కుర్ర మనసుల్లో క్రూర ఆలోచనలు!
- DV RAMANA
- 1 day ago
- 2 min read

టీవీలు, సెల్‌ఫోన్లు, కొన్ని సినిమాలు టీనేజర్ల మనసుల్లోకి ఎంతటి క్రూరత్వాన్ని చొప్పుస్తు న్నాయో.. అవి ఎలాంటి అనర్థాలకు దారితీస్తున్నాయో చెప్పే తాజా ఉదాహరణ చిన్నారి సహస్ర దారుణ హత్యోదంతం. తన ప్రమేయం లేకుండానే పదేళ్లకే ఆ చిన్నారి జీవితం ముగిసిపోయింది. దీనికి కారకుడు ఒక టీనేజ్ కుర్రాడే కావడం విస్మయం కలిగిస్తోంది. ఈమధ్య కాలంలో టీవీల్లో వచ్చే క్రైమ్ కహానీలు, సెల్‌ఫోన్ల ద్వారా ఇంటర్‌నెట్‌లో ఉన్న నేర ఘటనలతో పాటు.. నేరాలు ఎలా చేయాలన్న సమాచారం చూసి తప్పుదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపకాల పేరుతో రోజులో ఎక్కువ భాగం తమ పిల్లలకు దూరంగా ఉంటూ కాలక్షేపానికి సెల్‌ఫోన్లు ఇచ్చేస్తున్నారు. అలా ఇళ్లలో ఒంటరిగా ఉండే పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీల్లోని మంచి విషయాలను కాకుండా చెడు అంశాలకే ఎక్కువ ఆకర్షితులవుతున్నారన్నది మానసిక నిపుణులు చెబుతున్న మాట. ఖాళీగా ఉండే చిన్నారుల మెదళ్లు అవి చొప్పిస్తున్న విషపు ఆలోచనలతో నిండిపోయి క్రూరులుగా మార్చేస్తున్నాయి. నేరం ఎలా చేయాలి? దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి? వంటివన్నీ యూట్యూబ్ వంటి వాటిలో ఉన్న వీడియోలు చూసి వాటినే ఆచరణలో పెడుతూ చిన్న వయసులోనే పెద్ద నేరగాళ్లుగా మారి పోతున్నారు. టీనేజ్ నుంచి యుక్తవయసులోకి అడుగుపెట్టే సంధి కాలంలో మనసు, మెదుడు పరి పరి విధాలుగా ఆలోచనలు చేస్తుంటాయి. చెడు విషయాలవైపే అవి మొగ్గు చూపుతుంటాయి. ఇటువంటి కీలక తరుణంలో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, పరిశీలన కొరవడితే తెగిన గాలి పటంలో వారు తమ ఆలోచనల వెంట పరుగుతీస్తూ తప్పుడు మార్గంలోకి వెళ్లిపోతారు. తల్లిదండ్రు లు గమనించేసరికే పరిస్థితి చేయి దాటిపోతుంది. సహస్ర హత్య వ్యవహారంలోనూ అదే జరిగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన సహస్రను ఆమె తల్లిదండ్రులు ఒంటరిగా ఇంట్లో ఉంచి ఉద్యోగాలకు వెళ్లిపోతుంటే.. ఆమెను హతమార్చిన కుర్రాడి పరిస్థితి కూడా అదే. పదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడు సహస్ర అపార్ట్‌మెంట్‌కు పక్క బిల్డింగులోనే ఉంటున్నాడు. సరదాకో లేక జల్సాల కోసమో చోరీ చేయాలన్న ఆలోచన అతని పుర్రెలో పుట్టింది. దానికోసం రకరకాల వీడియో లు చూసి ఆకళింపు చేసుకున్నాడు. పక్క అపార్ట్‌మెంటులో ఉన్న సహస్ర ఇంటి పరిస్థితిని కొన్నాళ్లు గమనించి.. ఆ ఫ్లాట్‌లోనే చోరీ చేయాలని నిర్ణయానికొచ్చాడు. స్టెప్ బై స్టెప్ ఏం చేయాలన్నది సొంతం కాగితంపై సవివరమైన స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడంటే ఆ పిల్లాడు ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్‌కు ఆపరేషన్ థెఫ్ట్ అని పేరు కూడా పెట్టాడు. తాళం కట్ చేయడానికి గ్యాస్ కట్టర్, కత్తి, వంటివి కూడా సమకూర్చుకుని ఆ ఫ్లాట్‌లోకి చొరబొడ్డాడు. అయితే అక్కడే అతగాడి ప్లాన్ బెడిసికొట్టింది. ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న సహస్ర గమనించేసింది. అయినా టీనేజ్ చోరుడు ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకపోగా.. అతని ఆలోచనలు పాదరసంలా మరింత వికృతంగా ఆలోచించాయి. చోరీ చేయాలనుకున్న అతన్ని ఏకంగా హంతకుడ్ని చేసేశాయి. ఆ చిన్నారి కేకలు వేసి చుట్టుపక్కలవారిని పోగేస్తే.. తన గుట్టు రట్టవుతుందని భయపడిన ఆ కుర్రాడు.. ఎదురుదాడికి తెగబడ్డాడు. సహస్రపై పడి తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పోట్లు పొడి చారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి కొట్టుకొని మరణించింది. ఆమె మెడపై 18, కడుపులో ఏడు బలమైన కత్తిపోట్లు ఉన్నాయంటే.. టీనేజ్ నిందితుడిలో ఎంత కసి ఉందో? ఆతనిలో ఎంత క్రూరత్వం పేరుకుపోయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అనుకోకుండా హత్యకు పాల్పడినా.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు వదలకుండా పకడ్బందీగా వ్యవహరించడం మరో ఎత్తు. ఉదయం పది గంటల సమయంలో జనావాసాల్లోనే జరిగిన ఈ దారుణాన్ని ఎవరూ గమనించలేక పోయారు. మధ్యాహ్నం భోజనానికి బాలిక తండ్రి వచ్చిన తర్వాతే అది బయటపడిరది. పోలీసులకు కూడా ఐదోరోజుల పాటు ఒక్క క్లూ కూడా లభించకుండా ఈ కేసు ముప్పుతిప్పలు పెట్టింది. చుట్టు పక్కల సీసీటీవీల ఫుటేజీలను ఎన్నిసార్లు తిప్పితిప్పి చూసినా చిన్న ఆధారమైనా లభించలేదు. కానీ ఒక వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన చిన్న క్లూతో ఎట్టకేలకు నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హత్యకు పాల్పడిరది ఒక టీనేజర్ తెలుసుకుని అవాక్కయ్యారు. ఒంటరితనం, ఇంటర్‌నెట్ వంటివి టీనేజర్లలో నేరప్రవృత్తి పెంచుతున్నాయనడానికి ఇదో ప్రబల తార్కాణం.
Comments