top of page

ఖర్చులకు అతీతం.. మన గణతంత్రం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3h
  • 3 min read

జనవరి 26.. ఇది మన దేశానికి అతిముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం లభించినా.. మనకు రాష్ట్రపతి లేరు. దేశాన్ని నడిపేందుకు సొంత రాజ్యాంగమూ లేదు. పండిట్ నెహ్రూ నేతత్వంలో మంత్రిమండలి ఏర్పడినా బ్రిటీష్ గవర్నర్ జనరల్ మౌంట్‌బ్యాటన్ గవర్నర్ జనరల్‌గా ఆధిపత్యం వహిస్తూ బ్రిటీష్ రాచరిక పాలనకు భారత ప్రతినిధిగా వ్యవహరించారు. మన సొంత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి, బ్రిటీష్ ప్రమేయం ఏమాత్రం లేని సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మరో రెండున్నరేళ్లకుపైగా భారత ప్రజలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ వ్యవధిలో రాజ్యాంగాన్ని రూపొందించి, దాన్ని పార్లమెంటు ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26న అమల్లోకి తేవడంతో భారత్ పూర్తిస్థాయి ప్రజాస్వామిక సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. దానికి గుర్తుగానే ప్రతి ఏటా అదే రోజు గణతంత్ర దినోత్సవం పేరుతో వార్షికోత్సవాలు జరుపుకొంటున్నాం. ఆ రోజు ఒక విదేశీ అధిపతిని ముఖ్యఅతిధిగా ఆహ్వానించి ఆయన ద్వారా ప్రపంచానికి మన ప్రగతిని, సైనిక సత్తాను చూపించేలా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పతాక వందనం, సాయుధ బలగాల పరేడ్, సాంస్కతిక విన్యాసాలు, అభివద్ధి ప్రదర్శనలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది మన సత్తా చాటే వేదిక.. గౌరవానికి ప్రతీక. దీని విలువను కరెన్సీలో లెక్కగట్టలేం.. కట్టకూడదు కూడా. కానీ 1951 జనవరి 26న నిర్వహించిన తొలి గణతంత్ర వార్షికోత్సవం నుంచి ఇప్పటిదాకా ఈ జాతీయ పండుగకు ఏటా వెచ్చిస్తున్నది ఎంత? అది ఏటేటా ఎలా పెరుగుతోంది? అన్నది తెలుసుకోవడం ఆసక్తికరమే. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సాయుధ దళాల పరేట్, సైనిక శకటాల ప్రదర్శన, యుద్ధ విమానాల విన్యాసాలు, సాంస్కతిక ప్రదర్శనలు, రాష్ట్రాల శకటాలను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా కోట్లాది ప్రజలు వీక్షిస్తారు. వీటికి సంబంధించిన సన్నాహకాలు, ప్రదర్శనలకు భారీగానే ఖర్చవుతుంది. మరి ఈ మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? టిక్కెట్ల విక్రయాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? అనే ప్రశ్నలు రేకెత్తడం సహజం. అదే ఉత్సుకతతో పార్లమెంటులో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలు, ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా చూస్తే, రిపబ్లిక్ డే ఉత్సవాల ఆదాయవ్యయాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. తొలినాళ్లలో దీనిపై ఆదాయం ఉండేది కాదు. అలాగే ఖర్చు కూడా చాలా పరిమితంగానే ఉండేది. అనేక సందర్భాల్లో లోక్‌సభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ప్రకారం.. 1951లో నిర్వహించిన తొలి ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం కొన్ని వేల రూపాయలే. కాలక్రమేణా పరేడ్ పరిధి విస్తరించడంతో పరిస్థితి పూర్తిగా మారింది. మరిన్ని సైనిక దళాలు, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యం పెరగడంతో ఖర్చు కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1956 నాటికి ఈ వ్యయం రూ.5.75 లక్షలకు చేరుకోగా 1971లో రూ.17.12 లక్షలు, 1973లో రూ.23.38 లక్షలు అయ్యాయి. 1988 నాటికి ఇది రూ.70 లక్షలకు పెరిగింది. కాగా 1986లో ఉత్సవాల వీక్షణకు టికెట్ల పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత వాటి అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.7.47 లక్షల ఆదాయం లభించింది. అయితే 1990 తర్వాత నుంచి రిపబ్లిక్‌డే ఉత్సవాల ఖర్చుల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం మానేసింది. పార్లమెంటులో పలు సందర్భాల్లో సభ్యుల నుంచి ప్రశ్నలు ఎదురైనా.. గణతంత్ర దినోత్సవ పరేడ్ ఏర్పాట్లు అనేక మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర ఏజెన్సీల భాగస్వామ్యం, సహకారంతో జరుగుతాయని.. ప్రతి సంస్థ తన సొంత బడ్జెట్ నుంచి ఖర్చు భరిస్తున్నందున.. ఆ ఖర్చులన్నింటినీ కలిపి ఒకే ఖాతా కింద చూపడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. అయితే 2008లో దాఖలైన ఒక ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ ఏడాది టికెట్ ఆదాయం సుమారు రూ.17.63 లక్షలు కాగా పరేడ్ నిర్వహణ ఖర్చు సుమారు రూ. 145 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఆ ఖర్చు 2015 నాటికి రూ.320 కోట్లకు పెరిగినట్లు అంచనా. ఖర్చు భారీగ పెరుగుతున్నా టిక్కెట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పరిమితంగానే ఉంటోంది. 2018, 19, 20 లలో టికెట్ ఆదాయం ఏడాదికి సగటున రూ.34 లక్షలు మాత్రమేనని సమాచారం. కోవిడ్ కారణంగా 2021లో ప్రేక్షకుల సంఖ్యపై ఆంక్షలు విధించడంతో టికెట్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2021లో రూ.10.12 లక్షలకు , 2022లో మరింత తగ్గి 1.14 లక్షలకే పరిమితమైంది. రక్షణ మంత్రిత్వశాఖలోని సెరిమోనియల్ విభాగానికి గణతంత్ర పరేడ్‌తో పాటు బీటింగ్ రిట్రీట్ వంటి వేడుకల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. 2018-19లో ఈ బడ్జెట్ రూ.15.3 మిలియన్లు కాగా 2019-20లో 13.9 మిలియన్లు, 2020-21 నుంచి 2022-23 వరకు సుమారు 13.2 మిలియన్లుగా ఉంది. అయితే దీన్ని పరేడ్ మొత్తం వ్యయంగా రక్షణ శాఖ ఖర్చుగానే పరిగణించాలి. ఇతర శాఖలు, ఏజెన్సీల ఖర్చులు దీనికి అదనం. కోవిడ్ అనంతరం 2023లో గణతంత్ర దినోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా టికెట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వం సుమారు రూ.28.36 లక్షల ఆదాయం పొందింది. అయితే సాంకేతిక లోపాల కారణంగా కొందరికి టికెట్ల సొమ్ము వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం మీద చూస్తే, గణతంత్ర దినోత్సవ పరేడ్ ఆదాయం కోసం నిర్వహించే కార్యక్రమం కాదన్నది సుష్పష్టం. ఇది దేశ గౌరవం, సంప్రదాయం, జాతీయ ప్రతిష్టతో ముడిపడి ఉన్న ఒక మహత్తర వేడుక. భారతదేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే శక్తివంతమైన వేదికగా, ప్రదర్శనగా నిలిచే ఈ పండుగను ఖర్చులతో కొలవడం సమంజసం కాదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page