కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు
- Guest Writer
- May 16
- 2 min read
తెలుగు తమ్ముళ్ల దగ్గర ఒక అద్భుతమైన గుణం ఉంది. జగన్ అభిమానుల దగ్గర కూడా అది మరికొంచెం ఎక్కువ పాళ్లలోనే ఉందనుకోండి. కాకపోతే జగన్ తన మాటల పొదుపుతనంతో గతకాలపు మాటలకి, ఇప్పటి మాటలకి వ్యత్యాసాలతో మరీ ఎక్కువ దొరికిపోవడం ఉండదు. చంద్రబాబు అయితే మరీ అధిక ప్రసంగం, అనవసర ప్రసంగం చేసేసి మనసులో అనిపించిందే తడవుగా అప్పటికప్పుడు పైకి అనేసి, ఆ తర్వాత కాలంలో మళ్లీ యూ టర్న్ తీసుకున్నప్పుడు చాలా ఘోరంగా దొరికిపోతుంటారు. తమ్ముళ్లంతా ఆయన అనుచరులే కాబట్టి పాపం ఆయన దొరికిపోయినట్టే వీళ్లు కూడా దొరికిపోతుంటారు. తెలుగుదేశంతో మోదీ స్నేహం కొనసాగినప్పుడు మోదీ వాళ్ల దృష్టిలో ప్రపంచ నాయకుడు. అదే మోదీ వీళ్లకి దూరంగా ఉండిపోయినప్పుడు మాత్రం పరమ కర్కోటకుడు. ఈ కోణంలో జగన్ అభిమానులకి మరీ అంత ఇబ్బంది పడాల్సిన పనుండదు. ఒకవేళ ఉంటే వాళ్లు మన తమ్ముళ్లను మించిపోతారు.
‘కూరిమి గల దినములలో నేరములెన్నడును కానగరావు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి’ అనే బద్దెనమాట వీళ్లు చాలా ఫ్రీక్వెంట్‌గా రుజువు చేస్తూ ఉంటారు. పాపం వాళ్లు ఏం చేయగలరు.. తమ నాయకుడి అడుగుజాడల్లో నడవటం తప్ప. ఆయనకు లేని స్థితమత్వం వీళ్ల దగ్గర నుంచి ఆశించడం సరికాదు.
పాయింట్ ఏంటంటే.. ఈ కింది ఫోటోలో మోదీ లోకేష్ బాబును చేతులు గట్టిగా నలిపేస్తూ తాను ప్రధానమంత్రినన్న విషయం మర్చిపోయి నాటకీయతలో నన్నెవరూ బీటవుట్ చేయకూడదనే ధోరణిలో చాలా చీప్‌గా వ్యవహరించి ఆ పదవి తాలూకు హుందాతనాన్ని నేలకు దించేశారు.

ఇది చూస్తుంటే ఇదివరకు మోదీబాబు ఇంకా ఇతర పెద్ద నేతలు కూర్చున్న వేదిక మీద బాబు మోదీకి మూడు కుర్చీల అవతల కూర్చోబోతే, ఆయన చెయ్యి పట్టుకుని గుంజేసి, బలంగా లాగేసి అదేదో కుచేలుడి తాలూకు అటుకుల మూటను బలవంతంగా లాగేసుకున్నట్టుగా వ్యవహరించారు చీప్‌గా.
మరో సందర్భంలో హైదరాబాద్ మెట్రో ప్రారంభించడానికి వచ్చి ఆ కేటీఆర్‌ని కూడా అలాగే తన పక్కన కూర్చోవాలంటూ బలాత్కరించేసి అతని బట్టల్ని నలిపేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి అలా బల ప్రయోగం చేసేస్తే పాపం అతను మటుకు ఏం చేయగలుగుతాడు.. లోలోపల బట్టలు నలిగిపోయాయని బాధపడటం తప్ప.
రెండు ఘటనల్నీ మనం గుర్తుపెట్టుకుని చూస్తే ఆ తర్వాత కాలంలో చంద్రబాబు పదవికి దూరమై 53 రోజులు జైల్లోనే పాపం ఏసీ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ ముద్దుల పట్టి, కేటీఆర్ తోబుట్టువు కవిత ఆరు నెలల పైగా తీహార్ జైల్లో సరైన ఆహారం లేకుండా గది పైకప్పు వైపు ఫ్యాన్ రెక్కల మధ్య నుంచి చూడాల్సి వచ్చింది.
ఇవన్నీ గుర్తొచ్చి మన భయం మనం పడుతుంటే అటు బాబు అభిమానులు కానీ, జగన్ బాబు అభిమానులు కానీ మనం ఎంతసేపు వాళ్లకు పడి గోలపెడుతున్నామని ఒకటే ఈసడిరపు. నా ఆందోళనలో నిజం ఉందో లేదో మీరు కూడా సరిచూసుకోండి.
- పెపకాయల రామకృష్ణ
Comments