కూనది కేవలం సిఫారసే.. ఏపీసీ చేసింది ‘ఫార్సే’!
- NVS PRASAD
- 4 days ago
- 4 min read
ఎమ్మెల్యేలు ఫిర్యాదులు పంపడం కామన్
వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది అధికారులే
విచారించకుండానే సౌమ్యపై కలెక్టర్‌కు ఏపీసీ ఫైల్
చేతులు కాలాక ఇప్పుడు ఎంక్వైరీ చేపడుతున్న వైనం
శశిభూషణ్ నిర్వాకంతో ఎమ్మెల్యే కూన రాజకీయానికి రిమార్క్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆయనకు రూల్స్ పెడితే నచ్చవు. వాటిని పాటించడానికి అస్సలు ఇచ్చగించరు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని.. నాకే చెబుతారా? అంటూ నానా యాగీ చేస్తారు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. ఎవరికైనా నిబంధనలు ఒకటే అని ఎవరైనా అంటే వారి మీదే అవాకులు, చవాకులు పోగేసి ఫిర్యాదులు చేస్తారు. విచారణ చేపట్టమని కోరుతారు. పోనీ ఫిర్యాదైనా నేరుగా చేస్తారా? అంటే.. అలా చేయరు. ఆకాశరామన్న పేరుతోనో, నకిలీ ఆర్టీఐ కార్యకర్త పేరుతోనో ఓ కాగితం పంపిస్తారు. తీరా విచారణకు వెళితే వీరెవరూ సంబంధిత అడ్రసుల్లో ఉండరు. సమగ్ర శిక్ష ఏపీసీ శశిభూషణ్‌కు ఈ అవలక్షణాలన్నీ అతికినట్లు సరిపోతాయి. ఆయనగారి ఈ తెంపరితనమే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ రాజకీయ జీవితంపై మరక పడేలా చేసింది. ప్రజాప్రతినిధిని వివాదంలోకి నెట్టింది. అధికారంలో ఉన్న నాయకులు సవాలక్ష సిఫార్సులు చేస్తారు. అందులోనూ తమ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగి తమ మాట వినడంలేదన్న దానికంటే ప్రత్యర్థి పార్టీ చెప్పినవి చేస్తున్నారన్న మాట చెవికెక్కితే మరింత బిగుసుకుపోతారు. వీటిని గుర్తించి సమస్యలు ఏర్పడినా సందర్భాల్లో సంయమనంతో సర్దుబాటు చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన ఒక విభాగాధిపతి లెక్కలేనితనంతో ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టారు. వివరాల్లోకి వెళితే..
గతంలో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల లెక్చరర్‌గా పని చేస్తున్నప్పుడు వ్యవహరించిన తీరుగానే ఏపీసీ అయిన తర్వాత శశిభూషణ్ వ్యవహరిస్తూ చేసిన నిర్వాకం వల్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సహజంగానే దుందుడుకు స్వభావం కలిగిన కూన రవికుమార్ లోలుగు (పొందూరు) కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య విషయంలోనూ అదే దుడుకుతనం ప్రదర్శించి ఉంటారన్న ఉద్దేశంతో దళిత సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఇక్కడే ఏపీసీగా శశిభూషణ్ నిబంధనలు ఫాలో అయ్యుంటే.. రూల్స్ ప్రకారం వ్యవహరించి ఉంటే ఎవరూ ప్రశ్నించే సాహసం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ తన లెక్కలేనితనం, పదవిని కాపాడుకునే యావలో ఆయన.. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు చేశారన్న ఒకే ఒక్క సాకుతో ఫైలు నడిపించి పొందూరు నుంచి కంచిలి కేజీబీవీకి సౌమ్యను బదిలీ చేస్తూ కలెక్టర్ ద్వారా ఆదేశాలిప్పించేశారు. దీంతో సౌమ్య తన బదిలీకి కూన రవికుమారే కారణమన్న ఆవేశంతో ఆయన మీదే ఆరోపణలు ఎక్కుపెట్టి.. దేనితో కొడితే నాయకులు తగ్గుతారో.. అదే ఆయుధాన్ని ప్రయోగించారు.
ఫిర్యాదుల ఆధారంగానే లేఖ
కజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై పేరెంట్స్ కమిటీతో పాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఎమ్మెల్యే అయిన తన సిఫార్సుల కంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మాటలకు ఎక్కువ విలువ ఇస్తున్నారన్న అభిప్రాయం కూన రవిలో ఉంది. కేజీబీవీలో సీట్లంటే వీఐపీ సీట్లన్నంత క్రేజ్ ఉంది. ఆరో తరగతిలో 40 సీట్లుంటే ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికి సీటు వచ్చింది, ఎవరికి రాలేదు అనేది విద్యార్థుల తల్లిదండ్రులకు ముందు తెలియదు. ప్రతి కేజీబీవీకి సంబంధిత జాబితా నేరుగా వెళ్లిపోతుంది. అక్కడి ప్రిన్సిపాల్ తలచుకుంటే రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో ఉన్న విద్యార్థులు చేరకపోవడం వల్ల ఆ సీట్లను ఆఫ్‌లైన్‌లో స్థానికంగా భర్తీ చేసుకుంటున్నామన్న సాకుతో కొందరు విద్యార్థులకు అవకాశం ఇవ్వొచ్చు. సరిగ్గా ఇటువంటి సీట్లకే స్థానిక నాయకుల నుంచి సిఫార్సు లేఖలు వస్తుంటాయి. అందరిలాగే కూన రవికుమార్ కూడా తన నియోజకవర్గ పరిధిలోని లోలుగు కేజీబీవీకి రికమెండ్ చేస్తూ కొందరు విద్యార్థులకు లేఖలిచ్చారు. కానీ తాను లేఖలు ఇచ్చిన వారికి కాకుండా ప్రతిపక్షానికి చెందిన నేత చెప్పిన కొందరికి సీట్లు వచ్చాయన్న విషయం కూన రవి దృష్టికి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో పేరెంట్స్ కమిటీ సభ్యులతో పాటు కొందరు పేరెంట్స్, అక్కడ పని చేస్తున్న సిబ్బంది ప్రిన్సిపాల్ సౌమ్యపై ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏపీసీ శశిభూషణ్‌కు లేఖ రాశారు.
ఎమ్మెల్యే సిఫార్సే సాకుగా..
అంతే.. ‘ఎద్దు ఈనిందంటే దూడను గట్టున కట్టేయండి’ అన్న చందంగా ఏపీసీ శశిభూషణ్ ముందూవెనకా చూడకుండా.. ఎమ్మెల్యే మెప్పు కోసం నేరుగా కలెక్టర్‌కు ఫైల్ పెట్టి సౌమ్యపై బదిలీ వేటు చేయించారు. అక్కడి నుంచే గందరగోళం మొదలైంది. తనను కూన రవికుమార్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ సౌమ్య మీడియాకెక్కారు. ఆమెకు మద్దతుగా కొన్ని సంఘాలు సమగ్రశిక్ష కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశాయి. ఆ వెంటనే దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. అయినా తన బదిలీని అధికారులు నిలపకపోవడంతో సౌమ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వివాదాన్ని క్లైమాక్స్‌కు తీసుకువచ్చారు. వాస్తవానికి సౌమ్యపై ఫిర్యాదులు వచ్చాయంటూ ఎమ్మెల్యే కూన లేఖ ఇచ్చిన తర్వాత ఏపీసీ హోదాలో నిబంధనల ప్రకారం విచారణ జరిపించాల్సి ఉంటుంది. ఆరోపణలు నిజమేనని విచారణలో తేలితే ఆ నివేదికను, ఎమ్మెల్యే పంపిన ఫిర్యాదులను జోడిరచి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. ఇది సర్క్యులేట్ అయిన తర్వాత చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ సౌమ్య ఉదంతంలో ఏపీసీ ప్రొసీజర్ పాటించకుండా, విచారణ లేకుండానే నేరుగా కలెక్టర్‌కు ఫైల్ పెట్టేసి ఎమ్మెల్యే సిఫార్సు చేసినందున సౌమ్యను బదిలీ చేయండంటూ రికమెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ నడుస్తుండటంతో ఇది కూడా రొటీన్ ట్రాన్స్‌ఫరే అనుకొని కలెక్టర్ సంతకం చేసేశారు.
ఇప్పుడు విచారణల పేరుతో హడావుడి
కానీ కథ అడ్డంతిరిగి సౌమ్య ఉదంతం రోడ్డెక్కింది. దీంతో చేతులు కాలిపోతున్నాయని గ్రహించిన కలెక్టర్ పొందూరు కేజీబీవీపై విచారణకు ఆర్జేడీని నియమించినట్లు ప్రకటించారు. ఇదే పని ఫిర్యాదు అందిన వెంటనే చేయాల్సింది. అలా అయితే విచారణకు ఆర్జేడీ అవసరం కూడా ఉండదు. ప్రిన్సిపాల్ కంటే పైఅధికారి ఎవరో ఒకర్ని నియమిస్తే సరిపోతుంది. అయితే కూన రవికుమార్ డ్యామేజ్ అవుతుండటంతో ఆర్జేడీని రంగంలోకి దించారు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. సౌమ్యపై చర్యలకు సిఫార్సు చేస్తూ ఆయా సెక్షన్ల నుంచి లేఖ పంపించాలని కోరితే సమగ్రశిక్ష కార్యాలయంలోని సంబంధిత గుమస్తాలు కూడా కుదరదన్నారట. ప్రొసీజర్ అది కాకపోవడమే వారి నిరాకరణకు కారణం. దీంతో చేసేది లేక ఏపీసీ తన విచరణాధికారాల మేరకు కలెక్టర్‌కు లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు.
శశిభూషణ్ ‘లెక్కే’ వేరు!
ప్రిన్సిపాల్ సౌమ్యపై ఆరోపణలున్నమాట వాస్తవం. అలా అని మిగిలిన కేజీబీవీ ప్రిన్సిపాళ్ల మీద లేవని కాదు. కానీ సౌమ్య విషయంలో ఇంత రచ్చ జరగడానికి కారణం ఏపీసీనే. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని తప్పించడానికి కేజీబీవీ ప్రిన్సిపాళ్లను పావుగా వాడుకోవడం శశిభూషణ్‌కు కొత్త కాదు. ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసిన మీసాల రమేష్‌నాయుడుపై ఆరోపణలున్నాయని, ఆయన్ను అక్కడి నుంచి పంపిస్తే గానీ తనకు ‘లెక్కలు’ కుదరవని భావించిన ఏపీసీ తనకు అనుకూలంగా ఉండే కొందరు ప్రిన్సిపాల్స్‌తో పిటిషన్ పెట్టించి ఆయన్ను ఇక్కడి నుంచి కదిపేశారు. దీంతో కేజీబీవీ ప్రిన్సిపాల్స్ ఏపీసీని తమ పైఅధికారిగా భావించడం మానేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి స్పెషలాఫీసర్‌గా ఉన్న ఏపీసీ శశిభూషణ్ పనిలో పనిగా ఆ ప్రాంతంలో ఉన్న కేజీబీవీలకు వెళ్తుంటారు. అలాగే తన సొంత ప్రాంతం పాతపట్నం, మెళియాపుట్టి వెళ్లాల్సివస్తే ఆన్‌డ్యూటీ కింద ఆఫీస్ వెహికల్‌లో వెళ్లి.. ఆ దారిలో ఉన్న కేజీబీవీలను తనిఖీ చేస్తుంటారు. కానీ జిల్లాలో మిగతావాటిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. అదేవుంటే ఆమధ్య ఓ కేజీబీవీలో మైనర్ బాలికలు బీర్ తాగుతూ గ్రామస్తుల కంట పడటం, మరోచోట ఫుడ్ పాయిజినింగ్ కావడం వంటి ఘటనలు జరిగేవి కావు. శశిభూషణ్ ఏ కులంకార్డుతో ఏపీసీగా వచ్చారో ఇప్పుడు అదే కులానికి చెందిన రవికుమార్ రాజకీయ జీవితంపై మరక మిగిల్చారు. ఇంకా విచిత్రమేమిటంటే.. శ్రీకాకుళం కేంద్రానికి పక్కనే ఉన్న లోలుగు కేజీబీవీని ఏపీసీ ఇంతవరకు తనిఖీ చేయలేదు. ఎమ్మెల్యే అక్కడి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేసినప్పుడైనా ఏపీసీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలించాల్సింది. కానీ అలా చేయలేదు. అంటే.. ఎక్కడో పంపకాలు సమస్య ఉండి ఉండాలి. సందట్లో సడేమియా అన్నట్లు సౌమ్యతో పాటు మరో ఇద్దరు కేజీబీవీ ప్రిన్సిపాళ్లను గుట్టుచప్పుడు కాకుండా ఏపీసీ కదిపేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఫిర్యాదు చేశారంటూ గార కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను బదిలీ చేశారు. ఆమెను సౌమ్య స్థానంలో నియమించారు. కంచిలి ప్రిన్సిపాల్‌ను గారకు పంపించారు. పొందూరు నుంచి సౌమ్యను కంచిలి పంపించారు. ఇప్పుడు ఇద్దరు ప్రిన్సిపాళ్లు జిల్లా కేంద్ర సమీపంలోకి రావడానికి ఏపీసీకి ఎంతోకొంత ముట్టజెప్పి ఉంటారని భావించినవారూ లేకపోలేదు. ఇప్పుడు కథంతా ముగిసిపోయే సమయానికి కలెక్టర్ కూడా ఈ ఆరోపణలపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఒకర్ని విచారణకు నియమించారు. వాస్తవానికి ఈ పని ఏపీసీ చేసి, ఆ నివేదిక మేరకు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద సౌమ్యను బదిలీ చేస్తున్నామని ప్రకటించి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. అలా కాకుండా కలెక్టర్‌కు పెట్టిన ఫైల్‌లో ఎమ్మెల్యే సిఫార్సు లేఖ పెట్టేసి బదిలీ చేయించడం వల్ల మొత్తం పెంట పెంట అయిపోయింది.
Comments