top of page

క్రైమ్‌ రేట్‌ గట్టిగా తగ్గింది..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 30, 2025
  • 3 min read
  • ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు

  • చోరీ సోత్తు 91 శాతం రికవరీ

  • తగ్గిన మిస్సింగ్‌ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు

  • గంజాయిపై ఉక్కుపాదం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పోలీసుశాఖ విజిబుల్‌ పోలీసింగ్‌, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్‌ ఫ్లయింగ్‌, సోషల్‌ మీడియా మోనటరింగ్‌ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్‌ రేట్‌ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగిన తీరును వివరించారు. చిన్న పిల్లలపై లైంగికదాడులు, మహిళలపై దాడులు, హత్యకేసులు మాత్రం గతేడాదితో పోల్చితే గణనీయంగా పెరిగాయి. గంజాయి తరలిస్తూ, విక్రయిస్తూ, వినియోగిస్తూ నమోదైన కేసులు కూడా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 213 శాతానికి పెరిగాయి. గేమింగ్‌ యాక్ట్‌ కేసులు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 99 కేసులు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య 23 శాతం, వైట్‌ కాలర్‌ నేరాల సంఖ్య 13 శాతానికి తగ్గించగలిగారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 33 శాతం మేర తగ్గాయని ప్రకటించారు. మిస్సింగ్‌ కేసులు 13 శాతానికి తగ్గినట్టు నివేదికలో పేర్కొన్నారు. పరస్పరం భౌతిక దాడులు 16 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. చోరీ సొత్తు 91 శాతం రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 6,338 మందిపై బహిరంగ మద్యపానం కేసులు నమోదు చేశారు. 144 మందిపై ఈ ఏడాది కొత్తగా రౌడీషీట్‌ తెరిచినట్టు ఎస్పీ ప్రకటించారు.

పోక్సో..

చిన్నారులపై లైంగిక దాడులు, ప్రేమ పేరుతో మైనర్లను ప్రలోభాలకు గురిచేసిన కేసులు జిల్లాలో 2024లో 39 నమోదు కాగా, ఈ ఏడాది 54 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రేమ పేరుతో వంచించిన కేసులు గత ఏడాది 32 ఉండగా, ఈ ఏడాది 48కి చేరింది. ఉద్దేశపూర్వకంగా లైంగిక దాడి చేసిన కేసులు గతేడాది 7 ఉండగా, ఈ ఏడాది 6 ఉన్నట్టు క్రైం నివేదికలో పేర్కొన్నారు. ఈ లెక్కన పోక్సో కేసులు 38 శాతానికి పెరిగినట్టు ప్రకటించారు.

మిస్సింగ్‌..

బాలికలు, బాలలు, మహిళలు, పురుషులు మిస్సింగ్‌ కేసులు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 13 శాతానికి తగ్గాయి. 2024లో 405 నమోదు కాగా, ఈ ఏడాది 353 నమోదయ్యాయి. వీటిలో బాలికలు మిస్సింగ్‌ 51 కేసులు నమోదు కాగా, 48 మందిని సురక్షితంగా ఇంటికి చేర్చినట్టు తెలిపారు. బాలురు 11 మంది మిస్సింగ్‌ కాగా, వారందరినీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. మహిళలు మిస్సింగ్‌ కేసులు 214 నమోదు కాగా, 192 మందిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. పురుషులు మిస్సింగ్‌ అయినట్టు 77 కేసులు నమోదు కాగా, 52 మందిని గుర్తించారు. 2019`24 మధ్య నమోదైన 43 మిస్సింగ్‌ కేసులన్నింటినీ ట్రేస్‌ చేశారు. ఈ కేసుల్లో ప్రేమ పేరుతో ప్రలోభాలు పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయినవే ఎక్కువగా ఉన్నాయని, ఎస్పీ క్లారిటీ ఇచ్చారు.

హత్యలు..

జిల్లాలో గతేడాదితో పోల్చితే హత్యల సంఖ్య గణనీయంగా పెరిగాయి. గతేడాది 16 ఉండగా, ఈ ఏడాది 26 నమోదయినట్టు పోలీసు బాస్‌ ప్రకటించారు. అయితే కొన్ని కేసులను హత్య కేసులుగా నమోదు చేయకపోవడం వల్ల వాటిని ఈ జాబితాలో చేర్చలేదు. ఈ ఏడాది 30 హత్యలు జరిగినా, పోలీసులు మాత్రం 26 మాత్రమే ధ్రువీకరించారు. భార్యాభర్తల మధ్య మనస్ప్ధంలు, అక్రమ సంబంధాల వల్ల గతేడాది 7 జరిగితే, ఈ ఏడాది 19 హత్యలు జరిగినట్టు పోలీసులు ధ్రువీకరించారు. హత్యాయత్నం కేసులు 22 నమోదయ్యాయి. మూకదాడులు కేవలం ఒక్కటే నమోదయినట్టు పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీలపై..

ఎస్సీ, ఎస్టీలపై దాడులు, లైంగిక వేధింపు కేసులు 33 శాతానికి తగ్గాయి. గతేడాది 66 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 44కు తగ్గింది. వీటిలో రేప్‌ కేసులు గతేడాది 7 నమోదు కాగా, ఈ ఏడాది 8 నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినవే.

చోరీ సొత్తు రికవరీ..

జిల్లాలో చోరీ కేసుల్లో రికవరీ 91 శాతం చేసినట్టు ఎస్పీ ప్రకటించారు. రూ.4.2 కోట్లు సొత్తు చోరీ కాగా, అందులో రూ. 3.86 కోట్లు రికవరీ అయినట్టు ప్రకటించారు. 2021`25 మధ్య 119 కేసుల్లో 71 శాతం రికవరీ చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది జరిగిన చోరీ జరిగిన సొత్తులో 75 శాతం రికవరీ చేసినట్టు ఎస్పీ వెల్లడిరచారు. నరసన్నపేట వ్యాపారి నుంచి చోరీ చేసిన బంగారం, కరుడుగట్టిన నేరస్తులు పొన్నాన రాంబాబు, దున్న కృష్ణ, పోలా భాస్కర్‌ తదితరుల నుంచి ఎక్కువ మొత్తంలో చోరీ సొత్తు రికవరీ చేశారు.

గంజాయి..

2023లో 19 కేసులు, 2024లో 52 కేసులు, ఈ ఏడాది 137 కేసులు నమోదయ్యాయి. 2024లో 163 మందిని అరెస్టు చేయగా, ఈ ఏడాది గంజాయి తరలింపు, విక్రయాలు, వినియోగం తదితర కేసుల్లో ఈ ఏడాది 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన వారు 63 మంది ఉండగా, మిగతావారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. జిల్లాలో అరెస్టు అయిన వారిలో 16 మంది గంజాయి తరలించడం, విక్రయించడం, వినియోగిస్తూ పోలీసులకు చిక్కినవారే ఉన్నారు. రెండు కేసుల్లో ఒకరికి పదేళ్లు, మరొకరికి నాలుగేళ్లు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.

రౌడీషీట్‌.. గేమింగ్‌..

జిల్లాలో ఈ ఏడాది 144 మందిపై రౌడీషీట్‌, 204 మందిపై సస్పెక్ట్‌ షీట్‌, 1070 మందిపై హిస్టరీ షీట్‌ తెరిచారు. వీరిలో రౌడీషీట్‌, సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నవారిని జియోట్యాంగ్‌ చేశారు. జిల్లాలో పేకాట, పిక్కాట ఆడుతున్న వారిపై గతేడాది 254 కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది 353 కేసులు నమోదు చేసి 2,034 మందిని అరెస్టు చేసి రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై 274 కేసులు నమోదు చేసి, 550 మందిని అరెస్టు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న 12,060 మందిపై కేసులు నమోదు చేసి, 24 మందిని రిమాండ్‌కు పంపారు. గతేడాది కేవలం 3,300 కేసులు మాత్రమే నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదాలు..

జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 23 శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినట్టు ఎస్పీ ప్రకటించారు. 2023లో 810 నమోదు కాగా, గతేడాది 889కి చేరింది. ఈ ఏడాది 699 నమోదయ్యాయి. ఘోర ప్రమాదాల సంఖ్య 2023లో 281, 2024లో 279 ఉండగా, ఈ ఏడాది 245 మాత్రమే. ప్రమాదాల్లో మృతి చెందిన వారికంటే గాయపడినవారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రదేశాల్లో అమర్చిన 3,700 సీసీ కెమెరాలు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేసినట్టు తెలిపారు. కేవలం 35 శాతం మేరకు సీసీ కెమెరాలు అమర్చినట్టు తెలిపారు. సుమారు మరో 11 వేలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉండడానికి, నేరాలు తగ్గడానికి ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, కేవీ రమణ, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page