క్రూడ్ రవాణాకు ప్రత్యేక ఆపరేషన్!
- DV RAMANA

- 2 hours ago
- 2 min read

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సర్వత్రా గందరగోళం, అయోమయ పరిస్థితులకు కారణమవుతోంది. ముఖ్యంగా యుద్ధానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న చపలచిత్త ధోరణి పరిస్థితిని సంక్షిష్టంగా మారుతున్నది. ప్రతి అంశంలోనూ అతిశయం, ఆర్భాటాలు ప్రదర్శించే ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధం విషయంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నారు. ఒకసారి చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయంటారు.. ఇంకోసారి ఇరాన్ ఆయువుపట్లను నాశనం చేస్తామని హుంకరిస్తారు.. ఈసారి మరింత రెచ్చిపోయి ఇరాన్ పాలననే మార్చేశామని ఉవాచిస్తున్నారు. ఇన్ని మాటలు చెబుతూనే మరోవైపు దాడులు మాత్రం కొనసాగిస్తున్నారు. ఆయన వైఖరితో ఇరాన్ మరింత బిగదీసుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దాడులకు అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నది. ఫలితంగా యుద్ధానికి ముగింపు ఎప్పుడన్నది అంతుచిక్కడం లేదు. చర్చల వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో యుద్ధం అప్పుడో ఇప్పుడో ముగిసిపోతుందని ఆశగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు వేటికవి తమ దారి చూసుకుంటున్నాయి. ప్రధానం ఇరాన్ గుప్పిట్లో చిక్కుకున్న హర్మూజ్ జలసంధి కారణంగా దాదాపు స్తంభించిపోయిన క్రూడ్ ఆయిల్, గ్యాస్ రవాణాను పునరుద్ధరించగలిగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్వేషిస్తున్నాయి. ఆ మార్గాల్లో పయనిస్తున్నాయి. ఈ విషయంలో సౌదీ అరేబియా, భారత్ ముందుంజలో ఉన్నట్లు కనిపిస్తున్నది. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముందు వరుసలో ఉండే సౌదీ తన భూభాగంపై అమెరికా సైనిక స్థావరాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఇదే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా పరిణమించింది. అమెరికా, ఇజ్రాయెల్ తనపై దాడులు చేస్తున్నందుకు ప్రతీకారంగా ఇరాన్ సౌదీలోని అమెరికన్ స్థావరాలతోపాటు ఆ దేశానికి చెందిన పౌర వ్యవస్థలు, చమురు ఉత్పత్తి క్షేత్రాలపై దాడులు చేస్తున్నది. దానికితోడు హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు వీల్లేని పరిస్థితుల్లో సౌదీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటున్నది. ఇరాన్ ఈ మార్గాన్ని అదుపులోకి తీసుకోవడం అంటే ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టడమే. నౌకల రాకపోకలు ఆగిపోవడంతో అనేక దేశాలు చీకట్లోకి వెళ్లే పరిస్థితి తలెత్తింది. అమెరికా చర్చల మంత్రం పఠిస్తున్నప్పటికీ ఇరాన్ తన పంతాన్ని వీడలేదు. ఈ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ గుండా చమురు సరఫరాను పునరుద్ధరించడం ఇప్పట్లో అసాధ్యమని అందరూ భావిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా కొత్త మార్గాన్ని అన్వేషించింది. తన ప్రయత్నాలతో ప్రపంచానికి సరికొత్త దారిని చూపింది. హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా తన ఈస్ట్ వెస్ట్ పైప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురును తరలించే ఈ పైప్‌లైనే ఇప్పుడు ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ పైప్‌లైన్ వ్యవస్థను ఇప్పుడు గరిష్ట సామర్థ్యంతో పని చేయిస్తూ రోజుకు 70 లక్షల బ్యారెళ్ల చమురును సురక్షితంగా రవాణా చేస్తోంది. సౌదీ అరేబియా అనుసరిస్తున్న ఈ వ్యూహం అత్యంత కచ్చితత్వంతో కూడుకున్నది. పర్షియన్ గల్ఫ్ తీరంలోని చమురు క్షేత్రాల నుంచి క్రూడ్ ఆయిల్ నేరుగా పైప్‌లైన్ ద్వారా దేశం వెనుక భాగంలో ఉన్న యెంబు పోర్టుకు చేరుతున్నది. ఈ పైప్‌లైన్ మార్గం ద్వారా నౌకలు ప్రమాదకరంగా మారిన హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే ఎర్ర సముద్రంలోని యెంబు పోర్టుకు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలకు చమురు ఎగుమతులు నిరాటంకంగా సాగుతున్నాయి. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా గ్లోబల్ ఎకానమీ కుప్పకూలకుండా కాపాడే ఒక ముందడుగు. యుద్ధతంత్రం కంటే వాణిజ్య తంత్రం శక్తివంతమైనదని ఈ చర్య ద్వారా సౌదీ నిరూపించింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సౌదీ తన పైప్‌లైన్ ద్వారా ప్రపంచానికి ఇంధన భరోసా కల్పిస్తోంది. సౌదీ తన ప్రధాన ఆర్థిక వనరు అయిన చమురును ప్రత్యామ్నాయం మార్గంలో తరలించడం ద్వారా తనపై ఆధారపడిన దేశాలకు కూడా ఊతం ఇస్తుంటే.. అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్ 140 కోట్లకుపైగా ఉన్న తన దేశ ప్రజలకు ఇంధన భద్రత కల్పించేందుకు హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న తరుణంలో భారత్ తన ఇంధన దిగుమతులకు విఘాతం కలగకుండా చూసేందుకు ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను ప్రారంభించింది. హార్మూజ్ జలసంధి గుండా భారత్‌కు వచ్చే క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ, ఎలఎన్‌జీ నౌకలకు రక్షణ కల్పిస్తూ సురక్షితంగా జలసంధిని దాటించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం భారత నౌకాదళం తన అత్యున్నత శ్రేణికి చెందిన యుద్ధనౌకలను హర్మూజ్ జలసంధి సమీపంలో మోహరించింది. ఐదుకు పైగా అగ్రశ్రేణి యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తూ భారత జెండాతో వచ్చే ఇంధన నౌకలకు రక్షణ కవచం(ఎస్కార్ట్)గా నిలుస్తున్నాయి. కేవలం భౌతిక రక్షణే పరిమితం కాకుండా, యుద్ధం కారణంగా తలెత్తే జీపీఎస్ జామింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి రియల్-టైమ్ నావిగేషన్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ రక్షణను కూడా ఈ యుద్ధనౌకలు అందిస్తున్నాయి. సుమారు 20 ఇంధన నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు, సముద్రంలో మైన్ల హెచ్చరికలు, షిప్పింగ్ ట్రాఫిక్ తగ్గిపోవడం వంటి సవాళ్లను అధిగమించడానికి ఈ ఆపరేషన్ చేపట్టింది. దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.






Comments