కుమారుడిని బలిగొన్న భార్యాభర్తల కలహం!
- BAGADI NARAYANARAO

- Jun 21, 2025
- 1 min read
భర్తతో తరచూ గొడవలతో మనస్తాపం
బిడ్డతో సహా నదిలో దూకిన తల్లి
ఆమెను రక్షించిన స్థానికులు
విగతజీవిగా మిగిలిన కొడుకు

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
భార్యాభర్తల కలహాలు అభం శుభం తెలియని వారి కుమారుడిని బలి తీసుకున్నాయి. భర్తతో గొడవపడిన భార్య తన కుమారుడితో సహా ఆత్మహత్యకు చేసిన ప్రయత్నంలో ఆమె బతికి బట్టకట్టగలిగినా.. కుమారుడు అశువులు బాశాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న యాతపేట చెందిన తుమ్మల యేసుబాబుకు పెద్ద రెల్లివీధికి చెందిన మేనకోడలు విమలతో నాలుగున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వరుణ్‌తేజ్ అనే కుమారుడు ఉన్నాడు. యేసుబాబు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వాహనాన్ని కొనుగోలు చేసి, తానే స్వయంగా నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. అయితే అతను నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వారిద్దరు గొడవ పడ్డారు. దీంతో శనివారం ఉదయం విమల తన కుమారుడితో సహా గుడివీధి సమీపంలో నాగావళి నదిలోకి దూకేసింది. ఆ పక్కనే పిండ ప్రదాన కార్యక్రమం చేస్తున్నవారు గమనించి విమలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. కానీ ఆమె కుమారుడు మాత్రం లభించలేదు. స్థానికుల సాయంతో నదిలో గాలించగా చివరికి విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు ఒకటో పట్టణ ఎస్‌ఐ రామారావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తల్లి విమల కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని, చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికీ భర్తతో గొడవ పడుతుండేదని చెబుతున్నారు.










Comments