top of page

కాబా కిస్వానే కించపర్చిన ఎప్‌స్టీన్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 3 min read

ఇటీవల వెలుగు చూసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ఎంత కలకలం సష్టిస్తున్నాయో.. ఎంతమంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల చీకటి జీవితాలను బయటపెడుతున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కొత్త కొత్త అంశాలను బయటకొస్తూ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే వందల మంది ప్రముఖుల జీవితాలను రచ్చకీడ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి కొత్తగా లీకైన ఒక అంశం ఇప్పుడు మతపరంగానూ ఉద్రిక్తతలు రేపుతోంది. ముస్లింలు పవిత్రంగా భావించే కాబా కిస్వాను జెఫ్రీ ఎప్‌స్టీన్ నేలపై పరిచే కార్పెట్ మాదిరిగా వాడుకున్నట్లు ఆయనకు సంబంధించిన ఫైల్స్ ద్వారా వెల్లడి కావడంతో ముస్లిం ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ మతస్తులు దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం ప్రకటిస్తున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కా ముస్లింల యాత్రాస్థలం. వారు అత్యంత భక్తిప్రపత్తులతో ప్రార్థించే కాబాను కప్పేందుకు వినియోగించే పవిత్ర వస్త్రాన్నే కిస్వా అంటారు. అటువంటి కిస్వా ముక్కలు అమెరికాకు రవాణా కావడమే కాకుండా.. నేరగాడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అవి అందినట్లుగా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నట్లు బయటపడింది. ఆ పవిత్ర వస్త్రాన్ని ఎప్‌స్టీన్ తన నివాసంలో కార్పెట్ మాదిరిగా నేలపై పరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముస్లింలు ఈ చర్యను ఇస్లాం పవిత్ర చిహ్నాన్ని అవమానించడంగా పరిగణిస్తున్నారు. 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన వ్యాపారవేత్తలైన అజీజా అల్ అహ్మదీ, అబ్దుల్లా అల్ మారిల ద్వారా ఈ వస్త్రాన్ని ఎప్‌స్టీన్‌కు పంపారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ద్వారా ఫ్లోరిడాకు రవాణా చేసి ఆయనకు అందజేశారు. పవిత్ర కాబాను కప్పి ఉంచే ఈ కిస్వా వస్త్రంపై బంగారు దారంతో ఖురాన్ వాక్యాలు ఎంబ్రాయిడరీ చేసి ఉంటాయి. ప్రపంచ ముస్లింలందరికీ అత్యంత పవిత్రమైన కిస్వా ఎప్‌స్టీన్ వంటి వ్యక్తి వద్దకు చేరడం, దాన్ని ఆయన అవమానించడంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. మరోవైపు ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం దాదాపు పది దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఆయా దేశాలకు చెందిన పాలకులు, ప్రముఖ నాయకులు, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, రాజ కుటుంబాలకు చెందినవారి చీకటి కోణాలు, రహస్య ఒప్పందాలు బయటపడటంతో వారు రాజీనామాలు చేయాల్సి వస్తోంది. తీవ్రమైన నేరాలకుగాను జైలుశిక్ష అనుభవిస్తూ అక్కడే మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాల అగ్రనేతలను సైతం వణికిస్తోంది. ఈయనకు సంబంధించి అమెరికన్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనవరి 30న విడుదలైన ఈ పత్రాల వల్ల ఇప్పటివరకు 10 దేశాýకు చెందిన 15 మందికి పైగా ఉన్నతాధికారులు తమ పదవులు వదులుకోగా మరో 80 మందికి పైగా శక్తివంతమైన వ్యక్తులపై దర్యాప్తు జరుగుతోంది. అమెరికా విడుదల చేసిన ఈ రికార్డుల్లో పలువురు ప్రపంచ ప్రముఖులకు చెందిన విమాన ప్రయాణాల రికార్డులు, ఈమెయిల్స్‌తోపాటు వారి కాంటాక్ట్ లిస్టులు ఉన్నాయి. వీటిలో సుమారు 700 నుంచి 1000 మంది ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. తమ బండారం బయటపడటంతో వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బహిరంగపర్చడం వల్ల అత్యధికంగా యూరప్ దేశాలే ప్రభావితమవుతున్నాయి. వీటి కారణంగా బ్రిటన్‌కు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు రాజీనామా చేశారు. మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్, సలహాదారు ఆడమ్ పెర్రీ, పీఎం కీర్ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్‌స్వీనీ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. అలాగే స్లోవేకియా దేశంలో విదేశాంగశాఖ మాజీ మంత్రి మిరోస్లావ్ లైచాక్ పేరు మూడువందలకు పైగా ఈమెయిల్స్ తోపాటు పలు అభ్యంతరకర చాట్స్‌లో ప్రస్తావనకు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన మాజీ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ పేరును ఈ ఫైల్స్‌లో 673 సార్లు ప్రస్తావించారు. దీంతో ఆయన అరబ్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన కుమార్తె కరోలిన్ లాంగ్ కూడా తన పదవిని వదులుకున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు ఉందన్న కారణంతో నార్వే రాయబారి మోనా జుయెల్‌ను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేయగా మరోవైపు మాజీ పీఎం థోర్బ్‌జోర్న్ జగ్‌లాండ్ అవినీతిపై విచారణ ప్రారంభమైంది. దేశ నాయకులే కాకుండా ప్రపంచంలో ప్రముఖంగా ఉంటూ గౌరవప్రతిష్టలు పొందిన రాజ కుటుంబాలకు చెందినవారు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చిక్కుకుని తమ కుటుంబాలకు తలవంపులు తెచ్చిపెట్టి ప్రతిష్టను మసకబార్చారు. వీటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది బ్రిటిష్ రాజకుటుంబం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు ఉండటంతో ఈ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై బ్రిటిష్ పోలీసులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఈ ఫైల్స్ బాధితుడే. ఎప్‌స్టీన్‌తో తన భేటీల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన తన ఫౌండేషన్ బోర్డుకు రాజీనామా చేశారు. ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి ఎహుద్ బరాక్ పేరు ఎప్‌స్టీన్ అపార్ట్‌మెంట్ రికార్డుల్లో ఉండటంతో ఆయన దానిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఫైల్స్‌లో భారత ప్రధాని పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వీటిలో అనేకసార్లు ప్రస్తావించబడింది. రికార్డుల ప్రకారం.. ట్రంప్ పేరు సుమారు 38 వేలకు పైగా చోట్ల ఉండగా, ఏడెనిమిదాసార్లు ఆయన రహస్య ప్రయాణాల వివరాలు ఉన్నాయి. ఒకప్పుడు ట్రంప్, ఎప్‌స్టీన్ అత్యంత సన్నిహితులుగా ఉండేవారనే విషయం జగమెరిగిన సత్యం. ఎప్‌స్టీన్ ఫైల్స్ ఉన్న వివరాల ఆధారంగానే పోలాండ్, లాత్వియా, టర్కీ వంటి దేశాలు మానవ అక్రమరవాణా నెట్‌వర్క్‌తో తమ అధికారులకు ఉన్న సంబంధాలపై విచారణ జరపడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే తుపాను సష్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్ ఇంకెంత ప్రకంపనలు రేపుతాయో.. ఇంకెందరి జీవితాలను బజారకీడుస్తాయో అంతుచిక్కడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page