కోనేరు విస్తీర్ణమెంత.. కొట్టేసిందెంత?
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
వరద గట్టు భూమి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
ఆక్రమణదారులకే కొమ్ముకాస్టున్న రెవెన్యూ సిబ్బంది
రోడ్డు విస్తరణ బాధితులకు అక్కడ స్థలాలు ఇవ్వాలని వినతి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో బలగ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1/5లో ఉన్న చెరువు అసలు విస్తీర్ణం ఎంత? అది ఎవరికి చెందుతుంది?? దాన్ని 74 సెంట్లగా ఎలా గుర్తించారన్నది??? తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సర్వే నెంబరులో ఉన్న మొత్తం భూమి ప్రభుత్వానికి చెందుతుందని స్థానికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ఆ ప్రాంతంలో భూమి ఉండే అవకాశం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా.. ప్రభుత్వ భూమేనని మాత్రం చెప్పడంలేదు. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది మాత్రం అది జిరాయితీయేనని వాదిస్తున్నారు. అయితే స్థానికుల వాదన మరోలా ఉంది. బలగకు చెందిన కొందరు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై ఆదివారంపేటకు చెందిన బోనెల చిరంజీవి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే.. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే జిరాయితీ భూమేనంటూ ఎండార్స్‌మెంట్ ఇచ్చేశారు. బలగ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే గొండు శంకర్‌కు నాగావళి వరదగట్టు ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదు చేయగా, స్పందించిన ఎమ్మెల్యే శంకర్ ఆ భూమి కచ్చితంగా ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు. జిరాయితీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో ఐదు దశాబ్ధాల క్రితం కోనేరు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. నాగావళికి వరద వచ్చే సమయంలో ఆ ప్రవాహం పట్టణంలోకి రాకుండా రక్షణ కోసం కోనేరు ఉన్న ప్రాంతంలో వరద గట్టును నిర్మించారు. దానికి ఆనుకుని ఉన్న శ్రీకాకుళం`ఆమదాలవలస నడక మార్గాన్ని తర్వాత ఆర్ అండ్ బీ రహదారిగా మార్చారు. ఈ రహదారికి, వరదగట్టుకూ మధ్య ఉన్న భూమి జిరాయితీ అని ఆక్రమణదారులు చెబుతున్నారు. జిరాయితీ అయితే వారసత్వంగా కాకుండా కొనుగోలు చేసినట్టు చూపించడం పైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విడ్డూరం ఏమిటంటే.. మరో 1/5 సర్వే నెంబర్‌లో ఉన్న కోనేరు భూమిని జిరాయితీగానూ.. దాని విస్తార్ణం 74 సెంట్లుగానూ చూపిస్తున్నారు. ఎస్‌ఎల్‌ఆర్ ప్రకారం అంతేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ భౌతికం(ఫిజికల్)గా 1/5లో రెండు ఎకరాలకు పైగా ఉంది. దీని లెక్క తేల్చాలని బోనెల చిరంజీవి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా రెవెన్యూ యంత్రాంగం స్పందించిన దాఖలాల్లేవు. దాంతో వరదగట్టు, శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డుకు చెందిన భూమి.. అంతా తమదేనని ఆక్రమణదారులు చెబుతున్నారు.
కంచెలు కట్టి.. ప్లాట్లు వేసి..
వరద గట్టుకు, శ్రీకాకుళం` ఆమదాలవలస రోడ్డుకు మధ్యలో ఉన్న భూమి ప్రభుత్వానిదేనంటూ 2023లో జిల్లా ఉన్నతాధికారులు అక్కడ బోర్డు పెట్టించారు. కానీ స్థానికంగా వైకాపా వర్గీయులుగా చెలామణీ అవుతున్న నలుగురు రౌడీమూకల సాయంతో బోర్డులు పీకించేసి చుట్టూ కంచె వేసేశారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది సహకారంతో దానికి పొజిషన్ సర్టిఫికెట్ ప్రయత్నించగా.. ఆ శాఖ అధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కంచె వేసిన భూమిలో 20 సెంట్లు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు, ఒక ఆర్మీ ఉద్యోగికి విక్రయించారు. మరికొందరి వద్ద అడ్వాన్సులు తీసుకున్నారు. తమకు అమ్మిన భూమికి హద్దులు చూపించాలని కొనుగోలుదారులు ఒత్తిడి తేవడంతో యంత్రాలతో చదును చేయించి రెండుచోట్ల హద్దులు వేసి ప్లాట్లుగా విడదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆక్రమణపై స్థానికులు ఎమ్మెల్యేకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన ఆక్రమణదారులు రాజకీయంగా రాజీ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో కొన్నాళ్లు మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించారు. తర్వాత వీలు చూసుకుని భూమిని సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నట్లుంది. 2022 వరకు ఈ భూమి తమదేనంటూ ఎవరూ ముందుకు రాలేదు. శ్రీకాకుళం` ఆమదాలవలస రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన వారికి పరిహారం లెక్కించే సమయంలో అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాతే దీనికి వారసులు పుట్టుకొచ్చారు. రీసర్వే సమయంలో ఆ భూమికి హక్కుదారులుగా చూపించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
స్థానికులకే ఇవ్వాలి
తాజాగా ఆదివారంపేట వద్ద శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయేవారికి ఈ భూమి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. పూర్వీకులు సర్వే నెంబర్ 1/5లో స్థానిక ప్రజల తాగునీటి అవసరాల కోసం కోనేరు నిర్మించినందున దీన్ని స్థానిక ప్రజల అవసరాలకే వినియోగించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే శంకర్ కూడా ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమి ప్రభుత్వానిదా? ప్రైవేట్ వ్యక్తులదా? అన్నది తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులదని తేలితే అది వారికి ఎలా సంక్రమించిందో పూర్తిగా పరిశీలించి తేల్చాలని సూచించారు. ఆలోగా భూమిని ఆక్రమించడానికే ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. కాగా సర్వే నెంబర్ 1/5లో భౌతికంగా రెండు ఎకరాలు ఉండగా, 74 సెంట్లే ఉన్నట్లు ఎస్‌ఎల్‌ఆర్‌లో ఎలా నమోదైందని రెవెన్యూ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.










Comments