కానివారిని బయటపెట్టిన యుద్ధం!
- DV RAMANA

- May 13, 2025
- 2 min read

అంతా బాగున్నప్పుడు అందరూ మంచిగానే కనిపిస్తారు. మన చుట్టూనే తిరుగుతూ మన క్షేమం కాంక్షిస్తున్నామన్నట్లు బిల్డప్‌లు ఇస్తుంటారు. కానీ కష్టకాలంలోనే అసలైన హితులెవరు.. ఎవరు అవసరార్థ స్నేహం చేస్తున్నారన్నది స్పష్టమవుతుంది. మనదేశం విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ఉగ్రవాదంపై పోరు నేపథ్యంలో పాక్‌తో జరిగిన పరిమిత యుద్ధంలో భారత్‌కు తన శత్రువులెవరో, మిత్రులెవరో బాగా తెలిసివచ్చింది. తాను ఎంతో సాయం చేసిన, తన దేశ టూరిస్టుల వల్ల ఎంతో ఆదాయం పొందుతున్న టర్కీ ఆపరేషన్ సింధూర్ మొదలైన మరుక్షణమే పాక్ పంచన చేరడం భారత్‌కు వెన్నుపోటుగా భావిస్తున్నారు. అలాగే అజార్‌బైజాన్‌ది కూడా ఇదే తీరు. భారత పర్యాటకుల వల్లే ఆ దేశానికి కూడా ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇకపోతే చైనా గురించి తెలిసిందే. మొదటినుంచీ పాక్ కొమ్ము కాస్తున్న ఆ దేశం ఈ ప్రస్తుత యుద్ధంలోనూ దానివైపే నిలబడిరది. అయితే పాక్‌కు చైనా ఇచ్చిన ఆయుధాలు బీ గ్రేడ్‌వి కావడం భారత్‌కు ఉపశమనం కలిగించేదే. తనవద్ద అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నా వాటిని ఇవ్వకపోడానికి పాక్‌ను పూర్తిగా నమ్మకపోవడమే కారణమంటున్నారు. అమెరికాతోనూ పాకిస్తాన్‌కు దోస్తీ ఉన్న విషయం డ్రాగన్‌కు తెలుసు. ఈ పరిస్థితుల్లో తన ఆయుధాలను పాక్‌కు ఇస్తే వాటి సాంకేతికత గురించి అమెరికాకు తెలిసిపోతుందని, దానికి మించిన టెక్నాలజీతో అమెరికా ఆయుధాలు తయారుచేస్తే తనకే ముప్పు అన్న భావనతోనే చైనా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. దీంతో పాక్‌కు చైనా ఎంత సాయం చేసినా దానివల్ల భారత్‌కు పెద్ద నష్టం ఏమీ ఉండదని ప్రస్తుత యుద్ధం వల్ల తెలిసి వచ్చింది. ఇక ట్రంప్ భారత్‌కు అనుకూలమని ఎంత అనుకున్నా పాక్ కోసం ఆయన పంచాయితీలకు సిద్ధమవుతారని తెలిసి వచ్చింది. గత అధ్యక్షుడు జోబైడెన్ పాక్‌కు అనుకూలుడన్న పేరు ఉంది. అందుకే ట్రంప్ అధ్యక్షుడు కావడంతో పాక్ ఉలిక్కిపడిరది. అందుకు తగినట్లే పదవి చేపట్టిన వెంటన ట్రంప్ పాక్‌కు ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టారు. కానీ సరైన సమయంలో భారత్ నుంచి యుద్ధ ముప్పు లేకుండా చేసి ట్రంప్ తన ద్వంద్వ వైఖరి బయటపెట్టారు. అలాగే కీలక సమయాల్లో అమెరికా వైఖరి ఎలా ఉంటుందో తెలిసివచ్చింది. అలాగే జీ`7 దేశాలు భారత్ పట్ల సానుకూలంగా ఉన్నా.. శాంతి జపమే చేస్తూ వచ్చాయి. అయితే ఏ పెద్ద ముస్లిం దేశం కూడా పాక్‌కు మద్దతుగా నిలవకపోవడం భారత్‌కు ఉపశమనం కలిగించే అంశం. ఇక పాకిస్తాన్ పరిస్థితి ‘సరకు తక్కువ చప్పుడు ఎక్కువ’.. అన్నది కూడా భారత్‌తో పాటు ప్రపంచం మొత్తానికి ఈ పరిమిత యుద్ధంతో తెలిసి వచ్చింది. అలా భారత్‌కు ప్రపంచంలో ఎవరేమిటి అన్నది బాగా ఈ పరిమిత యుద్ధంలో తెలిసివచ్చింది. ఉగ్రవాదంపై పోరులో టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు పాకిస్తాన్‌కు అండగా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆ రెండు దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో గానీ.. పర్యాటక సంస్థలు మాత్రం తమ వంతు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌కు మద్దతుగా నిలిచి టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు ట్రావెల్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ రెండు దేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ట్రావెల్ సంస్థలు సూచిస్తున్నాయి. అనివార్య పరిస్థితుల్లో ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వచ్చినా అక్కడి సున్నిత ప్రాంతాల్లో పర్యటించకుండా అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాయి. ప్రముఖ టూరిస్ట్ సర్వీస్ ప్రొవైడర్ కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ టర్కీ, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్లకు కొత్త బుకింగులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడిరచింది. మరో ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ కూడా అచ్చం ఇలాంటి సూచనలే చేసింది. ఈ రెండు దేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే ముందు తాజా ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ సంస్థ ఫౌండర్ నిషాంత్ ట్వీట్ చేశారు. అదే సమయంలో ట్రావోమింట్ అనే మరో ట్రావెల్ సంస్థ కూడా టర్కీ, అజర్‌బైజాన్లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడిరచింది. ఇప్పటికే చేసుకున్న బుకింగులను రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సిలేషన్ ఫీజులు వసూలు చేయబోమని ట్రావోమింట్ తేల్చి చెప్పింది. దీనివల్ల టర్కీ, అజర్‌బైజాన్ దేశాల ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.










Comments