top of page

క్రికెట్ టోర్నీల్లో దేశాల నిష్క్రమణ కొత్త కాదు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 3 min read

టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి అందాల్సిన సుమారు 350 కోట్ల టాకాల(బంగ్లా రూపాయలు)ను స్థూలంగా ఆ దేశ క్రికెట్ బోర్డు కోల్పోతుంది. రాజకీయ కారణాలతో శాంతిభద్రతల ముసుగులో బంగ్లా తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రపంచ స్థాయి పోటీల నుంచి ఒక దేశం తప్పుకోవడం అరుదైనదే అయినా కొత్తది మాత్రం కాదు. గతంలో కూడా మిగతా క్రీడల సంగతెలా ఉన్నా క్రికెట్‌కు సంబంధించి గతంలో జరిగిన అత్యున్నత టోర్నమెంట్లను కొన్ని దేశాలు బహిష్కరించిన ఘటనలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. దానికి ముందు బంగ్లా నిష్క్రమణ పూర్వాపరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో అక్కడి మైనారిటీ జనాభా అయిన హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా భారత్‌లో ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తప్పించింది. దీనికి ప్రతిగా భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారతదేశంలో ప్రపంచ కప్ ఆడటానికి నిరాకరించింది. తాము ఆడాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ఐసీసీ, బీసీబీ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం క్రీడా వేదికలను మార్చబోమని, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారతదేశంలోనే ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేసిన ఐసీసీ తన వైఖరి స్పష్టం చేయడానికి బీసీబీకి 24 గంటల సమయం ఇచ్చింది. ఆ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు తన డిమాండ్‌కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. భారత్‌లో కాకుండా శ్రీలంకలో ప్రపంచ కప్ ఆడాలన్న తమ విజ్ఞప్తిని మన్నించనందున టీ20 ప్రపంచ కప్ `2026 నుంచి నిష్క్రమిస్తున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ చేసినట్లే గతంలో ఐదు సందర్భాల్లో వివిధ టోర్నీలను దేశాలు బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, వెస్టిండీస్ జట్లు అంతర్జాతీయ టోర్నీలను బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. 1996 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక కో-హోస్ట్(సహ నిర్వహకురాలు)గా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ ఏడాది జనవరిలో ప్రపంచ కప్ ప్రారంభానికి రెండువారాల ముందు కొలంబోలో జరిగిన బాంబు దాడి భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఆందోళనలను తొలగించేందుకు శ్రీలంకు సంఘీభావంగా భారత్ పాకిస్తాన్ల సంయుక్త XI టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కొలంబోలో శ్రీలంకతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. అయినా కూడా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తమ గ్రూప్ మ్యాచ్ లు ఆడేందుకు కొలంబోకు వెళ్లడానికి నిరాకరించాయి. ఫలితంగా ఆ దేశాలు మ్యాచ్ పాయింట్లు కోల్పోగా శ్రీలంక సులభంగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన తుది సమరంలో ఓడించి విజేతగా నిలిచింది. 2003 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అయితే అప్పటి ఇంగ్లండ్ ప్రభుత్వం జింబాబ్వేలోని రాబర్ట్ ముగాబే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నందున ఆ దేశంలోని హరారేలో షెడ్యూల్ చేసిన తన మ్యాచ్‌ను ఆడేందుకు ఇంగ్లండ్ నిరాకరించింది. అదే టోర్నీకి కొన్ని నెలల ముందు కెన్యాలోని మొంబాసాలో జరిగిన బాంబు దాడులను భద్రతా సమస్యగా చూపుతూ న్యూజిలాండ్ కూడా కెన్యాలోని నైరోబీకి వెళ్లి ఆడటానికి నిరాకరించింది. ఈ రెండూ తమ మ్యాచ్‌లను హరారే, నైరోబీల నుంచి ఇతర వేదికలను మార్చాలని అభ్యర్థించినా ఐసీసీ నిరాకరించి జింబాబ్వే, కెన్యాలకు వాసఓవర్ ఇచ్చింది. ఫలితంగా గ్రూప్ దశలోనే ఆ టోర్నీ నుంచి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. అయితే న్యూజిలాండ్ మాత్రం గ్రూప్`బి నుంచి సూపర్ సిక్స్‌కు చేరుకుంది. 2009 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా సరికొత్త సమస్య ఎదురైంది. ఇంగ్లండ్ అతిథ్యమిచ్చిన ఆ టోర్నీలో జింబాబ్వే కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే అప్పటికి ఐదేళ్లుగా జింబాబ్వే, బ్రిటన్ మధ్య సంబంధాలు లేవు. ఈ పరిస్థితుల్లో టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే జింబాబ్వే ఆటగాళ్లకు ఇంగ్లండ్ ప్రయాణ వీసాలు మంజూరు చేస్తుందా లేదా, అసలు టోర్నీని కొనసాగిస్తుందా లేదా అన్న అనిశ్చితి ఏర్పడింది. ఈ అనిశ్చితిని తొలగించేందుకు వీలుగా టోర్నీకి ముందు ఐసీసీ, జింబాబ్వే చర్చించుకుని ఒక ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారం ప్రపంచ క్రికెట్ ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని ప్రపంచ కప్ టోర్నీ నుంచి జింబాబ్వే స్వచ్ఛందంగా వైదొలిగింది. ఆ త్యాగానికి ప్రతిఫలంగా తనకు రావాల్సిన భాగస్వామ్య ఫీజును ఆడకుండానే ఐసీసీ నుంచి అందుకుంది. జింబాబ్వే స్థానంలో క్వాలిఫయర్స్ నుండి స్కాటిష్ అసోసియేట్ జట్టును ఎంపిక చేశారు. 2015 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ నుంచి ఆస్ట్రేలియా భద్రతా కారణాలతో వైదొలిగింది. 2016 అండర్-19 ప్రపంచ కప్ వరకు తన వైఖరిని మార్చుకోలేదు. దాంతో ఆస్ట్రేలియా స్థానంలో ఐర్లాండ్ ఆ టోర్నమెంట్‌లో పాల్గొంది. 2025లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చింది. కానీ టోర్నీలో ఆడటానికి భారతదేశం పాకిస్తాన్‌కు వెళ్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. 2008 నుంచి పాకిస్తాన్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2023లో వన్డే ప్రపంచకప్ ఆడటానికి పాకిస్తాన్ భారతదేశాన్ని సందర్శించినా రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీలో ఆడటానికి భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. రెండు దేశాల బోర్డులు, ఐసీసీ మధ్య విస్తృత చర్చల తర్వాత 2024-2027 క్రికెట్ క్యాలండర్ కోసం ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం.. భారతదేశం లేదా పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు దేశాలు తటస్థ వేదికల్లోనే ఆడుతున్నాయి. ఆ ప్రకారమే ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌లో తన మ్యాచ్‌లను పాకిస్తాన్ శ్రీలంకలో ఆడుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page