top of page

క్రైమ్‌ రికార్డుల డొల్లతనం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 17, 2025
  • 2 min read

ప్రజల్లో చైతన్యం గతం కంటే పెరిగిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నేరాలు కూడా అదుపులోకి వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక కొట్టిపారేస్తోంది. జాతీయస్థాయిలో 2023 ఏడాదిలో జరిగిన నేరాలు, కేసులతో కూడిన నివేదికను ఆ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గృహహింస, దళితులపై దాడులు, కస్టోడియల్‌ మరణాలు అధికంగా సంభవించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ వీటికి సంబంధించి కేసుల నమోదులో పోలీసుల పక్షపాత ధోరణి ఈ నివేదిక ద్వారా బట్టబయలైంది. వరకట్నం దురాచారం, గృహహింసల నిరోధక చట్టాలు అమల్లో ఉన్నా.. వీటిని సామాజిక సమస్యలుగా భావించి ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు, ఎన్జీవోలు విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా ప్రతి ఏటా 498ఏ, గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. కానీ గృహహింస నిరోధక చట్టాన్ని 2022 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అటకెక్కించేశారు. ఆ మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్‌ కూడా తెలంగాణను అనసరించింది. 2023లో ఆ చట్టం కింద ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదనడమే నిదర్శనం. అయితే 498ఏ కేసులు మాత్రం రెండు రాష్ట్రాల్లో 10వేలకుపైగా నమోదయ్యాయి. వరకట్న మరణాల (ఐపీసీ 304బి) కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 95 నమోదు కాగా తెలంగాణలో 145 నమోదయ్యాయి. ఇక వరకట్న నిషేధ చట్టం కింద ఏపీలో 353 నమోదైతే తెలంగాణలో కేవలం 4 కేసులే వచ్చాయట. ఏపీలో నమోదైన 353 కేసుల్లో 344 ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 8, కాకినాడలో ఒక కేసు నమోదయ్యాయి. తెలంగాణలోని ములుగు జిల్లాలో తప్ప రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వరకట్న దురాచారం ఇంకా సమసిపోలేదని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. ఇక 2023లో ఏపీలో దళితులపై 1966 దాడులు జరగ్గా వీటిలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు 56 ఉన్నాయి. అలాగే తెలంగాణలో దళితులపై 1652 దాడులు జరగ్గా వాటిలో 57 ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోనివి. అయితే జరిగిన దాడులపై నమోదైన కేసులు కేవలం మూడు శాతం మాత్రమే. ఏపీలోని నంద్యాల జిల్లాలో 103, బాపట్ల జిల్లాలో 154 దళుతులపై దాడులు జరిగితే ఆ జిల్లాల్లో ఈ చట్టాల కింద ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా 233 నేరాలు జరిగితే.. తొమ్మిది కేసులే నమోదయ్యాయి. ఆదివాసీలపై ఏపీలో 347, తెలంగాణలో 557 నేరాలు జరగ్గా సంబంధిత చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 13, తెలంగాణలో 18 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మిగతా వాటిని ఐపీసీ కింద నమోదు చేసి మమ అనిపించేసినట్లు వెల్లడవుతోంది. కస్టోడియల్‌ మరణాల(లాకప్‌ డెత్‌) కేసుల విషయంలోనూ పోలీసుల డొల్ల విధానాలను ఎన్సీఆర్బీ నివేదిక ఎత్తిచూపింది. 2023లో ఏపీలో పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయాడు. దీనిపై కేసు రిజిస్టర్‌ చేసినా.. దానికి ఏ పోలీసునూ బాధ్యుడిగా పేర్కొనలేదు.. అసలు విచారణే చేపట్టలేదు. లాకప్‌ డెత్‌లలో గుజరాత్‌, మహారాష్ట్ర చాల ముందున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో చెరో 13 మంది కస్టడీలో చనిపోయారు. కానీ ఈ కేసుల్లో ఒక్క పోలీసునైనా అరెస్టు చేయలేదు. ఈ విషయంలో హర్యానా రాష్ట్రం కొంత మేలు. అక్కడ ఒక కస్టోడియల్‌ మృతి జరగ్గా విచారణ జరిపి ముగ్గురు పోలీసులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసి అరెస్టు చేశారు. లాకప్‌ డెత్‌ కేసులో పోలీసులను అరెస్టు చేసిన ఘటన దేశంలో ఇదొక్కటే కావడం గమనార్హం. 2023లో తెలంగాణలో మూడు లాకప్‌డెత్‌లు జరిగాయి. మెదక్‌లో ఖదీర్‌ఖాన్‌ మరణాన్ని తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో బీహార్‌కు చెందిన నితీష్‌కుమార్‌ కస్టడీ మరణంపై మీడియా వార్తల ఆధారంగా ఒక లాయర్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించారు. అలాగే హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌ పోలీసు స్టేషన్‌లో చిరంజీవి అనే వ్యక్తి మరణించగా దాన్ని కూడా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మానవ హక్కుల వేదిక ఈ మూడు ఘటనల్లోనూ నిజనిర్ధారణ చేసింది. కానీ ఎన్సీఆర్బీ నివేదికలో తెలంగాణలో ఒకటే లాకప్‌డెత్‌ జరిగినట్టుగా పేర్కొన్నారు. ఆ ఒక్క కేసులోనూ ఎవరి మీదా చార్జిషీటు దాఖలు చేయలేదు, ఏ పోలీసు అరెస్టు కాలేదు. జాతీయస్థాయిలో నేరాలు`కేసుల సమాచారాన్ని ఎన్సీఆర్బీ సేకరిస్తే.. రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎస్సీఆర్బీ) ఆ పని చేస్తుంది. అయితే ఎన్సీఆర్బీ ఏటా నివేదికలు విడుదల చేస్తున్నా.. ఎస్సీఆర్బీ నివేదికలు మాత్రం బయటకు రావు. కొద్దికాలం క్రితం డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గురించి కథనాలు వచ్చాయి. కానీ ఆ ప్రతిపాదన ఏమైందో తెలియదు. పోలీసు వ్యవస్థను కంప్యూటరీకరించినందున ఏ ప్రాంతంలో ఏఏ నేరాలు జరుగుతున్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసే వ్యవస్థను రూపొందించడం పెద్ద కష్టమేమీ కాదు. ఏడాదికోసారి తప్పులు తడకల సమాచారాన్ని ఒక నిర్ణీత ఫార్మట్‌లో కూరడం, అది కూడా రెండేళ్ల తర్వాత తీరిగ్గా విడుదల చేయాల్సిన పరిస్థితి కంప్యూటర్‌ యుగంలో కొనసాగుతుండటం చాలా విచారకరం. నిర్ణీత కాలవ్యవధిలో, కచ్చితమైన గణాంకాలతో నివేదికలో రూపొందించి విడుదల చేస్తే లోపాలు సరిదిద్దుకుని వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా ఉపయోగపడతాయి. అది జరగనప్పుడు వాస్తవానికి దూరంగా ఉండిపోతాం. నేరాలు, దురాచారాలు సాగుతూనే ఉంటాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page