తీసుకున్న ముగ్గురు మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదు. అందువల్ల వీరిని ఈ ఏడాది సీఎంఆర్‌ నుంచి మినహాయించాలి. కానీ సంస్థ డీఎం మాత్రం వారి నుంచి డబ్బులు తీసుకొని సీఎంఆర్‌కు ధాన్యం సరఫరా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తరలించడానికి సాంకేతిక కారణాలను అధికారులు, మిల్లర్లు చూపిస్తున్నారు. దళారుల ద్వారా అడ్డదారిన తరలిస్తున్న వారికి మాత్రం అడ్డుచెప్పడం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page